సెలవు తీసుకున్న రుతుపవనం.. భారత వాతావరణ విభాగం వెల్లడి

- భారత్ నుంచి పూర్తిగా నిష్క్రమణ
- లోటువర్షపాత ఏడాదిగా 2023
న్యూఢిల్లీ : భారతదేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయి. ఈ వర్షాకాల సీజన్.. లోటువర్షపాతంతో ముగిసింది. సాధారణంగా అక్టోబర్ 15 నాటికి రుతుపవనాలు నిష్క్రమించాల్సి ఉండగా.. నాలుగు రోజుల తర్వాత వెళ్లిపోయాయని భారత వాతావరణ విభాగం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజుల్లో దక్షిణాదిలో ఈశాన్య రుతుపవనాల ఏర్పాటుకు రంగం సిద్ధమైందని పేర్కొన్నది. నైరుతి రుతుపవనాల నిష్క్రమణలో జాప్యం జరుగడంతో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉండేందుకు ఆస్కారం ఉన్నదని తెలిపింది.
ఈ రుతుపవన సీజన్.. ఎల్ నినో పరిస్థితులు బలపడుతున్నాయన్న సంకేతాల నడుమ జూన్-సెప్టెంబర్‌లో దీర్ఘకాలిక సగటు 868.6 మిల్లీమీటర్లకంటే తక్కువగా 820 మిల్లీ మీటర్లు నమోదై.. లోటు వర్షపాతంతో ముగిసిందని వెల్లడించింది. మధ్య ఆరేబియా సముద్రానికి సమీపంలో ఈశాన్య ప్రాంతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, అది పశ్చిమ దిశగా కదులుతున్నదని తెలిపింది.
ఇది పశ్చిమ ఈశాన్య దిశగా కదులుతూ రానున్న 24 గంటల వ్యవధిలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని వెల్లడించింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలోనూ వాయుగుండం ఉన్నదని, దీని ప్రభావంతో అక్టోబర్ 21 ఉదయానికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని, అక్టోబర్ 23 నాటికి అది మరింత బలపడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.