MUDA scam case । చిక్కుల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. ముడా కేసులో విచారణకు స్పెషల్‌ కోర్టు అనుమతి

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర చిక్కుల్లో పడ్డారు. మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (muda) కేసులో ఆయనను లోకాయుక్త విచారించేందుకు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు బుధవారం అనుమతి మంజూరు చేసింది.

MUDA scam case । చిక్కుల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. ముడా కేసులో విచారణకు స్పెషల్‌ కోర్టు అనుమతి

MUDA scam case । కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర చిక్కుల్లో పడ్డారు. మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ  (muda) కేసులో ఆయనను లోకాయుక్త విచారించేందుకు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు బుధవారం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన జడ్జి సంతోష్‌ గజానన భట్‌  కేసులో విచారణకు మైసూరు జిల్లా లోకాయుక్త సూపరింటెండెట్‌ను నియమించారు. 2024 డిసెంబర్‌ నాటికి నివేదిక అందించాలని లోకాయుక్తను కోర్టు కోరింది. సీఆర్పీసీ 156 (3) సెక్షన్‌ కింద విచారణ జరపాలని కోర్టు పేర్కొన్నది. మైసూరులో 14 ప్లాట్లను సిద్ధరామయ్య భార్య పార్వతికి ముడా కేటాయించిందనే అభియోగాలను ముఖ్యమంత్రి ఎదుర్కొంటున్నారు.

పిటిషనర్లలో ఒకరైన స్నేహమయి కృష్ణ.. ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో సిద్ధరామయ్యపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసి, కేసు విచారణ ప్రారంభిస్తారు. విచారణాధికారికి సిద్ధరామయ్యను ప్రశ్నించే, అరెస్టు చేసే అధికారం ఉంటుంది. ఇంతకు ముందు స్నేహమయి కృష్ణ ఇదే విషయంలో గవర్నర్‌కు పిటిషన్‌ పెట్టుకోగా.. ముఖ్యమంత్రిని విచారించేందుకు అనుమతి కూడా లభించింది. అయితే.. దానిని కర్ణాటక హైకోర్టు నిలిపివేసింది. హైకోర్టు ఉత్తర్వుల కాపీని స్నేహమయి కృష్ణ బుధవారం స్పెషల్‌ కోర్టు అందించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో సిద్ధరామయ్యపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు విచారణాధికారికి అధికారం ఉంటుంది. ముఖ్యమంత్రిని కస్టడీలోకి కూడా తీసుకునే, అరెస్టు చేసే అధికారం కూడా ఉంటుంది. ఇది మొదటి అడుగేనని స్నేహమయి కృష్ణ తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది లక్ష్మీ అయ్యంగార్‌ అన్నారు.

భయపడేది లేదు: సిద్ధరామయ్య

తనపై విచారణకు స్పెషల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేయడంపై భయపడేది లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం స్పష్టం చేశారు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని చెప్పారు. తన భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను త్వరలోనే నిర్ణయించుకుంటానని తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు.