P.M MODI | బీజేపీని టైటానిక్‌తో పోల్చుతూ సుబ్రమణ్యస్వామి సంచలన ట్వీట్‌.. మోదీపై ఏమన్నారంటే..

ప్రధాని మోదీ బీజేపీలో ఉంటే ఆ పార్టీ టైటానిక్‌ షిప్‌లా మునిగిపోవడం ఖాయమని ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్‌ నాయకుడు సుబ్రమణ్య స్వామి హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఎక్స్‌లో ఆయన ఒక సంచలన పోస్ట్‌ పెట్టారు.

P.M MODI | బీజేపీని టైటానిక్‌తో పోల్చుతూ సుబ్రమణ్యస్వామి సంచలన ట్వీట్‌.. మోదీపై ఏమన్నారంటే..

న్యూఢిల్లీ : ప్రధాని మోదీ బీజేపీలో ఉంటే ఆ పార్టీ టైటానిక్‌ షిప్‌లా మునిగిపోవడం ఖాయమని ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్‌ నాయకుడు సుబ్రమణ్య స్వామి హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఎక్స్‌లో ఆయన ఒక సంచలన పోస్ట్‌ పెట్టారు. ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీజేపీ శాశ్వతంగా మునిగిపోవటానికి సంకేతాలని పేర్కొన్నారు. ‘బీజేపీలో ఉన్న మనం మన పార్టీ టైటానిక్‌ షిప్‌లో మునిపోవడం చూడాలనుకుంటూ దానికి ఉత్తమ కమాండ్‌ మోదీయే’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల వివిధ రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే దారుణ పరాభవాలు చవిచూడటం, ఇండియా కూటమి పది సీట్లలో విజయం సాధించిన నేపథ్యంలో స్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇండియా కూటమిలో కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ అత్యధిక సీట్లు గెల్చుకున్నాయి. ఈ రెండు పార్టీలకు చెరి నాలుగు సీట్లు లభించగా, బీజేపీకి రెండు చోట్ల విజయాలు దక్కాయి. బీహార్‌లో ఎన్డీయే భాగస్వామ్యపక్షం జేడీయూను ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఓడించారు. ఇప్పటికే అయోధ్యలో బీజేపీ ఓటమి తర్వాత ఇప్పుడు మరో పుణ్యక్షేత్రం ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌లో బీజేపీ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓడిపోవడం సంచలనం రేపింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ ప్రధానంగా ప్రస్తావిస్తూ హిందూ మతానికి ప్రాధాన్యం ఉన్న ప్రాంతాల్లో ఓటర్లు బీజేపీ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నారనేందుకు అయోధ్య, తాజాగా బద్రీనాథ్‌లో ఆ పార్టీ పరాజయాలు నిదర్శనాలని పేర్కొంటున్నది.

కొంతకాలంగా బీజేపీ అగ్రనేతలైన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలపై సుబ్రమణ్య స్వామి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. మోదీ ప్రభుత్వం జూన్‌ 25ను రాజ్యంగా హత్యాదినంగా ప్రకటించినప్పుడు ‘ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో మోదీ, అమిత్‌షా కృషి ఏంటి? క్రెడిట్‌ కొట్టేయడం చాలా చెడ్డ రోగం’ అని ఎక్స్‌లో స్పందించారు. ఇటీవల మోదీ రష్యా పర్యటన సందర్భంగా ఎక్స్‌లో స్పందించిన సుబ్రమణ్యస్వామి.. అది భారత్‌, అమెరికా సంబంధాలపై తీవ్ర పర్యవసానాలను చూపుతుందని పేర్కొన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం నితీశ్‌కుమార్‌, చంద్రబాబు పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడంపైనా స్పందించిన స్వామి.. 2024 లోక్‌సభ ఎన్నికల అత్యంత వినాశకర ఫలితం ఏంటంటే.. తాను కూడేసుకున్న సమూహం.. ఆయన నమస్తే చెప్పడానికి ముందే చెల్లాచెదురైపోతుంది’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రజలను ఎవరూ అసులుగా తీసుకోకూడదని మోదీకి ఇంకా అర్థం కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది’ అంటూ ఆ ట్వీట్‌ను స్వామి ముగించారు.