మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ స్కూళ్లు అంటే పేదళ్ల కోసమే కాదనే అభిప్రాయం కల్గించడం, అద్భుతమైన విద్యబోధనతో ఢిల్లీ సర్కారీ స్కూళ్లు ప్రైవేటుకు దీటుగా నిలిచాయి.

  • ఢిల్లీలో ప్రభుత్వ విద్యపై కేంద్రీకరించిన ఆప్‌
  • ప్రభుత్వ పాఠశాల్లలో గణనీయంగా తగ్గిన డ్రాపౌట్‌ రేట్‌
  • మౌలిక సదుపాయాలు, బోధనా పద్ధతులపై కేంద్రీకరణ
  • ఫలితాలనిచ్చిన ఆప్‌ విద్యా సంస్కరణలు

న్యూఢిల్లీ : దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 15-20 ఏళ్ల కాలంలో ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్న వారే ఇప్పుడు ప్రముఖులుగా ఉన్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. అప్పట్లో ప్రైవేటు స్కూళ్లు ఉండేవి కావని గుర్తు చేశారు. ఆప్‌ ప్రభుత్వం విద్యారంగంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. సోమవారం ఢిల్లీలోని సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఆడిటోరియాన్ని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రారంభించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న మౌలిక సదుపాయాలు టాప్‌ పొజిషన్‌లో ఉన్న ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ఉన్నాయని నొక్కి చెప్పారు. ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను గత ఎనిమిదేళ్లలో పూర్తిస్థాయిలో మార్చివేశామని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లు ప్రఖ్యాత ప్రైవేటు స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోవని స్పష్టం చేశారు. అక్కడ చదువుతున్న పిల్లల్లో కూడా విశ్వాసం పెరిగిందని చెప్పారు. ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులకంటే ధీమాతో వారు ఉండటాన్ని గమనించవ్చని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఒకప్పుడు డ్రాపౌట్‌ రేటు చాలా ఎక్కువ ఉండేదని, పాఠాలు సరిగా చెప్పరనే అభిప్రాయం ఉండేదని సీఎం అన్నారు. కానీ.. తమ ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించిందని చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 18లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని కేజ్రవాల్‌ వివరించారు.


విద్యపై ఆప్‌ శ్రద్ధ

నేటి బాలలే రేపటి పౌరులు అన్న వాస్తవాన్ని గుర్తించిన ఆప్‌ ప్రభుత్వం.. విద్యార్థిగా ఉన్నప్పుడే సమర్థ భావిపౌరులుగా తీర్చిదిద్దడంపై దృష్టి కేంద్రీకరించింది. అక్కడ చదువుకోవడానికి వచ్చే వారికి, ఉపాధ్యాయులకు గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగింది. ఆ క్రమంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రైవేటు స్కూళ్లలో లక్షలు పోసి నేర్పించేదే అసలైన విద్య అన్న పరిస్థితులను మార్చివేసింది. బడ్జెట్‌లో ఏకంగా 25 శాతం కేటాయించింది. నిజానికి ప్రభుత్వస్కూళ్లకు ఎదురయ్యే ప్రధాన సమస్య డ్రాపౌట్లు. దీనిని అధిగమించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ముందుగా పాఠశాలలను పరిశుభ్రంగా తీర్చిదిద్దింది. విద్యార్థులు కూర్చొనడానికి తగినన్ని బల్లలు సమకూర్చింది. టాయిలెట్లు ఏర్పాటు చేసింది. మంచినీటి వసతిని కల్పించింది. తద్వారా ప్రభుత్వ పాఠశాలలు అంటే ద్వితీయ శ్రేణి పౌరుల పిల్లలు చదివేవి అనే అభిప్రాయాన్ని తొలగించింది. ఉపాధ్యాయులకూ అంతటి గౌరవాన్ని ఇచ్చింది.

మౌలిక సదుపాయల కల్పన

తదుపరి ఆయా స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చింది. ‘మంచి ఉపాధ్యాయులైతే చెట్టు కింద పాఠాలు చెప్పినా అద్భుతమైన విద్యార్థులను తీర్చిదిద్దగలరని చెబుతారు. కానీ.. వాస్తవానికి ఇలా మాటలు చెప్పేవారిలో ఎంతమంది తమ పిల్లలను అటువంటి చెట్టు కింద స్కూళ్లకు పంపగలరు? అని ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిశి ఇటీవల కేరళలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రశ్నించారు. అందుకే ఆప్‌ ప్రభుత్వం పాఠాలు బోధించే తరగతి గదిపై దృష్టి పెట్టింది.


ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులకు శిక్షణ

ఉపాధ్యాయులను ఐఐఎం అహ్మదాబాద్‌ వంటి దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థలకు, విదేశాలకు పంపించి.. వారికి నైపుణ్యాలు కలిగించింది. వీటన్నింటి కారణంగా విద్యార్థుల్లోనూ, ఉపాధ్యాయుల్లోనూ ఒక నమ్మకం ఏర్పడింది. ‘టీచర్లకు పోటీలు నిర్వహించడం, స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించడంతో ప్రభుత్వ పాఠశాలల పట్ల ఆసక్తి పెరిగింది. పాఠ్యాంశాల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకుని పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నది. అందుకే గత నాలుగేళ్లలోనే మూడు లక్షల మంది పిల్లలు ప్రైవేటు స్కూళ్లను వదిలి.. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. బోర్డ్‌, ఎంట్రన్స్‌ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గణనీయ విజయాలు సాధిస్తున్నారు.

TAAZ

TAAZ

Next Story