Dharmendra Pradhan | లా కోర్సులో మనుస్మృతిని చేర్చబోం: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం పాఠ్యాంశాల్లో మనుస్మృతిని చేర్చేది లేదని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ తేల్చి చెప్పారు. మనుస్మృతిని లా కోర్సులో చేర్చే విషయంలో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసున్నారు

Dharmendra Pradhan | లా కోర్సులో మనుస్మృతిని చేర్చబోం: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

న్యూఢిల్లీ : ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం పాఠ్యాంశాల్లో మనుస్మృతిని చేర్చేది లేదని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ తేల్చి చెప్పారు. మనుస్మృతిని లా కోర్సులో చేర్చే విషయంలో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసున్నారు. ఇదే విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా శుక్రవారం స్పందిస్తూ.. వివాదాస్పద ప్రతిలోని ఏ భాగాన్ని కూడా కరికులంలో చేర్చేది లేదని పేర్కొన్నారు. గురువారం ఈ విషయంలో ఢిల్లీ వర్సిటీ వీసీ స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ విషయం తెలిపారు. నిజమైన రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని చెప్పారు.

‘లా ఫ్యాకల్టీ కోర్సులో మనుస్మృతిని భాగం చేస్తారన్న సమాచారం నాకు నిన్న (గురువారం) అందింది. ఈ విషయంలో ఢిల్లీ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌తో మాట్లాడాను. కొంతమంది లా ఫ్యాకల్టీ సభ్యులు న్యాయ తత్వశాస్త్రం అధ్యాయంలో కొన్ని మార్పులు సూచించారని ఆయన చెప్పారు’ అని ప్రధాన్‌ హైదరాబాద్‌లో మీడియాకు చెప్పారు. ‘అటువంటి ప్రతిపాదనలను ఆమోదించేది లేదు. గురువారం కూడా వీసీ స్వయంగా ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు. భవిష్యత్‌ దృక్కోణంతో మేం అంతా రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం. ఎలాంటి వివాదాస్పద భాగాన్నైనా చేర్చే ప్రశ్నే లేదు’ అని ప్రధాన్‌ తెలిపారు.

ఢిల్లీ యూనివర్సిటీ ఎల్‌ఎల్‌బీ విద్యార్థులకు మనుస్మృతిని బోధించాలనే అంశంలో వర్సిటీ అకడమిక్‌ కౌన్సిల్‌లో ప్రతిపాదన చర్చకు వచ్చింది. దీన్ని కొంతమంది అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో ఆ ప్రతిపాదనకు ఆమోదం లభించలేదు. లా ఫ్యాకల్టీలోని కొందరు తొలి, మూడో సంవత్సరం విద్యార్థులకు మనుస్మృతిని బోధించే ఢిల్లీ వర్సిటీ అత్యున్నత నిర్ణాయక కమిటీ ఆమోదాన్ని కోరారు. ఈ మేరకు సిలబస్‌ను సవరించాలని ప్రతిపాదించారు. ఎల్‌ఎల్‌బీ ఒకటి, ఆరో సెమిస్టర్‌ సిలబస్‌లో ఈ మార్పులు చేయాలని కోరారు. అయితే.. ఈ ప్రతిపాదనలను తిరస్కరించినట్టు వర్సిటీ వీసీ ప్రకటించారు.