వ్యాపార‌వేత్త‌పై వీధికుక్క‌ల దాడి.. బ్రెయిన్ హెమ‌రేజ్‌తో మృతి

వ్యాపార‌వేత్త‌పై వీధికుక్క‌ల దాడి.. బ్రెయిన్ హెమ‌రేజ్‌తో మృతి

విధాత‌: ప్ర‌ముఖ వ్యాపారవేత్త‌, వాఘ్ బ‌క్రీ టీ య‌జ‌మాని, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ పరాగ్ దేశాయి(49) ఇక లేరు. వీధి కుక్క‌ల దాడిలో గాయ‌ప‌డ్డ ఆయ‌న ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని వాఘ్ బ‌క్రీ టీ కంపెనీ అధికారికంగా వెల్ల‌డించింది.


వివ‌రాల్లోకి వెళ్తే.. అహ్మ‌దాబాద్‌లో నివాస‌ముంటున్న ప‌రాగ్ దేశాయి.. ఈ నెల 15వ తేదీన మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లారు. ఇంటికి స‌మీపంలోని పార్కులో వాకింగ్ చేస్తుండ‌గా, వీధి కుక్క‌లు ఆయ‌న‌పై దాడి చేశాయి. దీంతో కుక్క‌ల దాడి నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో ఆయ‌న కింద ప‌డిపోయారు. స్థానికుల స‌మాచారంతో ప‌రాగ్‌ను కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే అప‌స్మార‌క‌స్థితిలో ఉన్న ప‌రాగ్.. బ్రెయిన్ హెమ‌రేజ్ కార‌ణంగా ఆదివారం తుదిశ్వాస విడిచారు. వారం రోజుల పాటు చికిత్స పొంది, చివ‌ర‌కు నిన్న క‌న్నుమూశారు.


వాఘ్ బ‌క్రీ టీ కంపెనీ ఇద్ద‌రు ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ల‌లో ప‌రాగ్ దేశాయి ఒక‌రు. కంపెనీని ఈ-కామ‌ర్స్‌లోకి తీసుకెళ్ల‌డంలో ప‌రాగ్ కీల‌క‌పాత్ర పోషించారు. కంపెనీ సేల్స్, మార్కెటింగ్, ఎక్స్‌పోర్టు వంటి ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించేవారు. ప్ర‌స్తుతం ఈ కంపెనీ ట‌ర్నోవ‌ర్ రూ. 2 వేల కోట్లు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వాఘ్ బ‌క్రీ కంపెనీ త‌మ కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హిస్తోంది. ప‌రాగ్ దేశాయి అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు.