Kejriwal । కేజ్రీవాల్ విడుదల.. జాతి వ్యతిరేక శక్తులపై తన పోరాటం ఆగదన్న ఢిల్లీ సీఎం
జైళ్లు తనను బలహీనపర్చలేవని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బెయిల్పై బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఆప్ శ్రేణులనుద్దేశించి మాట్లాడారు. దేశాన్ని నాశనం చేస్తున్న జాతి వ్యతిరేక శక్తులపై తన పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

Kejriwal । దేశాన్ని బలహీనం చేస్తున్న జాతి వ్యతిరేకత శక్తులపై తన పోరాటం కొనసాగుతుందని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం సాయత్రం ఆయన తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్న ఆప్ శ్రేణులు, నాయకులు, ప్రజలనుద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. జైళ్లు తనను బలహీనపర్చలేవని స్పష్టం చేశారు. ఇప్పుడు తన నైతికబలం మునుపటికంటే మరింత పెరిగిందని కేజ్రీవాల్ చెప్పారు.
తన వాహనం పై నుంచి మాట్లాడిన ఢిల్లీ సీఎం.. తన విడుదల కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తన కోసం ఇక్కడికి వచ్చారంటూ సంతోషం వ్యక్తం చేశారు. ‘నా ఒంట్లో ప్రతి రక్తం బొట్టు ఈ దేశ సేవ కోసం అంకితం. నాకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. కానీ.. దేవుడు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నాడు’ అని కేజ్రీవాల్ చెప్పారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ విడుదల ఆప్ శ్రేణులకు కొత్త బలాన్నిచ్చినట్టయింది. కేజ్రీవాల్ హర్యనాకు చెందినవారే. దీనితోపాటు వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో కేజ్రీవాల్ విడుదల కావడంపై ఆప్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..