‘పందుల‘ పంచాయితీలో పైసలు దండుకున్నారు.. ఎక్కడ? ఏమా కథ?

బీఆర్ఎస్ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. భూ, ఇసుక, నల్లమట్టి దందాలు జిల్లాలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి. చివరకు వారి అక్రమ దందా పందులను కూడా వదలలేదు

  • By: Subbu    news    Jan 03, 2024 1:22 PM IST
‘పందుల‘ పంచాయితీలో పైసలు దండుకున్నారు.. ఎక్కడ? ఏమా కథ?

– పందులను అమ్మిన సంఘటనలో

మున్సిపల్ చైర్ పర్సన్ భర్తపై ఆరోపణలు

– 88 టన్నుల పందుల విక్రయం

– రూ.కోటి ఇరవై లక్షలకు విక్రయించారని ఆరోపణలు

– బీఆర్ఎస్ నేతల పందుల దందా

– పోలీసుల విచారణలో వెలుగు చూస్తున్న వైనం

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: బీఆర్ఎస్ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. భూ, ఇసుక, నల్లమట్టి దందాలు జిల్లాలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి. చివరకు వారి అక్రమ దందా పందులను కూడా వదలలేదు. పందుల దందా అంటే వేలల్లో, లక్షల్లో కాదు ఏకంగా కోట్ల రూపాయలు దండుకున్నారు. ఈ తతంగం అంతా జడ్చర్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నేతలు చేసిన ఘనకార్యం. బాధితుల ఫిర్యాదుతో నేతల అక్రమ దందాను పోలీసులు తవ్వి తీస్తున్నారు. వివరాల్లోకి వెళితే… జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో పందుల బెడద ఎక్కువగా ఉంది. దీంతో వాటిని నిర్మూలించాలని గత ఏడాది పట్టణ ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు అప్పట్లో పందుల నిర్మూలనకు శ్రీకారం చుట్టారు. పట్టణంలో పందుల పెంపకందారులకు తెలియకుండా మున్సిపల్ అధికారులు ఇతర రాష్ట్రాలకు విడతల వారీగా పందులను విక్రయించారు.


పట్టణంలో పందులు కనిపించకుండా పోవడంతో వాటి పెంపకందారులు ఆందోళన వ్యక్తం చేస్తూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా ఏడాది క్రితం జరిగిన సంఘటన కావడం విశేషo. అప్పటి నుంచి పోలీసులు విచారణలో అలసత్వం వహిస్తూవచ్చారు. ఈ విక్రయాల్లో బీఆర్ఎస్ నేతల హస్తం ఉండడంతో పోలీసులు వారికే మద్దతుగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో పోలీసులపై ఒత్తిడి రావడంతో బీఆర్ఎస్ నేత, మున్సిపల్ చైర్ పర్సన్ భర్తపై ఇటు పోలీసులు, అటు ఆ పార్టీ కౌన్సిలర్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. చైర్ పర్సన్ భర్త పందుల విక్రయం చేపట్టారనే విషయం వెలుగులోకి వచ్చింది.


గత ఏడాదిలో విడతల వారీగా 88 టన్నుల పందులను విక్రయించినట్లు పోలీసుల విచారణలో బట్టబయలైంది. వీటిని కోటి ఇరవై లక్షల రూపాయలకు ఇతర రాష్ట్రాల్లో విక్రయించినట్లు విచారణలో గుర్తించారు. ఈ దందాలో మున్సిపల్ చైర్ పర్సన్ భర్త పాత్ర ఉన్నట్లు ఆ పార్టీకి చెందిన వారే ఆరోపణలు చేస్తున్నారు. ఈ పంచాయితీని కొందరు కౌన్సిలర్లు అప్పటి ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ డబ్బు రికవరీ చేసి బాధితులకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. కానీ ప్రస్తుతం కూడా ఈ పందుల పంచాయితీ మలుపులు తిరుగుతూనే ఉంది. ప్రస్తుత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వద్ద కూడా ఈ పందుల పంచాయితీ నడుస్తోంది.

మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి గండం

జడ్చర్ల పందుల విక్రయం పంచాయితీ మున్సిపల్ చైర్ పర్సన్ పదవికే చేటు తెచ్చేట్టుగా మారింది. ఈ కేసులో చైర్ పర్సన్ భర్తపై ఆరోపణలు రావడంతో సొంత పార్టీ కౌన్సిలర్లు చైర్ పర్సన్ పై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని అ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డికి చెప్పారు. సత్వరమే అవిశ్వాసం పెట్టి చైర్ పర్సన్ ను గద్దె దించాలని పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు పట్టుబట్టారు. రెండు, మూడు రోజుల్లో అధిష్టానం నుంచి అవిశ్వాసానికి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ కౌన్సిలర్లు వెల్లడిస్తున్నారు.