పాడి కౌశిక్ రెడ్డికి.. హైకోర్టులో ఊరట!

విధాత : డబ్బులివ్వాలంటూ ఓ వ్యాపారిని బెదిరించిన కేసులో అరెస్టు చేయరాదంటూ హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో తాత్కాలిక ఊరట దక్కింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు తనను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందని అలా జరగకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కౌశిక్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు బీఆర్ఎస్ రజతోత్సవ సభ వరకు అతనిని అరెస్ట్ చేయవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చింది.
హన్మకొండకు చెందిన క్వారీ వ్యాపారీ మనోజ్ రెడ్డిని రూ.50 లక్షలు ఇవ్వకుంటే చంపుతానంటూ కౌశిక్ రెడ్డి బెదిరించిన ఘటనపై బాధితుడి భార్య కట్టా ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. గతంలోనూ ఇలాగే బెదిరించి రూ.25లక్షలు తీసుకున్నాడని..మళ్లీ 50లక్షలు కావాలని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో ఆరోపించారు.