Delhi: ఫీజుల పెంపుపై.. ఢిల్లీ సీఎం రేఖాగుప్తా సీరియస్

  • By: sr    news    Apr 15, 2025 7:21 PM IST
Delhi: ఫీజుల పెంపుపై.. ఢిల్లీ సీఎం రేఖాగుప్తా సీరియస్

విధాత: రాజధాని ఢిల్లీ పాఠశాలల్లో ఏకపక్షంగా ఫీజుల పెంపుపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తీవ్రంగా స్పందించారు. పాఠశాలల్లో అడ్డగోలుగా ఫీజులు పెంచడం, విద్యార్థులు, తల్లిదండ్రులను వేధించడం వంటి చర్యలను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. అలా చేస్తే పాఠశాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు.

నగరంలోని మోడల్‌ టౌన్‌ క్వీన్‌ మేరీ స్కూల్‌ యాజమాన్యం ఫీజుల వసూళ్లపై విద్యార్థులను వేధింపులకు గురి చేయడంతో పాటు ఫీజులు చెల్లించని వారిని పాఠశాల నుంచి బహిష్కరించింది. ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సీఎం రేఖా గుప్తాను కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన రేఖా గుప్తా అడ్డగోలు ఫీజుల పెంపు తగదని..నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఫిర్యాదులు అందిన పాఠశాలలకు నోటీసులు పంపుతామని.. ఆయా పాఠశాలల రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. క్వీన్‌ మేరీ స్కూల్‌ ఘటనపై తక్షణమే దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పిల్లల హక్కులను కాపాడటానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.