హైదరాబాద్‌లో కాల్పుల కలకలం!

  • By: sr    news    Mar 29, 2025 4:09 PM IST
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం!

విధాత : హైదరాబాద్‌లో తుపాకీ కాల్పుల సంఘటన కలకలం రేపింది. గుడిమల్కాపూర్ లోని కింగ్స్ ప్యాలెస్ లో ఆనం మీర్జా ఏర్పాటు చేసిన ఎక్స్ పో లో ఇద్దరు దుకాణాదారుల మధ్య గొడవ కాల్పులకు దారితీసింది. ఇద్దరు షాప్ ఓనర్ల మధ్య గొడవ జరుగుతున్న సమయంలో నిందితుడు అసీఫుద్దీన్ అలియాస్ హైదర్ రెండు రౌండ్లు ఫైరింగ్ చేశాడు. తన లైసెన్స్ డ్ రివాల్వర్ తో గాలిలోకి కాల్పులు జరిపాడు. గొడవకు హైదర్ కు సంబంధం లేకపోయినప్పటికి మధ్యలో వెళ్లి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు.

అయితే వారు అసిఫుద్ధీన్ ను కొట్టేందుకు ప్రయత్నించడంతో తను గాలిలోకి కాల్పులు జరిపాడు. నిందితుడు రివాల్వర్ తో గాల్లోకి కాల్పులు జరపడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎక్స్ పోకు వచ్చిన జనం కాల్పుల ఘటనతో ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో అర్ధం కాక సందర్శకులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆనం మీర్జా… ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి. రంజాన్ సీజన్ నేపథ్యంలో ఆమె తన పేరిట ఎక్స్ పో ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. నిందితుడు పరిగి సమీపంలోని గ్రామానికి మాజీ సర్పంచ్ గా పనిచేశారని..ప్రస్తుతం ఏసీ గార్డెన్ లో నివాసం ఉంటున్నాడని స్థానిక ఏసీపీ తెలిపారు. నిందితుడు అసిఫుద్ధిన్ అరెస్టు చేశామని..రివాల్వార్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.