Bhu Bharathi | ధరణిలో లేని.. భూభారతిలో ఉన్న కీలక ఆప్షన్‌ ఇదే!

గతంలో తాసిల్దారు పరిష్కరించే చిన్న చిన్న సమస్యలు కూడా కలెక్టర్ దగ్గరికి వచ్చేవని, వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పరిష్కారంలో తీవ్ర జాప్యం అయ్యేదని చెప్పారు. భూభారతి ద్వారా కింది స్థాయి అధికారులకు కూడా బాధ్యతలు అప్పగించడంతో భూమికి సంబంధించిన చిన్న సమస్యలు మండల స్థాయిలోనే, అదికూడా సత్వరం పరిష్కారం అవుతాయని కలెక్టర్‌ వివరించారు.

  • By: TAAZ    news    Apr 19, 2025 4:17 PM IST
Bhu Bharathi | ధరణిలో లేని.. భూభారతిలో ఉన్న కీలక ఆప్షన్‌ ఇదే!
  • భూ భారతి రైతుల చుట్టం: అవగాహన సదస్సులో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి

Bhu Bharathi | రైతుల భూములకు భూభారతి చట్టం భరోసా కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ధరణి స్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ భూభారతి చట్టం (భూమి హక్కుల రికార్డు చట్టం)-2025 పై శనివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల కోసం, ప్రత్యేకించి రైతులకు వారి భూములపై భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ధరణి పోర్టల్‌లో లేని అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభించనున్నదని తెలిపారు. రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ చట్టం అమలు చేస్తున్నారని, తదుపరి భూములకు సంబంధించి న సమస్యలపై రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరం ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి వచ్చేదని చెప్పారు. భూ సమస్యలు పరిష్కరిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల పై ఏవైనా అభ్యంతరాలుంటే భూ భారతి ప్రకారం అప్పీలు చేసుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు.

గతంలో తాసిల్దారు పరిష్కరించే చిన్న చిన్న సమస్యలు కూడా కలెక్టర్ దగ్గరికి వచ్చేవని, వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పరిష్కారంలో తీవ్ర జాప్యం అయ్యేదని చెప్పారు. భూభారతి ద్వారా కింది స్థాయి అధికారులకు కూడా బాధ్యతలు అప్పగించడంతో భూమికి సంబంధించిన చిన్న సమస్యలు మండల స్థాయిలోనే, అదికూడా సత్వరం పరిష్కారం అవుతాయని కలెక్టర్‌ వివరించారు. ధరణిలో భూ సమస్యలపై దరఖాస్తు చేసుకునేందుకు 33 మాడ్యూల్స్ పొందుపరచారని, దీనివల్ల ఏ సమస్యకు ఏ మాడ్యూల్‌లో దరఖాస్తు చేయాలో రైతులకు అర్థమయ్యేది కాదని అన్నారు. భూభారతిలో 4 మాడ్యూల్స్ మాత్రమే ఉండి సులభమైన దరఖాస్తు ప్రక్రియ ఉంటుందని వివరించారు.

భూములకు సంబంధించిన అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం దొరికిందని కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణిలో ఇలాంటి ఆకాశం లేదన్నారు. భూభారతి చట్టం వల్ల రైతులకు, పేదలకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. ఎంతోమంది మేధావులు, అధికారులు భూభారతి చట్టానికి రూపకల్పన చేశారని వివరించారు. హుజూరాబాద్ ఆర్డీవో రమేశ్‌ మాట్లాడుతూ భూభారతి చట్టంలోని సెక్షన్లు, వాటి వివరాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఏదైనా సమస్య పరిష్కారం కాకుంటే భూభారతిలో మూడంచెల అప్పీలు వ్య వవస్థ ఉన్నదని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, తాసిల్దార్‌ కనకయ్య, రెవిన్యూ, వ్యవసాయ, పంచాయతీ అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.