ktr, harish: హరీశ్.. కేటీఆర్ భేటీ.. ఏం చర్చించారు?.. రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ

బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు భేటీ ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. హరీశ్ రావుకు బీఆర్ ఎస్ పార్టీలో పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదని.. ఆయనను పక్కన పెట్టేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిని హరీశ్ ఖండించినా వార్తలు ఆగడం లేదు. ఈ పరిస్థితుల్లో వీరిద్దరూ రెండు గంటల పాటు సుధీర్ఘంగా చర్చించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.

ktr, harish: హరీశ్.. కేటీఆర్ భేటీ.. ఏం చర్చించారు?.. రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ

ktr, harish:  విధాత, హైదరాబాద్ : బీఆర్ ఎస్ వర్కంగ్ ప్రెసిడెండ్ కేటీఆర్.. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు భేటీ ఇప్పుడు రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నది. హరీశ్ రావు, కేటీఆర్ కు మధ్య రాజకీయ విబేధాలు ఉన్నాయని.. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో హరీశ్ రావును పూర్తిగా పక్కన పెట్టేశారని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

మరోవైపు కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించినా తనకు ఎటువంటి అభ్యంతరం లేదని హరీశ్ రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరి భేటీపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. శుక్రవారం కేటీఆర్ స్వయంగా హరీశ్ రావు నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు.

కవిత, హరీశ్ అసంతృప్తి?
బీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు సాగుతున్నాయని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతున్నది. కవిత, హరీశ్ రావు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని కూడా ఊహాగానాలు వినిపించాయి. ఓ దశలో కవిత మరో రాజకీయపార్టీ పెడతారని కూడా వార్తలు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతుందన్న చర్చ జోరందుకున్నది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పెద్దగా బయటకు రావడం లేదు.

రజతోత్సవ సభలో ప్రసంగించిన అనంతరం ఆయన మళ్లీ బయటకు రాలేదు. అన్ని వ్యవహారాలను కేటీఆర్ చూసుకుంటున్నారు. కాగా కేటీఆర్ కే పార్టీలో అత్యంత ప్రాధాన్యత దక్కుతున్నదని.. హరీశ్ రావు, కవితను పెద్దగా పట్టించుకోవడం లేదని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకున్నది.

దాదాపు 2 గంటల పాటు హరీశ్ రావు, కేటీఆర్ తాజా రాజకీయ పరిస్థితుల మీద సుధీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ఈ భేటీకి సంబంధించిన అధికారిక సమాచారం ఏదీ బయటకు రాకపోయినప్పటికీ.. పార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాల మీదే ఈ ఇద్దరు చర్చించుకుంటున్నట్టు తెలుస్తున్నది.