KTR | ఆ భూములు ఎవరికిచ్చినా.. మేం వచ్చాక తీసుకుంటాం.. : కేటీఆర్‌

కాంగ్రెస్ ప్రభుత్వం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఇప్పుడు ఎవరికి ఇచ్చినా... తాము అధికారంలోకి రాగానే తిరిగి వాటిని వెనక్కి తీసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి ఎవరైనా ఆ భూముల్ని కొనుక్కుంటే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు.

  • By: sr    news    Apr 03, 2025 2:46 PM IST
KTR | ఆ భూములు ఎవరికిచ్చినా.. మేం వచ్చాక తీసుకుంటాం.. : కేటీఆర్‌

విధాత : కాంగ్రెస్ ప్రభుత్వం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఇప్పుడు ఎవరికి ఇచ్చినా… తాము అధికారంలోకి రాగానే తిరిగి వాటిని వెనక్కి తీసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి ఎవరైనా ఆ భూముల్ని కొనుక్కుంటే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. అమెరికన్ మాన్ హట్టన్ లో ఉన్న సెంట్రల్ పార్క్ మాదిరిగా అక్కడ అద్భుతమైన ఏకో పార్క్ ను నిర్మించి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, హైదరాబాద్ నగర ప్రజలకు బహుమతిగా అందిస్తామని కేటీఆర్ ప్రకటించారు.

హెచ్.సి.యూ వివాదంపై తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, సెంట్రల్ యూనివర్సిటీ లో విద్యార్థులు చేస్తున్న పోరాటానికి హృదయపూర్వక సెల్యూట్ అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తగ్గి నిర్ణయాన్ని మార్చుకోకపోతే వేలాది మందితో హెచ్ సీయూకి లాంగ్ మార్చ్ లాగా తరలి వెళ్తామన్నారు. పది రోజులుగా విద్యార్థులు పోరాడుతుంటే కనీసం వారితో చర్చలు జరపడానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదని కేటీఆర్ విమర్శించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను గుంటనక్కలు, పేయిడ్ బ్యాచ్ అనడం ముఖ్యమంత్రి, మంత్రుల అహంకారానికి నిదర్శనమన్నారు. అక్కడ జంతువులే లేవు. అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజెస్ అని భట్టి విక్రమార్క తన కృత్రిమ మేధను బయట పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు.

ప్రజాపాలన పేరుకే

ముఖ్యమంత్రి రాష్ట్రానికి నియంతనో ,బాసో కాదు. ఓ పెద్దపాలేరు మాత్రమేనని, మంత్రులైనా.. ఎమ్మెల్యేలైనా.. ఎమ్మెల్సీలైనా.. అందరూ పబ్లిక్ సర్వెంట్స్ అని..ప్రజా సేవకులని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్న ప్రజా పాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి అనువంతైనా లేదన్నారు. విద్యార్థుల జుట్టులాగడం ఆడపిల్లల బట్టలు చింపడమే ప్రజా పాలన అని ప్రశ్నించారు. మేం పాలకులం… మీరందరూ మా కాలి కింద చెప్పులు.. బానిసలు.. అన్నట్టుగా ఒక విచిత్రమైన మానసిక రోగంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని దుయ్య బట్టారు. ప్రజల సొమ్ముకు ప్రభుత్వాలు ధర్మకర్తలు మాత్రమేనన్నారు. రోజుకు 18 గంటలు పని చేస్తా అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం పది నిమిషాలు మనిషిలాగా ఆలోచించాలి. రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా రోజుకు 18 గంటలు పని చేయకుండా ఒక పది నిమిషాలు ఒక తండ్రి లాగా ఒక తాత లాగా భవిష్యత్ తరాల మీద సోయితోని రేవంత్ ఆలోచించాలని హితవు పలికారు. ప్రభుత్వ భూమి అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు అర్ధరాత్రి దొంగలు లాగా అక్కడ పనులు ఎందుకు చేపిస్తున్నారని ప్రశ్నించారు. పది రోజులు సమయం ఇవ్వండి అని కోర్టుకు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం దొంగల్లాగా ఎందుకు అక్కడ చెట్లు కొట్టేస్తూ వన్యప్రాణులను చంపేస్తుందని నిలదీశారు.

సెలవు దినాల్లోనే బుల్ డోజర్లు ఎందుకో?

కోర్టు సెలవులను చూసుకొని సెంట్రల్ యూనివర్సిటీలో ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తుందన్నారు. శని, ఆదివారాలు ప్రజల మీదికి బుల్డోజర్లు ఎందుకు పోతున్నాయని హైకోర్టు సుప్రీంకోర్టులు చెప్పిన ప్రభుత్వానికి బుద్ధి రాదా.. ఇంగితం రాదా ? అని విమర్శించారు. పశ్చిమ హైదరాబాదులో ఉన్న ఒకే ఒక్క లంగ్స్ స్పేస్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు. దాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారన్నారు. తమ గూడును చెదరగొట్టొద్దని అక్కడి నెమళ్లు పశువులు అరుస్తుంటే.. ఏడుస్తుంటే ప్రభుత్వంలోని ఏ ఒక్కరికి బాధనిపిస్తలేదా..? అని కేటీఆర్ విమర్శించారు. హెచ్. సీ .యు విద్యార్థుల పోరాటం మీద రెండు రోజులుగా కేసీఆర్ మా పార్టీ నేతలతో పాటు హైదరాబాద్ చెందిన కొంతమంది ముఖ్యులతో మాట్లాడుతున్నారు.. చర్చించారన్నారు. ఫ్యూచర్ సిటీ కోసం 14000 ఎకరాలను పెట్టుకొని ప్రజెంట్ సిటీని ఎందుకు ఖరాబ్ చేస్తున్నావని కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలను కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జా పెట్టాలనుకుంటుందన్నారు.

మేం గ్రీన్ సిటీ చేశాం

మా ప్రభుత్వ హయాంలో హైదరాబాదును గ్రీన్ సిటీగా మార్చి ఎన్నో జాతీయ ,అంతర్జాతీయ అవార్డులను సాధించామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేసిఆర్ హయాంలో 270 కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవాన్ని సృష్టించామన్నారు. హైదరాబాదులో 7.7% గ్రీన్ కవర్ పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణలో, గ్రీన్ కవర్ ను పెంచడంలో తెలంగాణ దేశంలోని నెంబర్వన్ గా నిలవడం మేము సాధించిన రికార్డ్ అన్నారు. పల్లెల్లో 13657 ఎకరాల్లో 19472 ప్రకృతి వనాలు పెట్టినామని..మండల స్థాయిలో 2011 బృహత్ ప్రకృతి వనాలను 6298 ఎకరాల్లో కేసీఆర్ ప్రభుత్వం పెట్టిందని గుర్తు తెలిపారు. హైదరాబాద్ చుట్టూ 108 అర్బన్ లంగ్ స్పేసెస్ ను ఏర్పాటు చేశామని, పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ అండ్ బి రోడ్ల వెంబడి వందలాది కిలోమీటర్లు చెట్లను పెంచామని చెప్పారు. ప్రతి ఊర్లో నర్సరీ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ ఒక్కటేనని.. 14,864 నర్సరీలు తెలంగాణలో ఉన్నాయన్నారు. 270 కోట్ల మొక్కలు పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ మాత్రమేన్నారు. పర్యావరణ పరిరక్షణ గురించి మాకు ఎవరు నీతులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

రాహుల్, బండిలపై విమర్శలు

రాహుల్ గాంధీ చెప్పినట్టుగా మొహబ్బత్ కి దుకాణ్ లా కాదు నఫరత్ కా మకాన్ లాగా తెలంగాణ మారిందని కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీ ఓ లాపతా లీడర్.. పొలిటికల్ టూరిస్ట్ అని మండిపడ్డారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ విద్యార్థులతో కలిసి మాట్లాడాలి తమ ప్రభుత్వం చేస్తున్న పని ఏంటో వాళ్లకు వివరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ ఓ ఐటమ్ నంబర్ సిక్స్ అని.. అప్పుడప్పుడు పార్లమెంటుకు వెళ్లి భారత ప్రభుత్వ నివేదికలని చదువుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అయిన బండి సంజయ్ చదువుకోవాలని.. తంబాకు నమ్ములుకుంటూ ఆక్కడిక్కడ తిరగవద్దని.. టైం పాస్ చేయవద్దని. ఆయనకి కూడా మంచిది కాదని కేటీఆర్ విమర్శించారు.