కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం: మహేశ్ కుమార్ గౌడ్ కు బండి కౌంటర్

బండి సంజయ్ మహేశ్ గౌడ్ పై కఠిన వ్యాఖ్యలు చేశారు, కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.

కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం: మహేశ్ కుమార్ గౌడ్ కు బండి కౌంటర్

దొంగ ఓట్లను తొలగించి అసెంబ్లీ ఎన్నికలకు వెళదామా? అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన చెప్పారు. తెలంగాణలో బీజేపీ 8 మంది బీజేపీ ఎంపీలు గెలవడంపై అనుమానాలున్నాయని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం కేంద్ర మంత్రి స్పందించారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందని, దొంగ ఓట్ల జాబితాను బయటపెట్టాలని ఆయన కోరారు. ఆ వివరాలతో ఎన్నికల కమిషన్ కు లేఖ రాయాలని ఆయన సూచించారు. అంతేకాదు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆయన కోరారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. దీనికి కాంగ్రెస్ సిద్దమా అని ఆయన సవాల్ విసిరారు. కరీంనగర్ లో చాలా మంది మైనారిటీ ఇండ్లలో వందల కొద్ది దొంగ ఓట్లున్నాయి. వాటిని తొలగించాలని మాజీ మేయర్ సునీల్ రావు ఫిర్యాదు చేశారు. మైనారిటీ ఓట్లు ఏ పార్టీకి పడతాయో తెలుసున్నారు. ఆ దొంగ ఓట్లు వేసుకున్నా కాంగ్రెస్ గెలవలేదని ఆయన చెప్పారు.

దొంగ ఓట్లతో గెలవాలనుకుంటే 8 ఎంపీ సీట్లు మాత్రమే బీజేపీ ఎందుకు గెలుస్తుంది. మొత్తం ఎంపీ స్థానాలను గెలుచుకునే వాళ్లం కదా? కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ఫ్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వస్తుంది? గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 8 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే ఎందుకు వస్తాయి? తానును దొంగ ఓట్లతో గెలిచి ఉంటే ఎన్నికలైపోయిన వెంటనే ఎలక్షన్ కమిషన్ కు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఆయన ప్రశ్నించారు.

వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని మహేశ్ గౌడ్ కు దొంగ ఓట్ల గురించి ఏం తెలుసునని ఆయన ప్రశ్నించారు. దొంగ ఓట్లతో తాను గెలిచానని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అనడం కరీంనగర్ ప్రజలను అవమానించినట్టేనని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని కాంగ్రెస్ పై ప్రజలు కోపంతో ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపిస్తే రాళ్లతో కొట్టేంత కోపంతో ప్రజలు ఉన్నారని ఆయన అన్నారు. 20 నెలల పాలనలో పంచాయతీలకు నిధులివ్వని ఏకైక ప్రభుత్వం కాంగ్రెసేనని ఆయన విమర్శించారు.కేంద్ర నిధుల కోసమే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారని ఆయన విమర్శించారు.

మహేశ్ గౌడ్ ను చూస్తే గజినీ సినిమా గుర్తుకొస్తుందన్నారు. తనను బీసీ అన్నది ఆయనే… ఇప్పుడు దేశ్ ముఖ్ అని అంటున్నది ఆయనే అని ఆయన ఎద్దేవా చేశారు. బీసీ వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా నిలబెడితే ఓడగొట్టాలని చూస్తోంది కాంగ్రెస్సేనని ఆయన అన్నారు. ఎన్నికలున్నా లేకున్నా హిందూ సమాజం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడే పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు.

తానును హిందూ ఓటు బ్యాంకుతోనే కరీంనగర్ లో భారీ మెజారిటీతో గెలిచానని ఆయన తెలిపారు.తెలంగాణలోనూ హిందూ ఓటు బ్యాంకును తయారు చేస్తానని ఆయన చెప్పారు.
తెలంగాణలోకి వచ్చిన రోహింగ్యాలంతా 2014కు పూర్వం వలస వచ్చిన వాళ్లేనని అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉందని ఆయన గుర్తు చేశారు. రోహింగ్యాలకు రేషన్ కార్డులు, ఓటర్ కార్డులిచ్చి ఓటు బ్యాంకుగా చూస్తోంది కాంగ్రెస్సేనని ఆయన విమర్శించారు. రోహింగ్యాలను విదేశాలకు పంపించాలని చెప్పినా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.