New Ration Cards | ఈ నెల 14నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ : మంత్రి ఉత్తమ్ వెల్లడి

New Ration Cards| కొత్త రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఈనెల 14న తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 13వ తేదీ వరకు రేషన్ కార్డుల విచారణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు హాజరయ్యారు. జిల్లా కేంద్రంలో 6కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్ఆండ్ బీ సూపరింటెండ్ ఇంజనీర్ నూతన కార్యాలయ భవనాన్నిప్రారంభించారు. సమీక్షా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లారాజకీయంగా కీలకపాత్ర పోషిస్తున్నదన్నారు. ప్రభుత్వం ఏ నూతన కార్యక్రమం చేపట్టినా అది ఈ జిల్లా నుంచే మొదలవుతుందన్నారు. హుజూర్ నగర్ నుంచే సన్నబియ్యం పథకం ప్రారంభించామని గుర్తు చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు ఉప ఎన్నికల్లో రేషన్ కార్డులు ఇస్తామని గప్పాలు కొట్టి మోసం చేసిందన్నారు. తాము పూర్తిస్థాయిలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు అందరూ భూసేకరణ మీద దృష్టి పెట్టాలన్నారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జిల్లా ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. పథకాల లక్ష్యాలను పూర్తిగా సాధించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత పాలకులు కృష్ణ జలాల పంపిణిలో కేవలం 299టీఎంసీలకే ఒప్పుకోవటంతో తెలంగాణకి అన్యాయం జరిగిందని తెలిపారు. అంతకుముందు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి కలెక్టర్ ఎం.హనుమంత రావు ఆయా జిల్లాలో ప్రభుత్వ పథకాల పురోగతి వివరాలను పీపీటీ ద్వారా వివరించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే లు మందుల సామెల్, బాలు నాయక్, వేముల వీరేశం, బి లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, జై వీర్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు సత్యం, శంకర్ నాయక్, అదనపు కలెక్టర్ పి రాంబాబు, ఉమ్మడి జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.