నాగార్జున సాగర్‌లో.. మిస్ వరల్డ్ సుందరీమణుల సందడి!

విధాత: 72వ మిస్ వరల్డ్-2025పోటీలలో పాల్గొంటున్న వివిధ దేశాల సుందరీమణులను సోమవారం షెడ్యూల్ మేరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు, బుద్ధవనం సందర్శనకు తీసుకెళ్లారు. మార్గమధ్యంలో దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలంలోని వెల్లంకి ఫుడ్స్ ఫామ్ హౌస్ వద్ద వారికి విశ్రాంతి ఏర్పాటు చేశారు. అనంతరం మిస్ వరల్డ్ బృందం సాగర్ కు చేరుకుంది. వారికి విజయ విహార్ అతిధి గృహంలో బస ఏర్పాటు చేశారు. సాగర తీరంలో..బుద్దవనంలో అందగత్తెల ఫోటో షూట్ నిర్వహించారు. కంటెస్టు లోని ఆసియా ఓసియాన గ్రూప్ 4లోని 22 దేశాల సుందరీ మణులు హాజరయ్యారు. బుద్ధ వనంలో మిస్ వరల్డ్ కాంటెస్టెంటకు జానపద, గిరిజన నృత్య కళాకారులతో ఘన స్వాగతం పలికారు.
ఆసియా ఒసియాన దేశాలకు చెందిన ఇండియా, బంగ్లాదేశ్, కాంబోడియా మయన్మార్, వియత్నం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ,ఇండోనేసియా, జపాన్ , కజకిస్తాన్, కిర్గికిస్తాన్, లెబనాన్, మంగోలియా, నేపాల్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, శ్రీలంక, టర్కీ, చైనా, థాయిలాండ్, ఆర్మేనియా దేశాల కాంటెస్టర్లు సాగర్.. బుద్ధ వనం సందర్శించారు. మిస్‌వరల్డ్ పోటీదారులు బౌద్ధ థీమ్‌పార్క్‌లోని స్తూపంలో బుద్ధుని విగ్రహాల చెంత జరిగిన ధ్యానం,ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాత్రి డిన్నర్ తర్వాత మిస్ వరల్డ్ బృందం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. వివిధ దేశాల అందగత్తెల సందడితో సాగర తీరం..బుద్దవనం మరింత శోభాయామానమైంది. అలంకరణ విద్యుత్ దీపాకాంతుల వెలుగులకు పోటీగా ప్రపంచ సుందరిమణుల అందాలు తళుకులతో బుద్దవనం మెరిసిపోయింది.
ఆచార్య నాగార్జునుడు ఆధ్యాత్మిక, విద్యాకేంద్రంగా గొప్ప ప్రాచీన నాగరికతకు నెలవై..కృష్ణావేణి తరంగాల సోయగాలతో విలసిల్లుతున్న నాగార్జున సాగర్ ప్రపంచ దేశాల అందగత్తెల సందర్శనతో మరింత పర్యాటక శోభను చాటింది. చార్మినార్ వద్ధ భారీ భద్రత మిస్ వరల్డ్ సుందరీమణులు చార్మినార్ ను సందర్శించనున్న నేపథ్యంలో అక్కడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చార్మినార్ వద్దకు వచ్చి వెళ్లే మార్గాల్లో, పరిసరాల్లో ప్రత్యేక భద్రతా చర్యలను తీసుకున్నారు. చార్మినార్ చుట్టు ఉన్న దుకాణదారులకు..నివాసితులకు ఈ సందర్భంగా అనుసరించాల్సిన తీరుపై పోలీసు అధికారులు సూచనలు అందించారు.