Hyderabad: ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నా

విధాత: నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను చార్జ్ షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయం గురువారం ధర్నా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, మంత్రులు డి.శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు శంకరయ్య, రాజ్ ఠాగూర్ కార్పొరేషన్ చైర్మన్ లు, నాయకులు హాజరయ్యారు.
రాజకీయ కక్షతో అక్రమ కేసులు
దేశ వ్యాప్తంగా బీజేపీ ఫాసిస్టు పాలన సాగిస్తూ ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తూ అక్రమ కేసులతో వేధిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు డి.శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లు విమర్శించారు. రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఇమేజ్ ను చూసి ఓర్వలేక మోదీ సర్కార్ అక్రమ కేసుల కుట్రలకు తెరలేపిందరన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై అక్రమ కేసులు పెట్టారన్నారు. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియాలని ధర్నా చేపట్టామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ పెపర్ అయిన నేషనల్ హెరాల్డ్ పేపర్ కు 90 కోట్లు రుణం ఇస్తే మనిలాండరింగ్ జరిగినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. దేశంలో మోదీ హవా తగ్గుతున్న క్రమంలో రాహుల్ గాంధీ ఇమెజ్ ను బద్నాం చేసేందుకు అక్రమ కేసులు మోపుతున్నారని విమర్శించారు. దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబం ఏనాడూ కేసులకు భయపడింది లేదన్నారు.
స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నవారు బీజేపీ పార్టీలో ఒక్కరూ లేరన్నారు. మోదీకి కనువిప్పు కలిగేలా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహిస్తున్నాయన్నారు. విభజన, విధ్వేషం, విధ్వసంపైనే బీజేపీ పాలన సాగిస్తుందన్నారు. రాహుల్ గాంధీ దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జనాభా థామాషా మేరకు కులగణనను డిమాండ్ చేస్తుండటంతో బీజేపీలో ఆందోళన మొదలైందన్నారు. తెలంగాణ మోడల్ పాలనను కేంద్రం జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు.