Hyderabad: గోపనపల్లిలో భారీ ఐటీ పార్క్! కంచగచ్చిబౌలి వివాదంతో.. మరో ప్రాంతంపై సర్కార్‌ కన్ను

కంచె గ‌చ్చి బౌలి భూముల సేక‌ర‌ణ వివాదం అయిన త‌రువాత తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వం 20 సంవ‌త్స‌రాల త‌రువాత ఏకంగా ఇక్క‌డ ఉన్న 439 ఎక‌రాల 15 గుంట‌ల భూమిలో ఐటీ పార్క్ కోసం నోటిఫికేషన్ విడుద‌ల‌కు సన్నాహాలు చేస్తున్న‌ది. అప్ప‌టికీ, ఇప్ప‌టికీ భూముల విలువ భారీ ఎత్తున పెరిగింది. ఈ భూమిలో రంగ‌నాథన‌గ‌ర్ వెంచ‌ర్ కూడా ఉన్న‌ది. గోప‌న్‌పల్లి ఫ్లైవోవర్‌కు అతి స‌మీపంలో ఉన్న ఈ భూమిని సేక‌రిస్తే తాము తీవ్రంగా న‌ష్ట‌పోతామ‌ని భూ య‌జ‌మానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు

  • By: sr    news    May 04, 2025 11:58 PM IST
Hyderabad: గోపనపల్లిలో భారీ ఐటీ పార్క్! కంచగచ్చిబౌలి వివాదంతో.. మరో ప్రాంతంపై సర్కార్‌ కన్ను

Hyderabad:

  • కంచగచ్చిబౌలి వివాదంతో మరో ప్రాంతంపై సర్కార్‌ కన్ను
  • గోపనపల్లిలో భారీ ఐటీ పార్క్ ఏర్పాటుకు ప్రణాళిక
  • 439 ఎక‌రాల‌ భూసేక‌ర‌ణ‌కు రంగం సిద్దం
  • ఆ భూములను నిషిద్ధ భూముల జాబితాలో చేర్చాలని సూచన
  • వివరాలు పంపాలని ఆదేశించిన సర్కారు
  • జిల్లా క‌లెక్ట‌ర్‌కు నివేదించిన తహసీల్దార్‌
  • అతి కొద్ది రోజుల్లో నోటిఫికేష‌న్ విడుదల
  • రంగనాథన‌గ‌ర్ ప్లాట్లు, చుట్టుపక్కల భూముల య‌జ‌మానుల ఆందోళ‌న‌
  • గ‌తంలో ఇచ్చిన నోటిఫికేష‌న్ చెల్ల‌ద‌న్నకోర్టు
  • తాజాగా మ‌రోసారి నోటిఫికేష‌న్ విడుద‌ల‌కు య‌త్నం
  • కంచ గచ్చిబౌలి వివాదంతో ప్రత్యామ్నాయంగా గోపనపల్లిపై దృష్టి సారించిన స‌ర్కారు!

Hyderabad: హైద‌రాబాద్‌ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూ సేక‌ర‌ణ‌ వివాదం ముగియక ముందే కాంగ్రెస్ ప్ర‌భుత్వం స‌మీపంలోనే మ‌రో వివాదానికి ఆజ్యం పోస్తున్న‌ది. ఐటీ కారిడార్‌కు అతి స‌మీపంలో ఉన్న కంచ గ‌చ్చిబౌలిలోని స‌ర్వే నంబ‌ర్ 27లో ఐటీ పార్క్ కోసం 400 ఎక‌రాలు స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ స‌ర్కారు అభాసుపాలైన విష‌యం అంద‌రికీ తెలిసిందే.. సుప్రీంకోర్టు ఆదేశాల‌తో కంచ గ‌చ్చిబౌలి నుంచి వెన‌క్కు త‌గ్గిన రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రత్యామ్నాయంగా అతి స‌మీపంలో ఉన్న గోప‌న‌ల్లి రెవెన్యూ గ్రామంలో439 ఎక‌రాల 15 గుంట‌ల భూమిని సేక‌రించ‌డానికి స‌న్న‌ద్దం అయింది. ఇప్ప‌టికే శేరిలింగంప‌ల్లి తహసీల్దార్‌ నుంచి వివ‌రాలు తెప్పించుకున్న‌ది. సదరు నోటీసులో ఈ భూములను నిషిద్ధ భూముల జాబితాలో చేర్చడం ద్వారా రిజిస్ట్రేషన్లకు అవకాశం లేకుండా చూడాలని కోరడం విశేషం. ఒక‌టి రెండు రోజుల్లో భూ సేక‌ర‌ణ నోటిఫికేష‌న్ వెలువ‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తున్నది.

రంగారెడ్డి జిల్లాలోని గోప‌న‌ప‌ల్లి గ్రామం ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌కు ఆనుకొని ఉన్న‌ది. అమెరిక‌న్ కాన్సులేట్‌కు అతి స‌మీపంలో ఉన్న గోప‌న‌ప‌ల్లి గ్రామం హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీకి ఆనుకొనే ఉంటుంది. కంచ‌ గ‌చ్చిబౌలిలో భూముల‌ను స్వాధీనం చేసుకునే పరిస్థితి లేకపోవ‌డంతో ప‌క్క‌నే ఉన్న గోప‌న‌ప‌ల్లి గ్రామంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి కేంద్రీక‌రించిన‌ట్లు క‌నిపిస్తున్నది. గోప‌న‌ప‌ల్లి రెవెన్యూ గ్రామంలో ఐటీ పార్క్ ఏర్పాటు కోసం భూమిని ప‌రిశీలించాల‌ని ప్ర‌భుత్వం ఇచ్చిన ఆదేశాల మేర‌కు శేరిలింగంప‌ల్లి తహసీల్దార్‌.. గోప‌న‌ప‌ల్లి గ్రామంలో స‌ర్వే నంబ‌ర్లు 127 నుంచి 173 వ‌ర‌కు 186 నుంచి 263 వ‌ర‌కు 439 ఎక‌రాల 15 గుంట‌ల భూమి అందుబాటులో ఉన్న‌ట్లుగా ప్ర‌భుత్వానికి వివ‌రాలు అందించారు. మార్చి 3వ తేదీన క‌లెక్ట‌ర్‌కు వివ‌రాలు పంపించ‌గా ఈ నోటా… ఆ నోటా ఆల‌స్యంగా ఈ వివ‌రాలు వెలుగులోకి వ‌చ్చాయి. దీంతో ఈ భూముల య‌జ‌మానులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీకి ఎదురుగా ఉన్న‌ గోప‌న్‌పల్లి తండాను ఆనుకొని ఉన్న ఈ భూమి వివ‌రాల‌ను ఒక ప‌రిశీలిస్తే.. ఇందులోని దాదాపు 70 ఎక‌రాల భూమిలో రంగ‌నాథ న‌గ‌ర్ లే అవుట్ ఉన్న‌ది. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్ర‌భుత్వం 2005 ఏప్రిల్‌15వ తేదీన‌ 47 ఎక‌రాల 11 గుంట‌ల భూమి సేక‌ర‌ణ కోసం గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌ను భూమి య‌జ‌మానులు స‌వాల్ చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు మొద‌ట భూ య‌జ‌మానుల పిటిష‌న్‌ను కొట్టి వేసింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. తిరిగి విచార‌ణ చేయాల‌ని సుప్రీం హైకోర్టును ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేర‌కు విచారించిన హైకోర్టు నోటిఫికేష‌న్ ఇచ్చి చాలాకాలం అయినందున భూ సేక‌ర‌ణ చేయాలంటే తిరిగి కొత్త నోటిఫికేష‌న్ ఇచ్చుకోవాల‌ని, పాత నోటిఫికేష‌న్ చెల్ల‌ద‌ని 2024 ఫిబ్ర‌వ‌రి 13న స్ప‌ష్టం చేసింది.

కంచె గ‌చ్చి బౌలి భూముల సేక‌ర‌ణ వివాదం అయిన త‌రువాత తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వం 20 సంవ‌త్స‌రాల త‌రువాత ఏకంగా ఇక్క‌డ ఉన్న 439 ఎక‌రాల 15 గుంట‌ల భూమిలో ఐటీ పార్క్ కోసం నోటిఫికేషన్ విడుద‌ల‌కు సన్నాహాలు చేస్తున్న‌ది. అప్ప‌టికీ, ఇప్ప‌టికీ భూముల విలువ భారీ ఎత్తున పెరిగింది. ఈ భూమిలో రంగ‌నాథన‌గ‌ర్ వెంచ‌ర్ కూడా ఉన్న‌ది. గోప‌న్‌పల్లి ఫ్లైవోవర్‌కు అతి స‌మీపంలో ఉన్న ఈ భూమిని సేక‌రిస్తే తాము తీవ్రంగా న‌ష్ట‌పోతామ‌ని భూ య‌జ‌మానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. స‌మీపంలో ఉన్న ప్ర‌భుత్వ భూముల్లో ఐటీ పార్క్ ఏర్పాటు చేయ‌కుండా త‌మ భూములు సేక‌రించ‌డ‌మేమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. రేవంత్ స‌ర్కారు ఈ భూమి సేక‌ర‌ణ విష‌యంలో పున‌రాలోచ‌న చేయాల‌ని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి..

TGE JAC | 51 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ.. సర్కార్‌పై తెలంగాణ ప్రభుత్వోద్యోగుల సమర శంఖం
Pakistan: పాక్‌ రాయబారి.. యుద్ధ రంకెలు! అణు దాడికీ వెనుకాడబోం