Operation Sindoor | పహల్గామ్, ఆపరేషన్ సింధూర్ లేవనెత్తిన ప్రశ్నలివీ..

తాజా ఇండో పాక్ యుద్ధక్రీడలో కర్త, కర్మ, క్రియలపై ఓ విశ్లేషణ – పార్ట్ 2
పహల్గామ్ పర్యాటకులపై “ఉగ్రవాద” అమానుష దాడిని కాశ్మీర్ సహా యావద్భారత ప్రజలు కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా ఖండించి సమైక్యంగా నిలబడడం గమనార్హం! ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఈ సమైక్యత మరింత పెరగడం మరో గమనార్హ అంశం! ఈ సమైక్యత ఏకపక్షంగా కొనసాగదు. ఇది మోదీ సర్కార్ వైఖరిపై కూడా ఆధారపడి ఉంటుంది.
దేశ భద్రత పట్ల మోదీ సర్కార్ పారదర్శక వైఖరి ప్రదర్శించాలి. దేశ ప్రజల ప్రశ్నల పట్ల జవాబుదారీ తనంతో ఉండాలి. వారి మనస్సుల్లో సందేహాల్ని తొలగించపడం ద్వారానే ప్రభుత్వంపై దేశ ప్రజల నమ్మకం పెరుగుతుంది. ఈ క్లిష్ట కాలాల్లో ప్రభుత్వ వైఖరి బాధ్యతాయుతంగా వుండాలి. దేశ భద్రత పట్ల తమ మనస్సుల్లోని సందేహాల్ని తీర్చాలని తామెనుకున్న సర్కార్ ని అడిగే హక్కు దేశప్రజలకు వుంది. ప్రశ్నించే ప్రజల్ని సర్కార్లు నేరస్తులుగా చూడరాదు. కానీ నేడు ప్రశ్నలు కూడా నేరాలుగా మారడం విషాదకరం.
యుద్ధం వద్దు, శాంతి కావాలన్నందుకే నేడు నిష్కల్మష దేశ భక్తులు, శాంతికాముకుల్ని దేశ ద్రోహులుగా ముద్రలు వేసిన దుస్థితి తెల్సిందే. ట్రోల్స్ తో మానసికంగా హింసించడం శోచనీయం. అదే ట్రోల్స్ సేన ట్రంప్ “శాంతి” ట్వీట్ కి పండగ చేసుకున్నారు. ప్రశ్నలే నేరాలైన వేళ నిజమైన దేశ భక్తులు, ప్రజాతంత్ర వాదులు మౌనంగా ఉండరాదు. ఈ క్రింది ప్రశ్నల్ని అడుగుదాం.
పహల్గామ్‌పై ప్రశ్నలు
1. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో 24/7 నిఘాతో లక్షల సైన్యం కాపలా వున్నా, పాకిస్తాన్ ఉగ్రవాదులు సరిహద్దు దాటి ఎలా రాగలిగారు?
2. ఒకవేళ కళ్ళు కప్పి సరిహద్దు దాటినా, పహల్గామ్ వరకూ ఎలా రాగలిగారు?
3. రోజూ వేలాది మంది పర్యాటకులు సందర్శించే అతి సున్నిత ప్రాంతంలో నిఘా వ్యవస్థ ఎందుకు లేదు? సీసీ కెమెరాలు సైతం ఎందుకు లేవు?
4.భద్రతను పటిష్టంగా ఏర్పాటు చేయాల్సిన కల్లోల ప్రాంతంలో ఆరోజు ప్రత్యేక బలగాలతో పాటు సాధారణ పోలీసు సైతం ఎందుకు లేదు?
5. ఏప్రిల్ 6న జమ్ము, 7, 8 లలో శ్రీనగర్ లో అమిత్ షా పర్యటించాడు. ఆ సందర్బంగా అత్యున్నత భద్రతా బేటీలో స్థానిక ముఖ్యమంత్రిని ఎందుకు భాగస్వామి చేయలేదు?
6. ఉగ్రవాద ప్రమాదం పొంచివుందని ముందే ఇంటెలిజెన్స్ చేసిన హెచ్చరికల్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు?
7. పహల్గామ్ దుర్గటన జరిగిన వెంటనే భద్రతా వైఫల్యానికి కారణాల్ని ఎందుకు సమీక్షించలేదు?
8. స్థానిక ముఖ్యమంత్రి సహా స్థానిక సర్కార్ ను విశ్వాసంలోకి తీసుకొని ఉగ్రవాదంపై సమైక్య పోరుకు అఖిలపక్ష, సర్వమత సమ్మేళనాల్ని కాశ్మీర్ లో ఎందుకు చేయలేదు?
9. సౌదీ నుండి రాగానే మోదీ.. పహల్గామ్ ఉగ్రదాడి స్థల పర్యటన ఎందుకు చేయలేదు? మృత దేహాల సందర్శన, మృతుల కుటుంబాల, క్షతగాత్రుల పరామర్శకు ఎందుకు వెళ్లలేదు?
10. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకుండా బీహార్ ఎన్నికల ప్రచారానికెలా వెళ్లారు?
ఈ ప్రశ్నల నుండి మోడీ సర్కార్ తప్పించుకోలేదు.
ఇక ‘ఆపరేషన్ సింధూర్’ పై ప్రశ్నలకు వద్దాం.
1. దేశ ప్రజల ఎదుట ఏ వైఖరితో ‘ఆపరేషన్ సిందూర్’ కి దిగింది? ఏ ముగింపును ఆశించి క్రాస్ బోర్డర్ దాడులు చేసింది? తాను ఆశించిన లక్ష్యం నెరవేరిన తర్వాతే రాజీ చేసుకుందా?
2. ట్రంప్ మధ్యవర్తిత్వం మోదీ కోరిందా? లేదా తానే మధ్యవర్తిత్వన్ని చేస్తానని మోదీని ట్రంప్ కోరాడా? ఇందులో ఏది సత్యం? ఏది అసత్యం?
3. మోదీ కోరివుంటే తన స్వంత కేబినెట్ ద్వారా నిర్ణయం తీసుకున్నాడా? వ్యక్తిగతంగానే నిర్ణయం తీసుకున్నాడా?
4. ఒకవేళ మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ కోరితే, మోదీ ఆమోదించాడా? కేబినెట్ ఆమోదించాకే తల ఊపాడా?
5. వాణిజ్య బంధం కట్ చేస్తానని తాను బెదిరిస్తే రెండు దేశాలు కాల్పుల విరమణకు దిగినట్లు ట్రంప్ ప్రపంచం ఎదుట పబ్లిసిటీ చేశాడు. ట్రంప్ బెదిరిస్తే మోదీ లొంగాడా? అది నిజమైతే క్యాబినెట్ లో చర్చపెట్టిన తర్వాతే ఒప్పుకున్నాడా? నిజం కాకపొతే, అబద్దమని ఎందుకు ఖండించలేదు?
6. మే 10న సాయంత్రం మూడున్నర గంటలకు పాకిస్తాన్ రక్షణ శాఖ నుండి రాజీ ప్రతిపాదన వస్తే కాల్పుల విరమణ చేశామని మన విదేశాంగ ప్రతినిధి ప్రకటించాడు. గత రాత్రంతా రెండు దేశాల ప్రతినిధులతో అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు నిర్వహించిన ఫలితంగా ఒప్పందం కుదిరిందని పదో తేదీ సాయంత్రం ఐదున్నరకి ట్రంప్ ట్వీట్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి చేసిన ట్వీట్ లో గత 48 గంటల మధ్యవర్తిత్వం ఫలితంగా ఒప్పందం కుదిరిందని అన్నాడు. ఇది పాకిస్తాన్ రాజీ ప్రతిపాదన కంటే రెండు రోజుల ముందు మాట! 48 గంటల మధ్యవర్తిత్వ ప్రక్రియ సాగినట్లు బాహాటంగా విశ్వవీధుల్లో ప్రచారం జరుగుతోంది. ఆ రోజే ఓ గంట లేదా రెండు గంటల క్రితమే పాక్ కాళ్లబేరానికి వస్తే ఒప్పందం చేసినట్లు మన విదేశాంగ మంత్రి చెబుతున్నారు. ఒకవేళ వాళ్ళు అబద్ధమాడితే ఎందుకు ఖండించడం లేదు? నిజమైతే స్వంత దేశ ప్రజలకు ఎందుకు అబద్దం చెప్పాలి?
7. మే 12న సాయంత్రం దేశ ప్రజల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగానికి ముందే అంతర్జాతీయ స్థాయిలో ట్రంప్ ట్వీట్స్ హల్ చల్ సృష్టించాయి. వాణిజ్య కొరడా ఝళిపించి భారత్ ని లొంగదీసి చర్చల టేబుల్ వద్దకు రప్పించి ఒప్పందం చేయించానని ట్రంప్ బహిరంగ ప్రకటనలు చేస్తున్నాడు. ఐనా మోదీ తన ప్రసంగంలో ఎందుకు మౌనం వహించాడు?
8.ట్రంప్ కి తల వంచిన తర్వాత కూడా వరసగా భారత్ పట్ల వాణిజ్య హుకుంల్ని ట్రంప్ జారీ చేస్తున్నాడు. భారతదేశ ప్రతిష్టను విశ్వ వీధుల్లో దిగజార్చుతూ వరస బెదిరింపు చర్యల్ని చేపడుతున్నాడు. ఈ అవమానకర వైఖరి పై మోడీ ఇంకా మౌనం ఎందుకు వీడడం లేదు?
దేశభక్తియుత ప్రజలారా! ప్రజాస్వామ్య ప్రియులారా!
ప్రధానిగా మోదీ ఈ రోజు ఉంటారు. రేపు మరొకరు వస్తారు. ఇది ప్రధాని సమస్య కాదు. దేశ ప్రజల సమస్య! ఇది 145 కోట్ల మంది ప్రజల సమస్య! నిజమైన దేశభక్తులు, ప్రజాతంత్ర ప్రియుల్ని బాధించే సమస్య! క్యూబా, మెక్సికో, కెనడా వంటి దేశాలు అమెరికా పెరటి దొడ్లో వున్నాయి. ఐనా అమెరికా ఎదుట తమ దేశ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటున్నాయి. 145 కోట్ల మంది ప్రజలు దేశభద్రత కోసం ఐక్యంగా తన వెనక నిలబడ్డ వేళ, అమెరికా ఎదుట మోడీ సర్కార్ ఇలా ఎందుకు మోకరిల్లింది?
పాక్ ఉగ్రవాద ముప్పు గల లోయ భద్రత కంటే ఆపరేషన్ కగార్ పట్ల బలగాల కేంద్రకరణకు ఎందుకు దిగుతోంది? విదేశీ “ఉగ్ర”మూక ఫహల్గామ్ నుండి తప్పుకోకుండా చర్యల కంటే కర్రేగుట్ట నుండి స్వదేశీ విప్లవకార్లు తప్పుకోకుండా ఎక్కువ. పాకిస్తాన్ తో చర్చలకు మరో విదేశం అమెరికా మధ్యవర్తిత్వానికి సిద్ధం. కానీ స్వదేశీ మావోయిస్టు పార్టీతో చర్చలు నిషిద్ధం. ఈ సమయంలో మోడీ సర్కార్ అనుసరించే ఈ ద్వంద్వ విధానాన్ని కూడా ఖండించడం దేశ ప్రజల కనీస బాధ్యత!
పహల్గామ్ “ఉగ్ర”దాడి పై పది ప్రశ్నల్ని, ఆపరేషన్ సిందూర్ పై ఎనిమిది ప్రశ్నల్ని అడగడం నేరం కాదు. అంబానీ, ఆదానే వంటి కార్పొరేట్ల ప్రయోజనాలే మోడీ సర్కార్ దృష్టిలో దేశ ప్రయోజనాలుగా మారాయి. కార్పొరేట్ల చేతుల్లోని మీడియా ప్రజలని బ్రెయిన్ వాష్ చేస్తోంది. దేశ ప్రజల ప్రయోజనాలే దేశ ప్రయోజనాలుగా భావించే ప్రజాస్వామిక, దేశభక్తి యుత శక్తులు గళం విప్పాల్సిన వేళ మౌనం వహించడం నేరం. గళం విప్పుదాం. ప్రశ్నిద్దాం.
- ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
17-5-2025