Eco Friendly Plastic | ప్లాస్టిక్ పీడకు తిరుగులేని విరుగుడు కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు

ప్రపంచ పర్యావరణానికి ప్రధాన సమస్యగా తయారైన ప్లాస్టిక్‌ భూతాన్నిఅంతం చేసే దిశగా జపాన్‌ శాస్త్రవేత్తలు కీలక అడుగు ముందుకు వేశారు. ఉప్పు నీటిలో ఇట్టే కరిగిపోయే ప్లాస్టిక్‌ను అభివృద్ధి చేశారు. ఇది ప్లాస్టిక్‌ కాలుష్యానికి చెక్‌ పెడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Eco Friendly Plastic | ప్లాస్టిక్ పీడకు తిరుగులేని విరుగుడు కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు

Eco Friendly Plastic | ప్రపంచ పర్యావరణ సమస్యల్లో, ఆరోగ్య సమస్యల్లో ప్రధానంగా ముందుకు వస్తున్న విషయం ప్లాస్టిక్‌ కాలుష్యం. ఇప్పుడు వాడుతున్న ప్లాస్టిక్‌, పాలిథిన్‌ కవర్లు.. ప్రపంచానికి అతిపెద్ద సవాలుగా నిలుస్తున్నాయి. మనం వాడే ప్లాస్టిక్‌ నుంచి, పాలిథిన్‌ కవర్ల నుంచి సముద్రాల్లోకి పెద్ద మొత్తంలో మైక్రోప్లాస్టిక్‌ వెళ్లి కలుస్తున్నది. అవి సముద్ర జీవజాలంలోకి సైతం ప్రవేశిస్తున్నాయి. బయోడీగ్రేడబుల్‌ కవర్‌లు తయారు చేసినా.. అవి కూడా నిర్దష్ట సమయం తర్వాతే భూమిలో కలిసిపోతాయి. అయితే.. ఈ సమస్యకు జపాన్‌ శాస్త్రవేత్తలు అద్భుతమైన పరిష్కారాన్ని కొనుగొన్నారు. ఈ శతాబ్దపు అత్యంత కీలకమైన ఆవిష్కరణల్లో ఒకటిగా ఇది నిలిచిపోనుందని చెబుతున్నారు. అదే.. సముద్ర నీటిలో కొద్ది గంటల వ్యవధిలోనే కలిసిపోయే ‘ప్లాస్టిక్‌’. అందులోనూ ఇది నీటిలో కలిసిపోయినప్పుడు ఎలాంటి హానికారక మైక్రోప్టాస్టిక్‌ను కూడా విడుదల చేయదు. ప్రపంచ ప్లాస్టిక్‌ కాలుష్య సమస్యలకు ఇది అతిపెద్ద విరుగుడుగా పనికొస్తుందని చెబుతున్నారు. తద్వారా సముద్రాలు కాలుష్యం బారిన పడకుండా కాపాడుతుందని అంటున్నారు.

ఆర్‌ఐకేఈఎన్‌ సెంటర్‌ ఫర్‌ ఎమర్జెంట్‌ మ్యాటర్‌ సైన్స్‌, టోక్యో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ పర్యావరణ హిత ప్లాస్టిక్‌ను తయారు చేశారు. సాధారణ ప్లాస్టిక్‌ భూమిలో కలిసిపోవడానికి వందల సంవత్సరాలు పడితే.. కొత్తగా తయారు చేసిన ప్లాస్టిక్‌.. ఉప్పు ప్రభావానికి గురైతే గంటల వ్యవధిలోనే విచ్ఛిన్నం అయిపోతుంది. ఆ కాంపొనెంట్స్‌ను నీటిలో ఉన్న బ్యాక్టీరియా ప్రాసెస్‌ చేస్తుంది. ఫలితంగా ఎలాంటి మైక్రోప్లాస్టిక్‌ లేదా నానో ప్లాస్టిక్‌ వేస్ట్‌ అనేది ఉండదని పరిశోధనలో పాల్గొన్న బృందం చెబుతున్నది.

టోక్యో సమీపంలోని వాకోసిటీలో ఉన్న ల్యాబ్‌లో ప్లాస్టిక్‌ ప్రవర్తనను పరిశోధకులు ప్రదర్శించారు. ఈ ప్రయోగంలో తాము తయారు చేసిన ప్లాస్టిక్‌ మెటీరియల్‌ను ఉప్పు నీటిలో ఉంచగా.. సుమారు గంట వ్యవధిలోనే కరిగిపోయింది. ఇదే ప్రక్రియను ఉప్పటి నేలలో పాతిపెడితే.. 200 గంటల్లో భూమిలో కలిసిపోతుంది. దీన్ని తయారు చేయడానికి ఉపయోగించిన మెటీరియల్‌ నాన్‌ టాక్సిక్‌ మాత్రమే కాకుండా.. అగ్నిని కూడా తట్టుకుంటుంది. కరిగిపోయే సమయంలో ఎలాంటి కార్బన్‌ డయాక్సైడ్‌నూ విడుదల చేయదు. ఇప్పటికి ప్రయోగదశలోనే ఈ మెటీరియల్‌ ఉన్నది. దీనిని రోజువారీ అవసరాల్లో ఉపయోగించే విధంగా తయారు చేసే పనిలో పరిశోధకులు నిమగ్నమయ్యారు. కొత్త మెటీరియల్‌పై ఇప్పటికే అనేక ప్యాకేజింగ్‌ సెక్టార్‌ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని ప్రాజెక్ట్‌కు నేతృత్వం వహించిన టకుజో అయిడా చెప్పారు.

ఇప్పటికే సముద్ర జలాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. 23 నుంచి 37 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు కలవడం ద్వారా 2040 నాటికి వాటి పరిమాణం ముడింతలు పెరుగుతుందని ఐరాస పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) ప్రకటించింది. ఈ ఆందోళనకర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ ఊపందుకున్నది. భారతదేశం కూడా ఈ ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఇతోధికంగా ఉత్పత్తి చేస్తున్నది. ప్రపంచ ప్లాస్టిక్‌ పొల్యూషన్‌లో ఐదింట ఒక వంతు భారత్‌ నుంచే వస్తున్నదని 2023లో బ్రిటిష్‌ జర్నల్‌ నేచర్‌లో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో ఏటా 5.8 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ను కాల్చుతున్నారు. అది కాకుండా 2.5 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణంలోకి విడుదలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి.. 

మాట్లాడే చేపలు.. ఇవి ఎక్కడ ఉన్నాయో తెలుసా..?
ఆధునిక రాజధాని నగరం.. కొన్నాళ్లలోనే చుక్క నీరూ దొరకదు!
ఏడేళ్లకు ఆ జూలో చిరుతకు ఐదు కూనలు!