AP_TS Clash on Banakacharla | ఏపీకి షాక్​ ఇచ్చిన తెలంగాణ

AP_TS Clash on Banakacharla | ఏపీకి షాక్​ ఇచ్చిన తెలంగాణ

సీఎంల భేటీలో బనకచర్లపై చర్చకు నిరాకరణ
కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ

AP_TS Clash on Banakacharla | విధాత, హైదరాబాద్ : ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన బుధవారం జరిగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంల సమావేశంలో బనకచర్లపై చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ, ఏపీ సీఎంల సమావేశంలో బనకచర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్​ ఎజెండా ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏపీ ఇచ్చిన బనకచర్ల ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి మరో లేఖ రాసి ఏపీకీ షాక్ ఇచ్చింది. సీఎంల సమావేశంలో బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేదని ఈ లేఖలో తెలంగాణ స్పష్టం చేసింది.

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డిలతో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ బుధవారం సమావేశం కానున్నారు. ఈ మేరకు జలశక్తిశాఖ ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలు, సీఎస్‌లకు సమాచారం పంపించింది. ఈ అంశంతోపాటు రాష్ట్రాల తరఫున మాట్లాడాల్సిన ఇతర ఎజెండా పాయింట్లు ఏమైనాఉంటే వెంటనే పంపాలని జలశక్తిశాఖ కోరింది. సమావేశంలో బనకచర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్‌ అజెండా ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏపీ బనకచర్ల ఎజెండాపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ కేంద్రానికి లేఖ రాసింది.

ఇప్పటికే కృష్ణాపై పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో తెలంగాణ ఎజెండా ఇచ్చింది. ఏబీఐపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలను తెలంగాణ ప్రభుత్వం ఎజెండాలో పేర్కొంది. బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలు, ట్రైబ్యునల్‌ తీర్పుల ఉల్లంఘన జరుగుతోందని లేఖలో ప్రస్తావించింది. జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, ఈఏసీ బనకచర్లపై తీవ్ర అభ్యంతరాలు తెలిపాయని గుర్తు చేసింది. అందుకే చట్టాలను, ట్రిబ్యునల్​ తీర్పులన్నీ ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని తెలిపింది. గోదావరి-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని పేర్కొంది. ఇలాంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థలపై నమ్మకం పోతుందని లేఖలో స్పష్టం చేసింది.