ఆశిష్ నెహ్రా.. – గుజరాత్ ‘ఫుట్‌బాల్’ కోచ్..!

ఆశిష్ నెహ్రా, భారత క్రికెట్లో మరిచిపోలేని పేరు. టీమ్ ఇండియాలో ఫాస్ట్ బౌలర్గా ఎంతో ప్రఖ్యాతి పొందిన క్రికెటర్. ప్రస్తుతం మూడు సీజన్ల నుండి గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

ఆశిష్ నెహ్రా.. – గుజరాత్ ‘ఫుట్‌బాల్’ కోచ్..!

భార‌త్ త‌ర‌పున 17 టెస్టులు, 120 వ‌న్డేలు, 27 టి20లు ఆడిన నెహ్రా, వ‌రుస‌గా 44, 157, 34 వికెట్లు తీసుకున్నాడు. 2003లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన నెహ్రా, అదే ఏడాది జ‌రిగిన వ‌రల్డ్‌క‌ప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న చేసి 6 వికెట్లు తీసాడు. మొన్న‌టి ప్ర‌పంచ‌క‌ప్‌లో మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ దాన్ని స‌వ‌రించేవ‌ర‌కు నెహ్రా సాధించిన 6/23 ఫీటే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త బెస్ట్ బౌలింగ్ ఫిగ‌ర్‌.

గుజ‌రాత్ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలి ఏడాదే (2022) క‌ప్ సాధించిన టీమ్ అది. నిజానికి అప్పుడు గుజ‌రాత్ ఐపిఎల్‌లో కొత్త టీమ్ కూడా. ఇప్ప‌టివ‌ర‌కు ఐపిఎల్‌లో  క‌ప్ గెలిచిన టీమ్‌కు హెడ్ కోచ్‌గా ఉన్న భార‌త క్రికెట‌ర్ కూడా నెహ్రానే.  క్రికెట్ అంటే నెహ్రాకు విప‌రీత‌మైన పిచ్చి. చిన్న‌ప్ప‌టి నుంచీ ఎప్పుడూ అదే ధ్యాస. త‌న ఢిల్లీ స‌హాధ్యాయి, మిత్రుడు వీరేంద్ర సెహ్వాగ్‌తో క‌లిసి ఫిరోజ్‌షా కోట్లా మైదానానికి స్కూట‌ర్‌పై వ‌చ్చి క్రికెట్ ఆడేవాడు.

ఇక‌నుంచీ గుజ‌రాత్ మ్యాచ్‌ల‌ను ప‌రీక్ష‌గా గ‌మ‌నించండి. బౌండ‌రీలైన్ ఆవ‌ల‌, ఒక్క‌చోట కుదురుగా ఉండ‌కుండా, చుట్టూ తిరుగుతూ, ఫీల్డ‌ర్ల‌కు స‌ల‌హాలిస్తూ, కెప్టెన్‌కు సూచ‌నలిస్తూ చాలా సీరియ‌స్‌గా క‌నిపిస్తుంటాడు. ఆటే త‌న ప్ర‌పంచం అని చెప్ప‌డానికి ఇదో ఉదాహ‌ర‌ణ‌. సాధార‌ణంగా ఇటువంటి దృశ్యాలు ఫుట్‌బాల్ మ్యాచ్‌ల‌లో క‌నిపిస్తాయి. కోచ్‌లు అటూఇటూ ప‌రిగెడుతూ ఆట‌గాళ్ల‌ను గైడ్ చేయ‌డం. అదే కాన్సెప్ట్‌ను ఇప్పుడు నెహ్రా క్రికెట్‌కు ప‌రిచ‌యం చేసాడు. మిగ‌తా టీమ్‌ల కోచ్‌లెవ‌రూ కుర్చీల‌లోనుండి క‌ద‌ల‌రు. ఓ పుస్త‌కం టేబుల్‌పై పెట్టుకుని నోట్ చేసుకుంటూ క‌నిపిస్తారే త‌ప్ప, నెహ్రాలా ఫీల్డ్ మీద ఉండ‌రు.

త‌ల‌మీద క్యాప్ వెన‌క్కితిప్పి పెట్టుకుని, ఓ బెర్ముడా వేసుకుని, చేతిలో పెన్నూపేప‌రుతో ఆట‌గాళ్ల‌తో పాటు ప‌రుగులు పెడుతుంటాడు. ప్ర‌త్య‌ర్థి ఆట‌తీరును నిశితంగా గ‌మ‌నిస్తూ, అప్ప‌టిక‌ప్పుడు వ్యూహాలు మారుస్తూ, చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అవ‌స‌ర‌మైతే బౌలింగ్ చేయ‌డానికి కూడా సిద్ధ‌మే అన్నంత ఫిట్‌గా క‌న‌బ‌డ‌తాడు. త‌న టీమ్ ఫీల్డింగ్‌లో ఉన్నప్పుడు ఇంకా చాలా అల‌ర్ట్‌గా ఉంటాడు నెహ్రా. ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్ల ఆట‌తీరును అంచ‌నా వేస్తూ, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ల‌లో చేయాల్సిన మార్పుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు బౌండ‌రీ ఫీల్డ‌ర్ల ద్వారా కెప్టెన్‌కు చేర‌వేస్తూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తూనేఉంటాడు.

ఈసారి ఇంకా కొత్త కెప్ట‌న్ శుభ‌మ‌న్ గిల్‌. గ‌త రెండుసార్లూ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన హార్థిక్ పాండ్యా ముంబ‌యికి వెళ్లిపోవ‌డంతో నెహ్రాకు గిల్‌తో స‌హ‌వాసం చేయాల్సివ‌చ్చింది. అయినా త‌గ్గేదేలే అనుకుంటూ, గిల్‌ను కూడా విజ‌యాల‌వైపు న‌డిపిస్తున్నాడు. ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రితో మాట్లాడుతూనేఉండే నెహ్రా, ఇక స్ట్రాట‌జిక్ టైమ్అవుట్ వ‌చ్చిన‌ప్పుడు మాత్రం టీమ్ స‌భ్యుల‌తో చాలా సీరియ‌స్‌గా చ‌ర్చిస్తాడు. ఇంత‌వ‌ర‌కు జ‌రిగిందేమిటి? జ‌ర‌గాల్సిందేమిటి? ప్ర‌త్య‌ర్థి టీమ్ ప్ర‌మాణాలు ఎలా ఉన్నాయి? ఎలా అవుట్ చేయాలి? లాంటి విష‌యాల‌పై సూచ‌న‌లిస్తాడు. ఫీల్డింగ్‌కు కూడా చాలా ప్రాముఖ్య‌త‌నిచ్చే నెహ్రా, ఫీల్డ‌ర్ల‌కు క్లాసులు తీసుకుంటాడు. నిజానికి గుజ‌రాత్ కోచింగ్ టీమ్‌లో ఇంకా గ్యారీ కిర్‌స్టెన్‌, విక్ర‌మ్ సోలంకి లాంటి కోచ్‌లున్నా, వాళ్ల‌కంటే ఆట‌గాళ్ల‌తోనే ఎక్కువ‌గా ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌తాడు ఆశిష్ నెహ్రా.

2022లో 16 మ్యాచ్‌లాడి 12 విజ‌యాల‌తో క‌ప్ కూడా ఎగ‌రేసుకుపోయిన గుజ‌రాత్‌, 2023లో 17 మ్యాచ్‌ల‌లో 11 విజ‌యాలు, 2024లో ఇప్ప‌టివ‌ర‌కు 7 ఆడి 3 విజ‌యాలు న‌మోదుచేసింది. ఇంత గొప్ప కోచ్‌కు త‌గిన టీమ్ ఉంటే అద్భుతాలే జ‌రుగుతాయి. అందుకు గుజ‌రాతే సాక్ష్యం. అందుకే గుజ‌రాత్ అభిమానులు నెహ్రాను ముద్దుగా గుజ‌రాత్ గార్డియోలాగా పిలుచుకుంటారు. పెప్ గార్డియోలా ప్ర‌ముఖ ఫుట్‌బాల్ లీగ్‌ క్ల‌బ్ మాంచెస్ట‌ర్ సిటీకి మేనేజ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. నెహ్రా కూడా అచ్చం ఆయ‌న‌లా ప్ర‌వ‌ర్తించ‌డంతో ఈ ముద్దుపేరు తెచ్చుకున్నాడు.