T20 World Cup Eng VS SA | ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా విజయం
గ్రూప్ 2 లో ఆసక్తికర మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఇరు జట్లు ముందు మ్యాచుల్లో చెరో విజయం సాధించి 2 పాయింట్లతో ఉండగా, నేడు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఇంగ్లండ్‌పై పైచేయి సాధించింది. SA beat ENG in Super 8 match

టి20 ప్రపంచకప్(T20 World Cup 2024) పోటీల్లో భాగంగా నేడు సెయింట్ లూయీస్‌లోని గ్రాస్ ఐలెట్‌లో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో ఇంగ్లండ్(England)పై దక్షిణాఫ్రికా(South Africa) 7 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ రెండు జట్లు ఇంతకుముందు ఆడిన మ్యాచ్‌ల ద్వారా రెండేసి పాయింట్లు సాధించగా, రన్‌రేట్ ఆధారంగా ఇంగ్లండ్ (1.343)టేబుల్ టాపర్‌గా ఉంది. నేటి పరాజయంతో ఇంగ్లండ్ రెండోస్థానానికి పడిపోయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వారి ఆశలను వమ్ము చేస్తూ దక్షిణాఫ్రికా ఓపెనర్లలో క్వింటన్ డికాక్ ( 38 బంతుల్లో 65 పరుగులు) వీరవిహారం చేసాడు. మరో ఓపెనర్ హెండ్రిక్స్‌తో కలిసి తొలివికెట్‌కు 86 పరుగులు జోడించాడు. 22 బంతుల్లోనే 50 పరుగులు చేసిన డికాక్(Quinton de Kock), ఈ వరల్డ్‌కప్‌లో వేగవంతమైన ఆర్థసెంచరీ సాధించి, అమెరికా చిచ్చరపిడుగు ఆరొన్ జోన్స్‌తో సమానంగా నిలిచాడు. మిడిల్ ఆర్డర్లో వచ్చిన డేవిడ్ మిల్లర్(43 పరుగులు) విలువైన పరుగులు జోడించారు. అయితే వీరిద్దరు మినహా మిగతా వారెవరూ రాణించకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 163 పరుగుల ఓ మోస్తరు స్కోరును సాధించింది. (SA – 163/6)
ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లతో రాణించగా, మొయిన్ అలీ, అదిల్ రషీద్ చెరో వికెట్ తీసుకున్నారు.
164 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్‌కు దిగిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఏ మాత్రం సజావుగా సాగలేదు. టి20 హిట్టర్లుగా పేరుపడ్డ ఫిల్ సాల్ట్(11), కెప్టెన్ బట్లర్(17), జానీ బెయిర్‌స్టో(16) నిరాశ పర్చగా, 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ పీకలలోతు కష్టాల్లో పడింది. అప్పడు వచ్చిన హారీ బ్రూక్(Harry Brook), లివింగ్‌స్టోన్‌లు నమ్మశక్యం కాని రీతిలో జట్టును తిరిగి గాడిలో పెట్టారు. వీరిద్దరూ 5వ వికెట్‌కు 78 విలువైన పరుగులు జోడించారు. ముఖ్యంగా బ్రూక్ చెలరేగిపోయి 37 బంతుల్లోనే 53 పరుగులు చేసి దక్షిణాఫ్రికా బౌలర్లకు చెమటలు పట్టించాడు. నోకియా వేసిన ఆఖరి ఓవర్లో తొలిబంతికే బ్రూక్‌ను అద్భుతమైన క్యాచ్‌తో కెప్టెన్ మార్కరమ్(Aiden Markram) పెవిలియన్‌కు పంపడంతో, ఇంగ్లండ్ ఆశలు ఆవిరయ్యాయి.
ఈ క్యాచే మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా వైపు తిప్పేసింది. 6 బంతుల్లో 14 పరుగులు చేయాల్సిన ఇంగ్లండ్, 6 పరుగులు మాత్రమే చేయగలగడంతో విజయం దక్షిణాఫ్రికాను వరించింది. దీంతో దక్షిణాఫ్రికా మరో 2 పాయింట్లు దక్కించుకుని మొత్తం నాలుగు పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ఇంగ్లండ్ 2 పాయింట్లతోనే ప్రస్తుతానికి సరిపెట్టుకుంది.
దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ, కేశవ్ మహరాజ్ చెరో రెండు వికెట్లు తీయగా, బార్ట్‌మన్, నోకియా తలా ఓ వికెట్ చేజిక్కించుకున్నారు.