Snake Bite | యాక్సిడెంట్‌తో మొద్దుబారిన కాలు.. షూలో దూరి కాటేసిన పాము..

వర్షాకాలంలో పాములు ఎక్కడ దూరుతాయో ఎవరికీ తెలియదు. బెంగళూరులో ఇలానే ఒక టెకీ తన షూలో దూరిన పామును.. గుర్తించలేకపోయాడు. దాని కాటుతో చనిపోయాడు.

Snake Bite | యాక్సిడెంట్‌తో మొద్దుబారిన కాలు.. షూలో దూరి కాటేసిన పాము..

Snake Bite | బెంగళూరులోని బన్నేర్‌ఘట్టకు చెందిన 41 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పాము కాటుతో చనిపోయాడు. మంజు ప్రకాశ్‌ అనే టీసీఎస్‌ టెకీకి కొంతకాలం క్రితం యాక్సిడెట్‌ అయి.. కాలు మొద్దుబారిపోయింది. స్పర్శ అనేది లేకుండా పోయింది. ఈ పరిస్థితిలో ఒక పాము అతడి క్రాక్స్‌ షూలోకి చొరబడి కాటు వేసింది. కాలు మొద్దుబారిపోయి ఉన్న ప్రకాశ్‌కు.. ఆ నొప్పి తెలియలేదని బంధువులు చెబుతున్నారు.

శనివారం చెరుకురసం షాపు వద్దకు వెళ్లిన ప్రకాశ్‌.. శనివారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో అతడు క్రాక్స్‌ షూ ధరించి ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత క్రాక్స్‌ బయటే వదిలేసి.. తన గదిలోకి వెళ్లాడు. అయితే.. ఆ క్రాక్స్‌ పక్కనే ఒక పాము చనిపోయి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అది అతడిని కాటువేసిందేమోనన్న అనుమానంతో వెంటనే అతని గదికి వెళ్లారు. అక్కడ ప్రకాశ్‌ నోటి వెంట నురగలు వస్తూ, బెడ్‌పై పడి ఉండి కనిపించాడు. అతడి కాలు నుంచి రక్తస్రావం అవుతున్నది. దీంతో వెంటనే అతడిని సమీప హాస్పిటల్‌కు తరలించారు. అయితే.. అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు.

ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ప్రకాశ్‌ తన గదికి వెళ్లి నిద్రపోయాడు. దాదాపు గంట సమయం తర్వాత మా ఇంటికి వచ్చిన ఒక కార్మికుడు చెప్పుల వద్ద పాము ఉండటాన్ని చూసి.. ఇంట్లోవాళ్లను అప్రమత్తం చేశాడు. పరిశీలించి చూస్తే అది చనిపోయి ఉన్నది’ అని ప్రకాశ్‌ సోదరుడు తెలిపారు.

ప్రకాశ్‌ 2016లో బస్సు ప్రమాదానికి గురయ్యాడు. అప్పుడు అతడి కాలుకు శస్త్రచికిత్స చేశారు. ఆ ఘటన తర్వాత అతడి కాలు మొద్దుబారిపోయింది. బహుశా అందుకే క్రాక్స్‌ షూలో పాము ఉన్న సంగతి కానీ, అది కాటువేసిన విషయం కానీ అతడికి తెలియకుండా పోయింది. క్రాక్స్‌లో అతడి కాలు ఒత్తిడి కారణంగా పాము కూడా చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు.

వర్షాకాలంలో పాములు తరచూ కనిపిస్తూ ఉంటాయి. కొన్ని విషపూరితమైన చిన్నచిన్నపాములు షూలో, బయల ఉంచిన హెల్మెట వంటి చిన్న చిన్న ప్రదేశాల్లో ముడుచుకుని పడుకున్న వీడియోలు కూడా చూస్తూ ఉంటాం. చాలా వరకూ పాములు విషపూరితం కానప్పటికీ.. ఏ పాము కాటు ప్రమాదకరమో? ఏది కాదో చాలా మందికి తెలియదు. అందుకే ఈ వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండటం మేలు.