Biological Phenomenon | నిలువునా కోసినా చావనంటున్న చేప! ఈ వీడియో సున్నిత మనస్కులకు కాదు!

Biological Phenomenon | నిలువునా కోసినా చావనంటున్న చేప! ఈ వీడియో సున్నిత మనస్కులకు కాదు!

Biological Phenomenon | చావునుంచి ఎవరూ తప్పించుకోలేరు. కానీ.. ఆ టైమ్‌ రావాలి. అప్పటిదాకా ఎన్ని సవాళ్లు ఎదురైనా బొందిలో ప్రాణం కొట్టుమిట్టాడుతూనే ఉంటుంది. అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది నెట్టింట వైరల్‌ అవుతున్న ఒక వీడియో. ఆ వీడియోలో ఒక చేపను నిలువునా కోసినా.. ఇంకా ప్రాణాలతోనే కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. పాపం.. దాని బాధ చూడటానికి మనసు చాలా ఇబ్బంది పడుతుంది.

నిజానికి ఏ జీవికైనా ఆయువు తీరినా.. ఇంకా ఆ జీవిలోని నాడుల్లో కొన్ని యాక్టివ్‌గానే ఉంటాయి. అదొక బయోలాజికల్‌ ఫినామినా. సరిగ్గా ఆ చేపలో సైతం అవి కనిపిస్తాయి. ఒక చేపను కస్టమర్స్‌కు సర్వ్‌ చేసేందుకు నిలువునా కోసినా.. అది ఇంకా కదులుతూనే ఉంది. అది కూడా చాలా చురుకుగా. అంటే.. అందులోని కొన్ని కణజాలాలు, నాడీ వ్యవస్థ ఇంకా పూర్తిగా చనిపోలేదన్నమాట. అందుకే అది తనంతట తాను ఎగిరి పడుతూ కనిపిస్తుంది. అది శరీరంలో మిగిలిన ఎలక్ట్రికల్‌ ప్రేరణలు, రసాయనిక ప్రతి చర్యలు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గతంలో కూడా ఇటువంటి వీడియోలు చాలా వచ్చాయి. కప్పల వంటివాటిని పూర్తిగా తోలు వలిచి, వేడి నూనెలో వేయడానికి సిద్ధపడినప్పుడు.. మొదట కాళ్లను ఆ నూనెకు తాకించగానే.. ఆ కప్ప శరీరం.. వెంటనే రియాక్ట్‌ అవుతుంది. అది నిజంగానే బతికి ఉన్నదా? అన్న భ్రమను కలిగిస్తుంది. జీవి మరణానంతరం ఇంకా మిగిలి ఉన్న నాడీ వ్యవస్థ కదలికలు ఇలా ప్రతిఫలిస్తుంటాయి. ఇటువంటి వీడియోలు వివిధ రకాల జీవుల నాడీ వ్యవస్థల పనితీరును మరింత అర్థం చేసుకునేందుకు ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే.. చనిపోవడానికి ముందు వాటి బాధను ఇలా రికార్డు చేయడం ఎంత వరకూ నైతికం? అన్న చర్చ కూడా ఉన్నది. దీనికి సంబంధించిన వీడియో ‘జబ్‌ తక్‌ కిసీకీ మౌత్‌ నహీ ఆ జాతీ.. తబ్‌ తక్‌ ఉసే కోయీ నహీ మార్‌ సక్తా’ అనే క్యాప్షన్‌తో నెట్టింట తిరుగుతున్నది. అంటే దానర్థం.. మరణం వచ్చే వరకూ దానిని ఎవరూ చంపలేరు’ అని. ఇటువంటి వీడియోలు చూడటానికి సరదాగా అనిపించినా.. సున్నిత మనస్కులు మాత్రం వీటిని జీర్ణించుకోలేరు. అదే విషయం ఈ వీడియోను చూసిన అనేక మంది నెటిజన్లు చెప్పారు. ఇలాంటి వీడియోలు అనైతికమని వ్యాఖ్యానించారు.