Petralona Man | లభ్యమైన 30 ఏళ్ల తర్వాత బయటపడిన 3 లక్షల ఏళ్లనాటి కపాల రహస్యం!
ఒక్కోసారి పురాతన శాస్త్రవేత్తలకు అంతుచిక్కని విషయాలు ఎదరవుతూ ఉంటాయి. కానీ.. ఏది చేసైనా వాటి రహస్యాలను శాస్త్రవేత్తలు బయటపెడుతూ ఉంటారు. ఇలానే.. 30 ఏళ్ల క్రితం గ్రీస్‌లోని పెట్రలోనా (Petralona Cave) అనే గుహలో వెలుగుచూసిన విచిత్రమైన కపాలాన్ని (mysterious skull) శోధించిన పరిశోధకులు.. దాని రహస్యాన్ని బయటపెట్టారు.

Petralona Man | పురాశాస్త్రవేత్తలు 30 ఏళ్ల రహస్యాన్ని ఎట్టకేలకు ఛేదించారు. ఉత్తర గ్రీస్‌లోని పెట్రలోనా (Petralona Cave) అనే గుహలో ఒక అంతుచిక్కని మానవ కపాలం (mysterious skull) కనిపించింది. ఆ సమయంలో అది గుహ గోడకు అతుక్కుని ఉన్నది. కపాలంపై ఏర్పడిన కాల్సైట్ పొర దానిని మరింత భిన్నంగా కనిపించేలా మార్చింది. అది ఎవరిది? ఏ జాతివారిది? అనేది ఒక పట్టాన తేలలేదు. దశాబ్దాలపాటు దానిపై పరిశోధనలు సాగాయి. అనేక శాస్త్రీయ అధ్యయనాలూ చేశారు. చివరకు శిలాజాల కాలాన్ని నిర్ధారించేందుకు ఉపయోగించే యురేనియం–థోరియం డేటింగ్ (uranium-thorium dating) అనే కచ్చితమైన ప్రక్రియను (precision technique) ఉపయోగించి.. ఆ కపాలం వయసును గుర్తించగలిగారు. ఇది ఇప్పటికే అంతరించిపోయిన ఒక హోమినిడ్(hominid)కు చెందిందని తేల్చారు. ఇప్పటి యూరప్ దేశాలు ఉన్న ప్రాంతాల్లో నియాండర్‌తల్స్‌తోపాటు ఈ హోమినిడ్ జాతి జీవించినప్పటికీ.. హోమో హౌడెల్‌బర్గెన్సిస్ (Homo heidelbergensis) అనే వేరే జాతిగా గుర్తించారు.
వయసు ఎంతో తెలుసా?
తొలుత ఈ కపాలం 1.7 లక్షల సంవత్సరాల నుంచి 7 లక్షల సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేశారు. కానీ.. దానిపై ఒక కాల్సైట్ పొర ఏర్పడి ఉన్నది. దీనిని యురేనియం సిరీస్ పద్ధతి ఆధారంగా పరీక్షించారు. అందులో ఇది సుమారు 2,86,000 సంవత్సరాల క్రితానిదని ఖరారు చేశారు.
పెట్రలోనా మ్యాన్‌గా నామకరణం
ఆ శిలాజ ఆకారం, దాని దృఢత్వాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. అదొక పురుషుడి కపాలమని తేల్చారు. దానికి ‘పెట్రలోనా మ్యాన్’ (Petralona man) అని నామకరణం చేశారు.
హోమో హైడెల్‌బర్గెన్సిస్ జాతి
సుమారు 3 లక్షల నుంచి 6 లక్షల ఏళ్ల మధ్యకాలంలో ఈ జాతి ఆఫ్రికాలో జీవించిందని పరిశోధకులు గుర్తించారు. తరువాత వారిలో కొంతమంది సుమారు 5 లక్షల సంవత్సరాల క్రితమే యూరప్‌కు వలస వెళ్ళారని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధ్యయనం జర్నల్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ (Journal of )లో ప్రచురితమైంది. నియాండర్‌తల్స్(Neanderthals), హోమో సెపియన్స్ పోల్చితే ఆకృతిపరంగా పెట్రలోనా హోమినిడ్ ప్రత్యేక గుంపునకు చెందినది. మరింత ప్రాచీన లక్షణాలు ఉన్నాయి. తాజాగా అంచనా వేసిన వయసును బట్టి.. యూరప్‌లోని మధ్య ప్లైస్టోసీన్ యుగంలో నియాండర్‌తల్స్ అభివృద్ధి చెందుతున్న కాలంలో వారితోపాటు వీరు కూడా కలిసి జీవించారని స్పష్టమవుతున్నది’ అని ఆ అధ్యయనం పేర్కొంటున్నది.
పెట్రలోనా గుహ గురించి
ఈ కపాలం వెలుగు చూసిన పెట్రలోనా గుహ.. గ్రీస్ దేశంలోని చాల్కిడికీ ప్రాంతంలో, థెస్సలోనికి సిటీ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ గుహ.. మౌంట్ కత్సికా పర్వతంలోని జురాసిక్ కాలపు సున్నపు రాళ్లలో ఏర్పడిన సహజ కార్‌స్టిక్ నెట్‌వర్క్‌లో భాగం. ఇది వందల మీటర్ల పొడవున విస్తరించి ఉంటుంది.