Space Elevator | చందమామపైకి నిచ్చెన! సాధ్యాసాధ్యాలేంటి? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లాలంటే ఎలివేటర్, మెట్లు వాడుతాం. మరీ ఎత్తయిన ప్రాంతాలకు కేబుల్ కార్లు ఉంటాయి. మరి చంద్రుని దగ్గరకు కూడా అలా కేబుల్ వేసుకుని వెళ్లిపోతే? ఆశ్చర్యంగా ఉన్నా.. ఇప్పుడు శాస్త్రవేత్తలు అదే పనిలో ఉన్నారు.

Space Elevator | చందమామ గుట్టు విప్పేందుకు మనం చేయని ప్రయోగం లేదు. చంద్రునిపై గతంలో ఒకసారి కాలుమోపినా.. ఇంకా ఆ గ్రహ అన్వేషణ అసంపూర్ణంగానే ఉన్నది. ఆ మధ్య కాలంలో భారతదేశం చంద్రయాన్ పేరిట విజయవంతంగా ప్రజ్ఞ రోవర్‌ను దింపగలిగింది. ఇక నేరుగా మనుషులను పంపేందుకు సైతం మన అంతరిక్ష సంస్థ ఇస్రో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. చంద్రునిపైకి మనుషులను పంపి.. నిర్ణీత సమయంలో వెనుకకు తీసుకురావడం మామూలు టాస్క్ కాదు. ఐఎస్‌ఎస్‌కు వెళ్లి చిక్కుపోయిన సునీతా విలియమ్స్, బచర్‌లను తిరిగి తీసుకొచ్చేదాకా ఎంతో ఉత్కంఠను శాస్త్రవేత్తలు అనుభవించారు. ఇక చంద్రునిపై ఇటువంటి సమస్యలు ఎదురైతే మామూలుగా ఉండదు. అందుకే డైరెక్ట్‌గా చంద్రునిపైకి ఎలివేటర్ (Space Elevator) ద్వారా వ్యోమగాములను పంపేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. భూమ్యాకర్షణ శక్తి నుంచి తప్పించుకోవడం అత్యంత ఖరీదైన వ్యవహారం కావడం అంతరిక్షాన్ని అన్వేషించే క్రమంలో అతిపెద్ద ఆటంకిగా ఉన్నది. కేవలం ఒక్క కిలో బరువున్న చిన్న ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపాలన్నా కోట్ల రూపాయల ఖర్చు తేలుతున్నది. ఇక భూ కక్ష్య నుంచి మరింత ముందుకు.. అంటే చంద్రునిపైకి, ఇతరత్రా పోవాలంటే సహజంగానే ఆ ఖర్చు పెరిగిపోతుంది.
ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు.. చంద్రునిపైకి లేదా అంతరిక్షంలోకి వెళ్లేందుకు అయ్యే ఖర్చును గణనీయంగా తగ్గించేందుకు కొత్త ప్రతిపాదనలు చేస్తున్నారు. దీనిని వారు ‘లూనార్ స్పేస్ ఎలివేటర్’ లేదా ‘స్పేస్‌లైన్’ అని పిలుస్తున్నారు. ఇప్పుడు సంప్రదాయకంగా వాడుతున్న రాకెట్లు.. పెద్ద మొత్తంలో ఇంధనం మండించడం ద్వారా భూమ్యాకర్షణ శక్తిని దాటుకుని ఉపగ్రహాలను, వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళుతున్నాయి. వీటికోసం భారీ స్థాయిలో చోదక ఇంధనాలు కావాలి. ఇవి సంక్లిష్టతలు, ఖర్చుతో కూడుకున్నవి. ఈ క్రమంలో దశాబ్దాలుగా ఇంజినీర్లు మరిన్ని సమర్థవంతమైన ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నారు. అలా వచ్చిన ఒక ఆలోచనే స్పేస్ ఎలివేటర్. ఒక కేబుల్ సహాయంతో స్పేస్ వెహికల్స్ అంతరిక్షంలోకి వెళ్లిపోవచ్చు. ఇందుకు ఎలాంటి ఇంధనాలూ అవసరం ఉండవు.
భూమికి అటాచ్ చేసి ఉండే స్పేస్ ఎలివేటర్ సుమారు 42వేల కిలోమీటర్లు ఉంటుంది. అంటే.. భూ స్థిర కక్ష్యకు (geostationary orbit) అవతల అన్నమాట. ఇప్పటికిప్పుడు అంతటి పొడవైన కేబుల్‌ను తయారు చేయడం అసాధ్యమే. ఎందుకంటే ఎంతో ఒత్తిడిని ఆ కేబుల్స్ తట్టుకోవాల్సి ఉంటుంది. కార్బన్ ఆధారిత అత్యంత శక్తిమంతమైన పాలిమర్స్ కూడా ఆ బలాన్ని తట్టుకోలేవు. దీంతో ఈ ఆలోచన అర్ధంతరంగా ఆగిపోయింది. అయితే.. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన జెఫిర్ పెనోయిర్, కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఎమిలీ శాండ్‌ఫోర్డ్ అనే పరిశోధకులు.. అటు నుంచి నరుక్కొస్తే పోలా? అంటూ కొత్త ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదన ఏంటంటే.. కేబుల్‌ను భూమికి అటాచ్ చేయడం కాకుండా.. నేరుగా చంద్రుని నుంచే కేబుల్‌ను వేలాడేలా చేయడం. దీని ఫలితంగా కేబుల్ పటుత్వంలోని స్వాభావిక సమతుల్యత తగ్గిపోతుంది. ఇప్పుడు ఉన్న కార్బన్ పాలిమర్స్, జిలాన్ వంటి శక్తిమంతమైన మెటీరియల్‌ను ఉపయోగించి కేబుల్ తయారు చేయవచ్చునని వారు చెబుతున్నారు. ఇది ఒక్కసారి ఆచరణలోకి వస్తే ప్రస్తుతం వినియోగిస్తున్న ఇంధనంలో మూడోవంతు పొదుపు చేయవచ్చని అంటున్నారు.
ఈ స్పేస్‌లైన్ సురక్షితం, నమ్మదగినది అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్ష ప్రయోగాలకు అనువైనదిగా చెప్పే లాగ్‌రేంజ్ పాయింట్ వరకూ యాక్సెస్ చేసుకోవచ్చని అంటున్నారు. పైగా ఈ పాయింట్‌లో అంతరిక్ష వ్యర్థాలు, గ్రహశకలాలు వంటివి కూడా ఏమీ ఉండవు. కనుక స్పేస్ క్రాఫ్ట్‌లకు ఎలాంటి ముప్పు కూడా ఎదురుకాదు. ఇప్పటి వరకూ అంతరిక్ష ప్రయోగాలకు ఈ లాగ్‌రేంజ్ పాయింట్‌ను పెద్దగా ఉపయోగించింది లేదు. ఈ ప్రాంతం భవిష్యత్తులో స్పేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించుకోవడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ స్పేస్‌లైన్ నిర్మాణం వల్ల తరచూ తక్కువ ఖర్చుతోనే లాగ్‌రేంజ్ పాయింట్‌కు, అక్కడి నుంచి చంద్రునిపైకి వెళ్లిరావచ్చు. అంతేకాదు.. శాస్త్రీయ పరిశోధనలు, కమర్షియల్ యాక్టివిటీస్‌కు కూడా ఇది ఉపకరిస్తుంది.
ఇవి కూడా చదవండి..
Mega Tsunami | వెయ్యి అడుగల ఎత్తు కెరటాలతో.. అమెరికాపైకి మెగా సునామీ?
Earth 2.0 | భూమికి వెలుపల నీటి ఛాయలు.. నాసా అధికారిక ప్రకటన.. రెండో ‘భూమి’ ఎక్కడంటే!
El Ejido | ‘ఎల్ డొరాడో’.. ది లాస్ట్ సిటీ ఆఫ్ గోల్డ్.. మరి ‘ఎల్ ఎజిడో’ ఏంటో తెలుసా? ఆకాశం నుంచి కనిపించే ఏకైక మానవ కట్టడం!