వాతావరణ సంరక్షణకు అందరూ మొక్కలు నాటాలి… మంత్రి పొన్నం
వాతావరణ సంరక్షణ భవిష్యత్తు తరాల కోసం రాబోయే సమాజాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

విధాత, హైదరాబాద్ : వాతావరణ సంరక్షణ భవిష్యత్తు తరాల కోసం రాబోయే సమాజాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తన నివాస ఆవరణలో మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు.
భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే విధిగా ప్రతి పౌరుడు మొక్కలు నాటాలని తెలిపారు. పర్యావరణాన్ని రక్షిస్తేనే ఆ పర్యావరణం మనల్ని రక్షిస్తుందన్నారు. పర్యావరణాన్ని చెడగొట్టే విధంగా చెట్లు కొట్టవద్దని కోరారు. పిల్లలకు ప్రతి రోజు మొక్కలకు నీళ్లు పోసే విధంగా అలవాటు చేయాలన్నారు. మొక్కలు నాటకపోవడంతో ప్లాస్టిక్ వాడకం పెరిగి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే కాలుష్యం పెరిగి క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపి పర్యావరణాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. కాలుష్యరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.