50 వేల కోట్ల నష్టాల్లో విద్యుత్తు సంస్థలు! ఆరా తీసిన సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో విద్యుత్తు సంస్థలు 50 వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయని అధికారులు చెప్పడంపై ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

50 వేల కోట్ల నష్టాల్లో విద్యుత్తు సంస్థలు! ఆరా తీసిన సీఎం రేవంత్‌రెడ్డి
  • పూర్తి వివరాలతో వచ్చేవారం సమావేశం
  • వాడి వేడిగా కొనసాగిన సమీక్షాసమావేశం
  • అడ్డగోలు కొనుగోళ్లపై ముఖ్యమంత్రి ఆగ్రహం!
  •  200 యూనిట్ల ఉచిత విద్యుత్తుపై చర్చ

విధాత: రాష్ట్రంలో విద్యుత్తు సంస్థలు 50 వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయని అధికారులు చెప్పడంపై ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్తు పరిస్థితిపై గురువారం నాటి సమావేశానికి కొనసాగింపుగా సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వాడివేడిగా సాగిన ఈ సమావేశం సందర్భంగా విద్యుత్తు సంస్థల పనితీరుపై ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. అడ్డగోలుగా జరిగిన విద్యుత్తు కొనుగోళ్లపై సీఎం సీరియస్‌ అయ్యారని తెలిసింది. విద్యుత్తు సంస్థలు దాదాపు 50 వేల కోట్ల నష్టాల్లో ఉన్నట్టు ఆ శాఖ అధికారులు పేర్కొన్నారని సమాచారం.


 



దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. మొత్తం పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్లు ఏమేం ఉన్నాయి? ఒప్పందాలు ఎలా జరిగాయి? అన్న అంశాల్లో పూర్తి వివరాలతో రావాలని ఆదేశించారని తెలిసింది. వారం రోజుల్లో మళ్లీ విద్యుత్తు అంశంపై ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. రైతులకు విద్యుత్తు సబ్సిడీ బకాయిలు ఎంత మేర ఉన్నాయో, ఎప్పటి నుంచి ఉన్నాయో ఆరా తీశారని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్టుల విషయంలో విద్యుత్తు బకాయిలపై అడిగారని తెలుస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. విద్యుత్తు పరిస్థితిపైనా ప్రత్యేకంగా శ్వేతపత్రం విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. దానిని ఆధారం చేసుకుని అవసరమైతే విచారణకు ఆదేశించే పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు విషయంలో కార్యాచరణ ప్రణాళికపై ప్రాథమికంగా చర్చించినట్టు తెలుస్తున్నది.


రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు పూర్తిస్థాయిలో కొనసాగాల్సిందేనని చెప్పిన ముఖ్యమంత్రి.. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించినట్టు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎంవో ప్రిన్సిపల్‌ సెక్రటరీ శేషాద్రి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, ఇంధన శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, సింగరేణి సీఎండీ శ్రీధర్, సీపీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.