ఇప్పుడు కాకుంటే ఎప్పటికీ కాదు!..కాంగ్రెస్ గెలుపుపై క్షేత్రస్థాయి మాట ఇది
ఏబీపీ సీఓటర్ సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముందున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో 19 స్థానాల్లో గెలిచిన ఆ పార్టీలో చీలిక తెచ్చి 12మంది ఎమ్మెల్యేలను అధికారపార్టీలోకి ఫిరాయించేలా ప్రోత్సహించింది ఎవరో చెప్పాల్సిన పనిలేదు

- బీఆరెస్ విమర్శలు పట్టించుకోని ప్రజలు
- కాంగ్రెస్‌ను ఓడించేది కాంగ్రెసేనని గత నానుడి
- దానిని చెరిపివేసేలా నేతలు ప్రయత్నిస్తారా?
విధాత : ఏబీపీ సీఓటర్ సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముందున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో 19 స్థానాల్లో గెలిచిన ఆ పార్టీలో చీలిక తెచ్చి 12మంది ఎమ్మెల్యేలను అధికారపార్టీలోకి ఫిరాయించేలా ప్రోత్సహించింది ఎవరో చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, నాగార్జునసాగర్, దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఊహించని ఫలితాలు వచ్చాయి. బీఆర్‌ఎస్ అధినేత ఆ పార్టీని బలహీనపరచడానికి బీజేపీకి బూస్ట్ ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే పార్టీల రాజకీయ నిర్ణయాలకు, ప్రజల క్షేత్రస్థాయి అభిప్రాయాలకు చాలా తేడా ఉంటుంది అన్నది ప్రస్తుతం గ్రామాల్లోకి వెళ్తే చాలా విషయాలు తెలుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని నేతలు విడిచి వెళ్లినా కార్యకర్తలు పార్టీతోనే ఉన్నారు.
ఎన్నికల వాతావరణంపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి వెళ్లినప్పుడు ఆశ్చర్యపోయే విషయాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌పై, నేతలపై ప్రచారం చేస్తున్నాఆరోపణలను, విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదు. నేతలు సంయమనం కోల్పోకుండా కొన్నిరోజులు ఓపిక పడితే ప్రజల తీర్పు ఏం కోరుకుంటున్నారు? వారి ఆంతర్యం ఏమిటన్నది డిసెంబర్ 3న వెల్లడయ్యే ఫలితాల్లో ప్రస్ఫుటమవుతుంది అంటున్నారు.
ఆరు గ్యారెంటీలపై సానుకూలత
కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ పుంజుకుంటున్నది. ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమౌతున్నది. పదేళ్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనపై ప్రజల్లో సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. దాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవడానికి అత్యంత అనుకూల వాతావరణం ఉన్నదని ప్రజల నుంచి వస్తున్న స్పందనబట్టి తెలుస్తోంది. అలాగే ఎన్నికల సమయంలో నేతలు పార్టీ మారడటం అన్నది కూడా సహజమే. స్థానికంగా అభ్యర్థి పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారంలో స్థానిక నేతలు ఎలా వ్యవహరించారు? ప్రభుత్వ పథకాలు ప్రజలకు పాదర్శకంగా అందుతున్నాయా? అర్హులకు కాకుండా అనర్హులకు లబ్ధి చేకూర్చేలా పైరవీలకే పెద్దపీట వేశారా? అన్న తదితర అంశాలు ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపెట్టబోతున్నాయి. ఈ విషయాలపై గ్రామాల్లో చర్చజరుగుతున్నది. నేతల వైఖరి బట్టే ప్రజల అభిప్రాయం ఉండబోతున్నదని స్పష్టమైంది. ఈ లెక్కన అధికారపార్టీపై కొన్నినియోజకవర్గాల్లో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నది.
మరికొన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ విధానాల కంటే స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండి అందించిన సేవలే వారిని ఆదరించడానికి దోహదపడనున్నాయి. ఈ విధంగా రాష్ట్రంలోని మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్ అన్నట్టే ఉన్నది. ప్రజలు క్లారిటీతోనే ఉన్నారు. నేతలు విభేదాలు వీడి కలిసి సాగకున్నా మీడియాకు ఎక్కి రచ్చ చేయకుంటే అంతేచాలు అన్నది క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు. 2014 సార్వత్రి ఎన్నికల నుంచి ఇప్పటివరకు అనేక ఎన్నికలు చూశాం. కానీ ఎన్నడూలేని విధంగా అభ్యర్థులతో పని లేదు, సీఎం ఎవరు అవుతారు అన్నది అసలు విషయమే కాదన్నట్టు పార్టీనే ప్రమాణికం అన్నట్టు పరిస్థితి కనిపిస్తున్నది.
ఇప్పుడు కాకుంటే ఎప్పటికీ కాదు
నాట్ నౌ.. నెవర్.. అన్నది చాలాచోట్ల వినిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీని ఓడించేది కాంగ్రెస్ నేతలే అన్న నానుడిని చెరిపేసే అవకాశం వచ్చిందంటున్నారు. ప్రజలు పార్టీ పట్ల సానుకూల వైఖరితో ఉన్నారు. రానున్న 40-45 రోజులు పార్టీ ఇచ్చిన గ్యారెంటీ హామీలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించగలిగితే చాలు అంటున్నారు. అలాకాకుండా నేతలు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుని పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తే ఇక అంతే సంగతులు అనే వాదన వినిపిస్తున్నది. ఏ విషయాలపై ఎంత వరకు స్పందించాలో అంతే మాట్లాడాలని, పార్టీలో అంతర్గత విభేదాలు, టికెట్లు రాని వారిని సముదాయించే పని ఎవరికి అప్పగించారో వారికే వదిలేయాలని మెజారిటీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. అంతిమంగా ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పుడూ ఈ అవకాశం రాకపోవచ్చనే హెచ్చరిక ప్రజల్లో నుంచి రావడం గమనార్హం.