ముందస్తు తాయిలాలు.. ఆగమేఘాలపై లబ్ధిదారుల ఎంపిక

- గులాబీ నాయకులకు ప్రధాన వాటా
- ఒత్తిడికి లోనవుతున్న అధికారులు
- అర్హులైన ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత
- ఎన్నికల ముంగిట బీఆరెస్ వ్యూహం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నేడో, రేపో ఎన్నికల షెడ్యూల్ వస్తుందనే అంచనాతో ఉన్న అధికార బీఆర్ఎస్ ముందస్తు జాగ్రత్త తీసుకుంటున్నది. ప్రజాప్రతినిధులు ఆగమేఘాలపైన లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన పథకాల పందేరాలు పంపిణీ చేసి, తమ వైపు తిప్పుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనికోసం అధికారులపైన తీవ్ర ఒత్తిడితెస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక ఏకపక్షంగా చేస్తున్నారని జనం లబోదిబోమంటున్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకే పథకాలు కట్టబెడుతున్నారని మండిపెడుతున్నారు.
మంత్రులు నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ, లబ్ధిదారులకు అవసరమైన కాగితాలు అందజేస్తున్నారు. మరీ ముఖ్యంగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు జిల్లాల్లో పర్యటిస్తూ భారీ సభలు నిర్వహిస్తున్నారు. ఇదే సందర్భంలో లబ్ధిదారులకు అవసరమైన అధికారిక అర్హత పత్రాలు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఏ సెగ్మెంట్ ను పరిశీలించినా పథకాల లబ్ధిదారుల ఎంపిక వ్యవహారంతో తీవ్ర హడావుడి, ఆర్భాటం కనిపిస్తోంది. జిల్లాలో ఇటీవల హరీష్ రావు పర్యటించగా, 6న మంత్రి కేటీఆర్ వరంగల్ నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులతో పాటు, పలు పథకాల లబ్ధిదారులు, ముఖ్యంగా గుడిసెవాసుల ఇళ్ళ క్రమబద్ధీకరణ చేసిన పట్టాలు పంపిణీ చేయనున్నారు.
అంతటా అదే పరిస్థితి
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక జోరుగా సాగిపోతోంది. డబుల్ బెడ్రూమ్, గృహలక్ష్మీ, దళితబంధు, మైనార్టీ, బీసీ బంధు లబ్ధిదారుల ఎంపిక, స్పోర్ట్స్ కిట్స్, బతుకమ్మ చీరల పంపిణీ వేగంగా కొనసాగుతున్నాయి. పథకాలు, పంపిణీ ప్రారంభించి మమ అనిపిస్తున్నారు. ఇక రోడ్లు, డ్రైనేజీలు, ఇతరత్రా అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారు. శంకుస్థాపనలతో ఎక్కడ చూసినా కోట్ల కొద్దీ ప్రకటనలు చేస్తున్నారు. నాలుగన్నరేళ్ళు పట్టించుకోని అక్కడక్కడ కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ళ పంపిణీకి ఇప్పుడు ముహూర్తం వచ్చింది. ఇంకా పనులు పూర్తికాకపోయినప్పటికీ, ఆ వైపుగా ఇంతకాలం వెళ్ళని ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవాలు చేస్తూ పంపిణీ చేస్తున్నారు.
ఇందులో కూడా తమ పార్టీ అనుకూలురకే లబ్ధిచేకూరే విధంగా వ్యవహరిస్తున్నారు. భూపాలపల్లిలో ఈ పంపిణీపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తాజాగా వరంగల్ తూర్పు దూపకుంటలో ఇంకా పనులు పూర్తికాకున్నా ఇండ్ల ప్రారంభానికి చర్యలు చేపడుతున్నారు. హనుమకొండలో పూర్తయిన ఇండ్లు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. ఇక ఇటీవల ప్రారంభించిన గృహలక్ష్మీ, దళితబంధు లబ్ధిదారుల ఎంపిక వేగంగా సాగుతోంది. ఈ పథకాలపై ఎమ్మెల్యేలకే పూర్తి అధికారాలివ్వడంతో ఎమ్మెల్యేల ఇళ్ళ చుట్టూ పేదలు ప్రదక్షిణలు చేస్తుండగా, వారు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తున్నారని విమర్శిస్తున్నారు.
అధికార పార్టీకి అధికారుల వత్తాసు
అర్హులను ఎంపిక చేయడంలో పారదర్శకత పాటించాల్సిన అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వత్తాసు పలుకుతున్నారని మండిపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ములుగు సెగ్మెంట్లో కూడా లబ్ధిదారుల ఎంపిక అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో సాగుతున్నాయని ఎమ్మెల్యే సీతక్క మండిపడుతున్నారు. గృహలక్ష్మీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు చెప్పిందే అమలవుతోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని విమర్శిస్తున్నారు. జనగామ కలెక్టర్ శివలింగయ్య, భూపాలపల్లి కలెక్టర్ భవేష్ మిశ్రాలపై బహిరంగంగానే విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
ఎమ్మెల్యేలపై ప్రజాగ్రహం
లబ్ధిదారుల ఎంపిక ఏకపక్షంగా చేస్తున్నారని పలుచోట్ల ప్రజలు ఎమ్మెల్యేలను బహిరంగంగా నిలదీస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకట రమణరెడ్డి, రెడ్యానాయక్, శంకర్ నాయక్ లను ప్రశ్నిస్తున్నారు. పథకాల పంపిణీ చేపట్టి లబ్ధిదారులను తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తుండగా, అర్హుల ఎంపికలో అవకతవకలపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు పథకాలన్నీ ప్రారంభించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పనుల్లో అధికారులు సైతం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. లేకుంటే ట్రాన్స్ ఫర్ తప్పదని అంటున్నారు.ః