ప్రవళిక మృతిపై సర్కారు బురద: ఏఐసీసీ అధికార ప్రతినిధి డాలి శర్మ
ప్రవళిక ఆత్మహత్యతో అధికార పార్టీకి ఎక్కడ చెడ్డ పేరు వస్తదని బాధితుల కుటుంబంపైనే బురద జల్లే ప్రయత్నం చేస్తోందని, అధికారం కోసం బీఆర్ఎస్ ఎంతకైనా దిగజారుతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాలి శర్మ విమర్శించారు

విదాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రవళిక ఆత్మహత్యతో అధికార పార్టీకి ఎక్కడ చెడ్డ పేరు వస్తదని బాధితుల కుటుంబంపైనే బురద జల్లే ప్రయత్నం చేస్తోందని, అధికారం కోసం బీఆర్ఎస్ ఎంతకైనా దిగజారుతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి, ఉత్తర తెలంగాణ అధికార ప్రతినిధి డాలి శర్మ విమర్శించారు. మంగళవారం ఆమె హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. యువకుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక, యువతను నట్టేట ముంచిందన్నారు. తెలంగాణా ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని తెలిపారు. ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో తమ కలలు సాకారం చేసుకుందామంటే నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణాలో బడుగు, బలహీన వర్గాలు, యువకులకు అడియాశే అయ్యిందని, బాగుపడ్డది అంటే అది కేసీఆర్ కుటుంబం మాత్రమే అన్నారు. యువకుల బలిదానాల మీద ఏర్పడ్డ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేసిందని, నియంత పాలనలో, ప్రమాదపుటంచుల్లో రాష్ట్రం ఉందని ఆందోళనవ్యక్తం చేశారు.
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అందించింది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పాలనతోనే అభివృద్ధి సాధ్యమని డాలి శర్మ అన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు విషయంలో మాట నిలబెట్టుకున్నట్లే, ఇప్పుడు కాంగ్రెస్ గ్యారంటీలు అన్నింటినీ మాహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత పథకాలను తక్షణమే అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, ఏఐసీసీ అబ్జర్వర్, వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి రవీంద్ర ఉత్తమ్ రావు దళ్వి, టీపీసీసీసీ ఉపాద్యక్షురాలు బీ శోభా రాణి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఇనగాల వెంకట్రాం రెడ్డి, బక్క జడ్సన్, డాక్టర్ పులి అనిల్ కుమార్, కేఆర్ నాగరాజు, బొమ్పెల్లి దేవేందర్, బంక సంపత్ యాదవ్ పాల్గొన్నారు.