Nagarjuna sagar| న‌ల్ల‌గొండ బీజేపీ అధ్య‌క్షుడిపై బీఆరెస్ కార్య‌క‌ర్త‌ల దాడి

Nagarjuna sagar| న‌ల్ల‌గొండ బీజేపీ అధ్య‌క్షుడిపై బీఆరెస్ కార్య‌క‌ర్త‌ల దాడి

– నోముల భగత్ దుర్మార్గానికి తెగబడ్డాడు

– గంజాయి బ్యాచ్ ను ఉసిగొల్పాడు

– బీజేపీ నేత శ్రీధర్ రెడ్డిపై హత్యాయత్నం కుట్ర

– నాగార్జున సాగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిని కంకణాల నివేదిత


విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: సాగర్ ఎమ్మెల్యే భగత్ గంజాయి బ్యాచ్ తో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డిపై హత్యాయత్నం కుట్రకు తెగబడ్డాడని, బీఆరెస్ రౌడీ రాజకీయాలను సహించమని నాగార్జునసాగర్ బీజేపీ అభ్యర్థి నివేదిత రెడ్డి హెచ్చరించారు. మంగళవారం హాలియాలో బహిరంగ సభకు వస్తున్న సీఎం కేసీఆర్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన శ్రీధర్ రెడ్డిపై దాడి చేయడాన్ని ఖండిస్తూ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నివేదిత రెడ్డి మాట్లాడారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో వంద అబద్ధాలు చెప్పి, కోట్ల రూపాయల డబ్బులు వెదజల్లి, మద్యం ఏరులై పారించి తన అభ్యర్థి నోముల భగత్ కుమార్ ను గెలిపించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మళ్ళీ అబద్ధాలు చెప్పి ఓట్లు కొల్లగొట్టెందుకు ప్రయత్నాలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. రౌడీ రాజకీయాలను సహించేది లేదన్నారు. ఉప ఎన్నికల హాలియ సభలో ప్రజల సాక్షిగా చెప్పిన అబద్ధపు హామీల్లో ఒకటైన నెల్లికల్లు ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.



 



కుర్చీ వేసుకుని ఇక్కడే కూర్చుని ప్రాజెక్ట్ కడతానని చెప్పిన కేసీఆర్.. 37 నెలల తరువాత నేడు ఓట్ల కోసం తన కొడుకుని ముఖ్యమంత్రి చేయటం కోసం ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చి మళ్ళీ నాగార్జున సాగర్ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవడం విచారకరమన్నారు. నెల్లికల్లు ప్రాజెక్ట్ శిలాఫలకానికే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె… రౌడీ రాజకీయాలను సహించేది లేదని చెప్పారు. సాగర్ ఎమ్మెల్యే భగత్ గంజాయి బ్యాచ్తో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డిపై దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు. కుర్చీ లేకనే ఆయన ప్రాజెక్ట్ కట్టలేదా? అని మరోమారు ప్రశ్నించారు.


నెల్లికల్లు పూర్తి కోసం ప్ల కార్డులతో శాంతియుతంగా నిరసన చేస్తున్న బీజేపీ నాయకుల మీద నోముల భగత్ కుట్రపూరితంగా తన అనుయాయులు, అల్లరి మూకలు, గంజాయి వ్యాపారుల దాడిని ఖండించారు. మహిళలు అని కూడా చూడకుండా మామీద దాడికి పంపటం, మా కార్యకర్తలు, నాయకులను చితక బాదటమే కాక బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి మీద హత్యాయత్నానికి పాల్పడడం విచారకరమన్నారు. రౌడీయిజం చేస్తున్న నోముల భగత్ ను ప్రజల ఈసారి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తక్షణమే పోలీసులు ఎమ్మెల్యే భగత్, ఆయన అనుచరులపై చర్యలు తీసుకొని తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.