B.Narsinga Rao | ‘అంత‌రంగ గానం’.. BRS ప్రభుత్వంపై బి.న‌ర్సింగ‌రావు మ‌రో లేఖ

B.Narsinga Rao విధాత‌: కేటీఆర్‌, కేసీఆర్‌ల వ్య‌వ‌హార శైలిపై ఇప్ప‌టికే రెండుసార్లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ లేఖ‌లు రాసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బి. న‌ర్సింగ‌రావు మ‌రోసారి ఫైర్ అయ్యారు. అంత‌రంగ గానం పేరుతో ఆయ‌న ఆరు పేజీల క‌విత రాశారు. ఆ క‌విత‌లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై, ఆ ప్ర‌భుత్వ విధానాల‌పై, ప్ర‌భుత్వానికి వ‌త్తాసు ప‌లుకుతున్న వివిధ వ‌ర్గాల‌పై క‌లం ఎక్కుపెట్టారు. కేటీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేద‌ని ఒక‌సారి, 2014 నుంచి త‌న ఫోన్ ట్యాపింగ్ అవుతోంద‌ని, […]

B.Narsinga Rao | ‘అంత‌రంగ గానం’.. BRS ప్రభుత్వంపై బి.న‌ర్సింగ‌రావు మ‌రో లేఖ

B.Narsinga Rao

విధాత‌: కేటీఆర్‌, కేసీఆర్‌ల వ్య‌వ‌హార శైలిపై ఇప్ప‌టికే రెండుసార్లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ లేఖ‌లు రాసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బి. న‌ర్సింగ‌రావు మ‌రోసారి ఫైర్ అయ్యారు. అంత‌రంగ గానం పేరుతో ఆయ‌న ఆరు పేజీల క‌విత రాశారు. ఆ క‌విత‌లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై, ఆ ప్ర‌భుత్వ విధానాల‌పై, ప్ర‌భుత్వానికి వ‌త్తాసు ప‌లుకుతున్న వివిధ వ‌ర్గాల‌పై క‌లం ఎక్కుపెట్టారు.

కేటీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేద‌ని ఒక‌సారి, 2014 నుంచి త‌న ఫోన్ ట్యాపింగ్ అవుతోంద‌ని, నాతో పెట్టుకుంటే నూక‌లు చెల్లిన‌ట్లేన‌ని మ‌రోసారి లేఖాస్త్రాలు సంధించిన బి. న‌ర్సింగరావు తాజాగా అంత‌రంగ గానం పేరుతో క‌వితాస్త్రాం వ‌దిలారు.

కవిత పూర్తి పాఠం ఇలా ఉన్నది..

అంతరంగ గానం…

బి. నరసింగరావు

ఒకానొక పెద్ద విగ్రహం
ఒకానొక పెద్ద హర్మ్యం.
అట్టడుగు వర్గాల చేతులకు
రెండు డ్రమ్ములు వాయించుకోవడానికి
తాంబూలాలిచ్చాం
తన్నుకు చావండి
ఇక తన్నుకు చావడం ఒకరిపని
తమాషా చూడడం మరొకరి పని

గతంలో రాజులు ఇతర రాజ్యాల మీద
దండయాత్రలు చేసిందెందుకు
భూ భాగం
ధనాగారం
అంతఃపుర స్త్రీలు

నేటి రాజకీయ రాజుల మనోగతం
అధికారం
కీర్తిప్రతిష్ఠ
సంపద

ఈ దేశంలో ప్రతి ఐదేళ్ళకొకసారి వచ్చే
ఎన్నికలలో పనిచేసే మంత్రం
అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి
జనం నుండి ముక్కుపిండి
వసూలు చేసే పన్నులే
ప్రభుత్వం చేతులో గలగలలాడే
సంప‌ద‌

ప్రజలపై ఖర్చుపెట్టేది ఖర్చుపెట్టి
మిగితావి వెనకేసుకోవడం’
ప్రజలకోసం ఖర్చు చేసిందానికిగాను
వాళ్ళ నుంచి మెప్పు పొందితే
ఐదేళ్ళ పాలన గ్యారంటీ

మతాలను విభజించు
కులాలను విభజించు
కుటుంబాలను విభజించు
ఇక జయ్యత్ గా పాలన కొనసాగించు

లింకన్ ఏమన్నాడంటే
‘ప్రజల నుండి’
‘ప్రజల కొరకు’
‘ప్రజల చేత’

ఇక్కడ ప్రజల వ్యక్తిత్వాలకు సజీవ సమాధి
ఇక్కడ వెలువడే ప్రతి దివ్యమైన ఆలోచన
ఒకే ఒక్క దివ్యమైన మేథస్సులోంచి

మీరు మాట్లాడితే ముళ్ళ కంప
మాట్లాడక పోతే మళ్ళీ టికెట్
ఇదే క్రమం.. ఇదే మీ విజయసూత్రం
జపించండి ! తపించండి !!

మళ్ళీ మళ్ళీ వస్తా ఐదేళ్ళకోసారి
వోట్లడుగుతా
వొట్టిగకాదు !
అభివృద్ధి చూపించి…
నా ముఖం చూసి నన్ను గెలిపించండి
పరిపాలించడంలో వెన్నుచూప
మీరంతా తినండి
తాగండి
ఆర్. ఆర్. ఆర్ లు ‘బలగా’లు చూపిస్తాం

రాష్ట్రం సాధించగలిగితే
ఎవ్వడినైనా కౌగిలించుకుంటానని
ఒకప్పుడన్నా !
సాధించి చూపించిన!
ఇప్పుడు మాత్రం నా దరిదాపుల్లోకి
ఎవ్వరూ రావొద్దు

నేను ఒంటరిగా వనాలలో గడిపే సమయమంతా
మీ అభివృద్ధి ఎలా కొనసాగించాలి అనే
ఆలోచనలతో గడుపుతా

గతంలో బండ్ల కొద్దీ పుస్తకాలు చదివిన
ఇప్పుడు రాజ్యం ఏలడానికి
కొత్త రాష్ట్రాన్ని ముందుకు తీసుకపోవడానికి
అవ్వి ఎంతో ఉపయోగపడుతున్నాయి.

నా కిచ్చే గొప్ప గొప్ప ఆలోచనలను
గొప్పగానే సమాజం కోసం ప్రవేశపెడతా
దాంతో నగరాలు వెలిగిపోతోంటాయ్ !
గ్రామాలు తెలివి మీరి పోతోంటాయ్

ఎవరో ఒకరు అవినీతి గురించి
మాట్లాడుతూనే ఉంటారు.
అది గిట్టని వాళ్ళు చేసే పని.
నేను నిరంతరం మీ గురించి పనిచేస్తూనే పోతూ
ఉంటా

‘పరిపాలన’ భవిష్యత్ లో ఎలా అని
ఆందోళన చెందకండి
మా యింట్లో అప్పటికే అరడజను మంది
రాజకీయ నాయకులున్నారు.
ఇంకొక పాతికేళ్ళ వరకు
మీరు ఇంకొకరి కోసం వెతకనవసరం లేదు

మా కుటుంబ సభ్యులు నిరంతరంగా
అలుపుసొలుపు లెరగకుండా
మిమ్ముల్ని పరిపాలిస్తూనే ఉంటారు.
నిజాన్ని అబద్ధం
అబద్ధాన్ని నిజం చేయకపోతే
రాజకీయ చక్రం తిప్పడానికి వీలే కాదు
దాన్ని ఎవ్వరూ పట్టించుకోవొద్దు

డబ్బు ! డబ్బు !! డబ్బు !!!!
డబ్బుదేముంది కుక్కను కొడితే రాలుతుంది
మీరు డబ్బు గురించి బెంబేలు పడకండి
మీరు మీ తిండి తిప్పల గురించి ఆలోచించండి

రాజ్యాన్ని ఏలేవారు దేవుని బిడ్డలు
మీరేమీ తక్కువ కాదు
మీరు వారి బిడ్డల బిడ్డలు
అంతే తేడా!

యజ్ఞ యాగాలెందుకు చెయ్యొద్దు
వాస్తును ఎందుకు పాటించవద్దు
ఎవ‌రో నడమంత్రపు గాళ్ళు అట్లా
విమర్శిస్తుంటారు

అత్యంత మేధో సంపత్తితో కూడిన
ఆలోచన మాది
ఐనా ఈ సంపదంతా మేము కట్టుకపోతామా
మహా అయితే ఏడుతరాలు

మాటి మాటికి మా గత చరిత్రని
పీకుతూ ఉంటారు
దాంతో వచ్చేది లేదు పొయ్యేది లేదు

ప్రజాస్వామ్యం ఇలాగే ఉంటుంది
ప్రతి విషయంలో లోతుకు వెళ్ళకూడదు
తింటూ కుడుస్తూ ఉంటే అది ప్రజాస్వామ్యమే
ఎవర్నయినా బింగీలు తీయిస్తున్నమా
లేకపోతే జైల్లల్ల పెడుతున్నమా ?

అదే! మాటి మాటికి
జలూస్ లు, ధర్నాలు, పికెటింగ్ లు
నిరహార దీక్షలు
ఏమైంది ! వీళ్ళ దమాక్ ఖరాబైందా ?

మతాలు కులాలు వర్గాలు
అరె ! ఇయ్యాల్ల కొత్తగున్నయా యివ్వి !
జమాన నుంచి నడుస్తున్న కతలు యివ్వి
గిట్లనే కొట్లాటలు గిట్లాటలు గిట్ట అయితయని
పోలీసుల దండు బెంచిన
గడ్ బడ్ జేస్తే ఊర్కుంటమా

మాట మాటకు లింకన్ లింకన్
అంటరేందయ్యా !
లింకన్ను గింకన్నూ
పాత సామానుల గదిలో గిరాటు వేయండి
ఎందుకంటే ఆ టైం ఈ టైం ఒకటైతదా
ఈ మార్క్స్ లూ గేర్క్స్ లూ ఇప్పుడు పనికిరారు
జనానికి పనికొచ్చేది
ఒక్క మా ప్రభుత్వం మాత్రమే

కోటరీలు గీటరీలు
జర్నలిస్టులు గిర్నలిస్టులు అంటుంటారు.
కోటను రక్షించుకోవడానికి మా కెన్నో కావాలి.
వాళ్ళు వీళ్ళు అన్న మాటలు విని మోసపోకండి
గోస ప‌డ్డ‌రు మీరు
నేను ఏలుతున్న రాజ్యానికి దీటైందాన్ని
ఒక్క రాష్ట్రాన్ని చూపించండి ఇండియాలో

ఏది పాపం !
ఏది పుణ్యం !!
ఇవన్నీ పాత చింతకాయ పచ్చడి మాటలు
మీరు మౌనంగా ఉంటే మీకెన్నో అనుకూలిస్తాయి
అది మీకూ సుఖం మాకూ సుఖం

అయ్యా ఏలినోళ్ళకు దండం
దొరా ! అటు సూడుండ్లి ఒక్కపాలి.

“కన్నీళ్ళను, కలలను
కాగడాలుగా మలిచి
పిల్ల బాటలను
రహదారులుగా కలగని
తల్లి పొత్తిళ్ళలోంచి
ఆకాశంలోకెగిసి
వెన్నెల పాలను
తల్లిపాలను కలిపి తాగి

శబ్దాన్ని చీల్చి
మరణ మృదంగం మ్రోగించి –
ప్రజల శ్వాసని పసిగట్టి
శివంగుల్లాగా ముందుకు దూకి
ఆత్మ గౌరవమనే జెండాను
గుండెలనిండా ఎగరవేసి
తెలంగాణ మానస వీణ తీగలమీద
మేలిమి రాగాలను నేసి

గుండెలలో మెండుగా
మందుగుండును దట్టించి
గొబ్బెమ్మ, ధూలా
పాటలను ఆటలను ధ్వనించి
ప్రతి గుండెలో
ఆనంద ధ్వనులను మ్రోగించిన
బిడ్డలు, అన్నలు, తమ్ములు, తండ్రులు
మీ త్యాగాల ఫలితాలే
మేము అనుభవిస్తున్న వస్తు విషయాలు
జోహార్ ! జోహార్ !! జోహార్ !!!
వీరులకు, ధీరులకు, మా కలలను నెరవేర్చిన
కమలాలకు, బంతిపూలకు, తంగేడులకు…

జేజేలు తెలంగాణకు
జేజేలు భారతావనికి.