లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తేలేదు..కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్

లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేసీఆర్ కుటుంబం పై బండి సంజయ్ ఆరోపణలు చేశారు.

లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తేలేదు..కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్

విధాత : లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేసీఆర్ కుటుంబం పై బండి సంజయ్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను 48 గంటల్లో రుజువు చేయాలని లేకపోతే బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ బండి సంజయ్ ను డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో తాను లీగల్ నోటీసులు పంపుతానని కేటీఆర్ ప్రకటించారు. అన్నట్టుగానే మంగళవారం కేటీఆర్ తన లాయర్ ద్వారా బండి సంజయ్ కు లీగల్ నోటీసులు పంపారు. ఈ లీగల్ నోటీసులపై సోషల్ మీడియాలో బండి సంజయ్ స్పందించారు. నిజం ఒక సింహం వంటిదని ఆయన అన్నారు. అది తనను తాను రక్షించుకుంటుందని ఆ పోస్టులో చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా జీవితాలను నాశనం చేసిన నేరస్తులు బయటపడతారని ఆయన చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి తన వద్ద ఉన్న సమాచారాన్ని బండి సంజయ్ ఇటీవల సిట్ కు సమాచారం ఇచ్చారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు, తన సిబ్బంది, తమ పార్టీ కార్యకర్తలు, నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ ముందు ఆయన రెండు రోజుల క్రితం స్టేట్ మెంట్ ఇచ్చారు. మావోయిస్టుల జాబితాలో తమ పేర్లును చేర్చి తమ ఫోన్లను ట్యాపింగ్ చేసిందని ఆయన ఆరోపించారు. సిట్ అధికారులు చూపించిన సమాచారం చూసి తాను షాకైనట్టుగా చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.