కేసీఆర్ ఇక వృద్ధాశ్రమానికే: బండి సంజయ్

– పేదల పాపం చుట్టుకుంది
– రూ.లక్ష కోట్లు మింగిన రాబందు
– అద్దె ఇంట్లో ఉన్నటోడికి ఇప్పుడు భవనాలెక్కడివి?
– తెలంగాణను దోచి ఫామ్ హౌస్ లో దాచిపెట్టారు
– పాలమూరు రోడ్ షోలో బీజేపీ నేత బండి సంజయ్
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: వచ్చే నెల ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత కేసీఆర్ ను వృద్ధాశ్రమానికి పంపడం ఖాయమని, ఇక ఆయన శేషజీవితం అక్కడే గడుపుతాడని.. పేదల సొమ్ము రూ.లక్ష కోట్లు మింగిన రాబందుకు ప్రజలు వేసే శిక్ష ఇదే అని బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శుక్రవారం పాలమూరు పట్టణంలో నిర్వహించిన బీజేపీ రోడ్ షోలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అద్దె ఇంట్లో కాలం గడిపిన కేసీఆర్ కు ఇన్ని బంగ్లాలు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పాలన్నారు. కుమారుడు కేటీఆర్, కూతురు కవితకు వేల కోట్లు, విలాసవంతమైన భవనాలు ఎలా వచ్చాయని, తెలంగాణ ప్రజలను లూటీ చేసిన సంపదతో లక్షల కోట్లకు పండగలేత్తిన కేసీఆర్ ను ఈఎన్నికల్లో ఊడ్చి పడేయాలని బండి పిలుపునిచ్చారు. పాలమూరులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బీఆర్ఎస్ నాయకులు అమ్ముకున్నారని ఆరోపించారు.
ఇక్కడి బీఆర్ఎస్ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజల భూములను కబ్జా చేస్తున్నారని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఇక్కడి బీఆర్ఎస్ నాయకులు ఓట్లను కొనేందుకు ప్రణాళికలు చేస్తున్నారని, ఓటుకు పదివేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ డబ్బు ప్రభుత్వ భూములు అమ్మినవి, దొంగ దందా..లంగ దందాలు చేసిన డబ్బు అని, వారు పంచే డబ్బు మీ వద్ద దోచుకున్నదే అని బండి పేర్కొన్నారు. ఇంట్లో గొడవల వల్ల వత్తిడితో టీవీలను పగలగొట్టి మందు తాగి పడుకుంటున్నారని కేసీఆర్ ను విమర్శించారు.
బీఆరెస్ కు ఎందుకు ఓటేయాలి?
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని బండి సంజయ్ ప్రశ్నించారు. పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారా.. దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చారా… డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారా.. దళిత బంధు ఇచ్చారా.. అని ప్రజలను ప్రశ్నించారు. ఇవన్నీ ఇవ్వని కేసీఆర్ కు మళ్ళీ ఎందుకు ఓటేయాలని ప్రజలను అడిగారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఇల్లు లేని నిరుపేదలకు 40 లక్షల ఇండ్లు ఇస్తే, కేసీఆర్ ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలమూరులో పాలు గారిస్తామన్న కేసీఆర్ మాటలు కోటలు దాటిపోయాయన్నారు. కేసీఆర్ సర్దార్ పాలనలో పేపర్ లీకేజీలు అయితే ప్రశ్నించిన పాపానికి తనను జైల్లో ఉంచిందని, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తనపై 74 కేసులు పెట్టిందని చెప్పారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తే జైలు పాలై జీవితాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రజల కోసం జైలుకెళ్ళారా అని అన్నారు.
కాంగ్రెస్ నాయకులు పొద్దున్నే ఒక పార్టీ.. సాయంత్రం మరో పార్టీలో ఉంటారని విమర్శించారు. ముస్లిం మహిళల కోసం నరేంద్ర మోడీ త్రిబుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఓట్ల కోసం కొత్త బిచ్చగాడు మాదిరిగా కేసీఆర్ తో పాటు ఆ పార్టీ నేతలు మసీదుల వద్ద బారులు తీరుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ను నమ్ముకుంటే స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు పోతాయన్నారు.
హైదరాబాదులో సభలు పెడితే ఎంఐఎం నాయకులు నా భార్యా పిల్లలను చంపుతామని బెదిరించిన.. భయపడకుండా చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు చేశామన్నారు. ఎంఐఎం బెదిరింపులకు కుటుంబం భయపడకుండా ధైర్యంగా ఉన్నారని చెప్పారు. నాయకులు కార్యకర్తలు కష్టపడి పాలమూరు బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి భగవంతు కూబ, రైల్వే బోర్డు సభ్యులు ఉమా రాణి, జిల్లా పార్టీ అధ్యక్షులు వీర బ్రహ్మచారి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, పాలమూరు బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి, పద్మజా రెడ్డి, మఠం మయూరినాథ్ పాల్గొన్నారు.