వరంగల్‌లో అగ్రకులాలకే ఐదు సీట్లు

- నాలుగు రిజర్వుడు స్థానాలకూ ఎంపిక
- బీసీలకు మొండి చెయ్యి
- బీజేపీ తొలి జాబితాపై పలుచోట్ల అసంతృప్తి
- మరో మూడు స్థానాలు పెండింగ్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 9 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. మూడు నియోజకవర్గాలైన ములుగు, పరకాల, నర్సంపేట స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. నిన్నటి నుంచి ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అభ్యర్థుల జాబితా ఆదివారం విడుదలైంది. 52 మంది సభ్యుల జాబితాలో ఉమ్మడి వరంగల్ నుంచి తొమ్మిది మందికి అవకాశం కల్పించారు. తొలి జాబితాపై పలుచోట్ల టికెట్ ఆశించిన అభ్యర్థులు అసంతృప్తితో ఉన్నారు.

తొమ్మిది మంది అభ్యర్థులు ఖరారు
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆదివారం ప్రకటించిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రబెల్లి ప్రదీప్‌రావు (వరంగల్ తూర్పు), రావు పద్మారెడ్డి (వరంగల్ పశ్చిమ), భూక్య సంగీత (డోర్నకల్), జాటోతు హుస్సేన్ నాయక్ (మహబూబాబాద్), విజయ రామారావు (స్టేషన్‌ఘన్‌పూర్), లేగ రాంమోహన్ రెడ్డి (పాలకుర్తి), ఆరుట్ల దశమంత్‌రెడ్డి (జనగామ), చందుపట్ల కీర్తిరెడ్డి (భూపాలపల్లి) అభ్యర్థులుగా అధికారికంగా ప్రకటించింది. టికెట్లు వచ్చిన అభ్యర్థులు, పార్టీ శ్రేణులు, వారి అనుచరులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

అగ్రభాగం అగ్రకులాలకే..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడు జనరల్, రెండు ఎస్సీ, మూడు ఎస్టీ రిజర్వుడు స్థానాలున్నాయి. ఇందులో బీజేపీ తొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా, 5 జనరల్ స్థానాలు, రెండు ఎస్సీ, రెండు ఎస్టీ స్థానాలు ఉన్నాయి. అభ్యర్థులను ప్రకటించిన జనరల్ స్థానాలు జనగామ, పాలకుర్తి, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, భూపాలపల్లి నియోజకవర్గాలకు, రెండు ఎస్సీ రిజర్వుడు స్థానాలు స్టేషన్గన్పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాలకు, రెండు ఎస్టీ రిజర్వుడు డోర్నకల్, మహబూబాబాద్ స్థానాలకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది.

పెండింగ్ మూడు స్థానాలు
రెండు జనరల్ స్థానాలు నర్సంపేట, పరకాల, ఒక ఎస్టీ రిజర్వుడు స్థానమైన ములుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను పెండింగ్లో పెట్టారు. 9 నియోజకవర్గాల్లో నాలుగు ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలు పోగా, ఐదు జనరల్ స్థానాల్లో తూర్పు మినహా నాలుగు స్థానాలు రెడ్డి సామాజిక వర్గానికి, ఒక స్థానాన్ని వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని వెలమ సామాజిక వర్గానికి కేటాయించారు. డోర్నకల్ వరంగల్ వెస్ట్ భూపాల్ పల్లిలో మహిళలకు అవకాశం ఇచ్చారు. ఇందులో డోర్నకల్ రిజర్వుడ్ స్థానం రెండు జనరల్ స్థానాల్లో మహిళలకు అవకాశం కల్పించారు.

రెండో జాబితాలోనే బీసీలకు ఛాన్స్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధిష్ఠానం, ప్రకటించిన ఐదు జనరల్ స్థానాలను అగ్రకులాలకే కేటాయించారు. పెండింగ్ లో ఉన్న నర్సంపేట, పరకాల స్థానాలలో మాత్రమే బీసీ అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది. రెండో జాబితా విడుదల అయితే తప్ప బీసీలకు కేటాయిస్తారా? లేదా తేలనుంది.

పరకాల నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన డాక్టర్ విజయ చందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, డాక్టర్ కాళీ ప్రసాద్ పోటీ పడుతున్నారు. కాళీ ప్రసాద్ కి టికెట్ ఇస్తే బీసీ సామాజిక వర్గానికి అవకాశం లభించనున్నది. నర్సంపేట నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి అభ్యర్థిగా భావించినప్పటికీ ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో ఆ స్థానాన్ని పెండింగ్లో పెట్టారు. అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ నాయకుడు టికెట్ ఆశిస్తున్నారు.

అసమ్మతి స్వరాలు
బీజేపీ తొలి జాబితాపై ఆశావహుల నుంచి అసమ్మతి వ్యక్తమవుతోంది. వరంగల్ తూర్పులో టికెట్ ఆశించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్ బాబు, వన్నాల వెంకటరమణ, గంటా రవికుమార్ తదితరులు కొంత అసంతృప్తితో ఉన్నారు. తొలి నుంచి పార్టీలో ఉన్న తమకు అవకాశం కల్పించకుండా ఈ మధ్యకాలంలో పార్టీలో చేరిన ప్రదీప్ రావుకు టికెట్ కేటాయించడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పైగా బీసీలను కాదని, వెలమ సామాజిక వర్గానికి చెందిన స్థానికేతరుడు ప్రదీప్ రావుకు అవకాశం కల్పించారని అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీ స్థానంలో అగ్రకుల అభ్యర్థికి కేటాయించడం పట్ల అసంతృప్తితో ఉన్నారు. జనగామలో టికెట్ ఆశించిన బీసీ సామాజిక నేత బేజాడి బీరప్ప అసంతృప్తితో ఉన్నారు. తన అనుచరులతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన పెదగాని సోమయ్య టికెట్ ఆశించి భంగపడ్డారు.

వరంగల్ పశ్చిమలో టికెట్ ఆశించిన రాకేష్ రెడ్డి, ధర్మారావు అసంతృప్తితో ఉన్నారు. రాకేష్ రెడ్డి టికెట్ నాదే అనే ధీమాతో ఉండగా అధిష్టానం ఆశీస్సులు పొందలేకపోయారు. స్టేషన్గన్పూర్ లో స్థానిక బీజేపీ నేతలను కాదని విజయ రామారావును కేటాయించడం పట్ల అసంతృప్తితో ఉన్నారు. వీరికి బీజేపీ అధిష్టానం ఎలా నచ్చ చెప్తుందనేది చూడాలి.