కత్తిదాడి ముసుగులో దుష్ప్రచారం: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు

కత్తిదాడి ముసుగులో దుష్ప్రచారం: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు

విధాత : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తి దాడి దురదృష్టకరమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. ప్రజాస్వామ్యంలో దాడులు పరిష్కారం కావని ఒక ప్రకటనలో పేర్కోన్నారు. పాలమూరు నుండి నేరుగా ఆసుపత్రికి వెళ్లి ప్రభాకర్ రెడ్డిని పరామర్శిస్తానని తెలిపారు. కత్తిదాడి కేసు ముసుగులో బీజేపీపైన దుష్ప్రచారం చేయడాన్ని కూడా తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. నిందితుడు రాజు జై కాంగ్రెస్ జై మిరుదొడ్డి అని మండలం అని ఫేస్‌బుక్ స్టేటస్ పెట్టుకున్నాడని, ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి సీపీ పూర్తి వివరాలు వెల్లడిస్తే రాజకీయ గందరగోళానికి తావుండేది కాదన్నారు.


నిందితుడికి దళిత బంధు రాలేదన్న ఆగ్రహంతో దాడికి పాల్పడినట్లుగా ప్రచారం జరుగుతుందని, అతను మద్యం మత్తులో ఉన్నాడని, కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడ్డాడన్న ప్రచారాలు కూడా సాగుతున్నాయన్నారు. కాగా కత్తిదాడి ఘటన నేపధ్యంలో తమ కార్యకర్త స్వామిని పోలీసులు ఎత్తుకెళ్లారని, సోషల్ మీడియా కార్యకర్తపై దాడికి పాల్పడ్డారని రఘునందన్ రావు ఆరోపించారు. దుబ్బాక బీజేపీ కార్యాలయం పై దాడి చేశారని, కొంతమంది కౌన్సిలర్లు మా సిబ్బందిపై భౌతిక దాడి చేశారని ఈ దాడుల పట్ల పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని రఘునందన్‌రావు ఆరోపించారు. బీజేపీ నాయకుల ఇండ్లు, దుకాణాలపై దాడులు చేస్తున్నారన్నారు.


ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటే రఘునందన్ రావు దిష్టిబొమ్మ దహనం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో బీజేపీ కండువా కప్పినట్లు ప్రచారం జరుగుతున్న వ్యక్తి నిందితుడు కాదని, పోడేటి నరసింహులనే వ్యక్తి నిన్ననే బీఆరెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరాడని ఆయన పేర్కొన్నారు. దీనిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, అలాగే అధికార పార్టీ తొత్తుగా పనిచేస్తున్న సీపీపై కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.