ఎందుకింత ఆలస్యం? రెండో జాబితాపై పార్టీల దోబూచులు

- ఫిరాయింపులపై ఆశ.. భయం
- పార్టీలను వెంటాడుతున్న వైచిత్రి
- ప్రధాన పార్టీల జాబితాల కోసం
- ఎదురు చూస్తున్న బీఆరెస్ నేతలు
- అక్కడ టికెట్ రాని నేతలకు గాలం?
- ఇదేసందుగా బీజేపీ ఎదురుచూపు
- పోటీకి అభ్యర్థులు దొరుకుతారని ఆశ
- ఆసక్తికరంగా టికెట్ రాజకీయాలు
విధాత, హైదరాబాద్: ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అధికార బీఆరెస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి వెళ్లినప్పటికీ.. కాంగ్రెస్, బీజేపీ లిస్ట్‌లపై కన్నేసింది. మరోవైపు ఆచి తూచి తొలి జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్, బీజేపీలు.. రెండో జాబితాను విడుదలపై దోబూచులాడుతున్నాయి. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వెళ్లిన బలమైన నాయకులకు గాలం వేసిన కాంగ్రెస్ పార్టీ వారిని ఘర్‌వాపసీ పేరిట తిరిగి తీసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించింది. ఇదే కోవలో మరి కొంత మంది నేతలున్నట్లు సమాచారం. అలాంటి వారి కోసం రెండో జాబితాను ప్రకటించకుండా కాంగ్రెస్ తాత్సారం చేస్తుందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
ఈదఫా ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి రావడమే పరమావధిగా కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెట్టింది. రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో పాటు ఇతర సర్వే సంస్థల ద్వారా ఎప్పటికప్పుడు ఫ్లాష్ సర్వేలు చేయిస్తూ బలమైన అభ్యర్థులకే టికెట్ ఇచ్చే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే బీఆరెస్‌లో కీలకమైన నేతలుగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ జగదీశ్వర్‌గౌడ్, శ్రీహరిరావు, ఎమ్మల్యేలు మైనంపల్లి హన్మంతరావు, రేఖానాయక్, బాపూరావ్ రాథోడ్ లాంటి బలమైన నేతలను కాంగ్రెస్ చేర్చుకున్నది. వీరంతా వివిధ సందర్భాలలో తమ అనుచర గణంతో పార్టీలో చేరారు. తాజాగా గతేడాదే బీజేపీలోకి వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా సొంతగూటికి చేరేందుకు సిద్ధమయ్యారు.
ఇలా బీఆరెస్, బీజేపీలలోని బలమైన నేతలకు కాంగ్రెస్ గాలం వేసింది. దీంతో తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి ఎవరుపోతారో తెలియని పరిస్థితిలో బీజేపీ ఉన్నది. అందుకే అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తున్నదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి జాబితా ప్రకటించిన తరువాతనే తమ జాబితా ప్రకటించాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పూర్తి జాబితా ప్రకటించిన తరువాత తమ పార్టీలో ఎవరు ఉంటారు, ఎవరు పోతారన్న దానిపై స్పష్టత వస్తుందన్న ఆలోచనలో బీజేపీ అగ్రనేతలున్నట్లు సమాచారం. ఇదే సమయంలో కాంగ్రెస్‌లో టికెట్లు రాని వారు తిరుగుబాట్లు చేసే అవకాశం ఉంటుందని, అలాంటి వారిని పార్టీలోకి అహ్వానించి టికెట్లు ఇవ్వాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నది. ఇలా ఈ రెండు పార్టీలలో పార్టీ టికెట్లు రాని వారు తిరుగు బాటు చేసి తమ వైపు వచ్చే అవకాశం ఉంటుందన్న ఆశ ఒక వైపు.. మరోవైపు ఎవరు తమ పార్టీని వీడి ఎదుటి పార్టీలోకి పోతారోనన్న భయం కూడా ఆయా పార్టీల నేతలను వెంటాడుతున్నది.
బలమైన నేతలకు బీఆరెస్ గాలం
ఈ రెండు పార్టీలలో టికెట్ రాని బలమైన నేతలకు గాలం వేసి తమ పార్టీలో చేర్చుకోవాలన్న లక్ష్యంగా బీఆరెస్ పావులు కదుపుతున్నదని సమాచారం. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో తనకు టికెట్ రాదని తిరుగుబాటు ప్రకటించిన మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను వెంటనే కాంటాక్ట్ చేసి బీఆరెస్ లోకి తీసుకున్నారు. అలాగే గతంలో బీఆరెస్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన బీజేపీకి చెంది జిట్టా బాలకృష్ణారెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన చెరుకు సుధాకర్‌లను కూడా బీఆరెస్‌లోకి తీసుకున్నారు. వీరందరికీ పార్టీని మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత పదవులు ఇస్తామని ఆఫర్ ఇచ్చారన్న చర్చ నడుస్తున్నది. హోరాహోరీ పోరు తప్పదని, కాంగ్రెస్‌కే మొగ్గు ఉన్నదని పలు సర్వేలు వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క ఓటు కూడా చాలా విలువైందిగా మారిపోయింది. దీంతో వీళ్లు ఎన్నికల్లో పోటీచేయకపోయినా.. ఎంతో కొంత ప్రభావం చూపగలరన్న భావనతోనే వారిని పార్టీలోకి తీసుకున్నారని అంటున్నారు.
ఇదే తీరుగా కాంగ్రెస్, బీజేపీ లిస్ట్‌లు విడుదలైన తరువాత ఆయా పార్టీలలో తిరుగుబాటు చేసిన నేతలను ఇటువంటి ఆఫర్లతోనే పార్టీలోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇలా ముఖ్యంగా కాంగ్రెస్ లోని అసంతృప్తులు, తిరుగుబాటు నేతలను తీసుకొని కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే బీఆరెస్, బీజేపీలకు చిక్కకుండా ఏవిధంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలి? టికెట్ రాని నేతలను ఏవిధంగా సమాధాన పర్చాలన్న దిశగా కాంగ్రెస్ కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నది. ఈ మేరకు సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు, మాజీ మంత్రి జానారెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించింది. అలాగే మరో సీనియర్ నేత మల్లు రవిని కూడా రంగంలోకి దించింది. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్‌పార్టీ ఆచితూచి అడుగులేయడం ప్రత్యర్థి పార్టీలో చర్చనీయాంశంగా మారింది.