దసరా తర్వాత బీజేపీ రెండో జాబితా

దసరా తర్వాత బీజేపీ రెండో జాబితా

విధాత : దసరా తర్వాత బీజేపీ రెండో జాబితా వెల్లడిస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ నెల 27న అమిత్ షా, నెలఖారులో సీఎం యోగి ఆధిత్యానాథ్‌లు బీజేపీ ప్రచార సభల్లో పాల్గొంటారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ఫెయిలైందని, ప్రాజెక్టు భద్రతపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.


మూడేళ్లకే డ్యాం బ్రిడ్జీ కుంగిపోవడం నాణ్యతలోపానికి నిదర్శనమన్నారు. డ్యాం సెఫ్టీ కమిటీ సందర్శనకు కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖ రాస్తామన్నారు. బీజేపీ మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చెబుతునే ఉందన్నారు. అవినీతికి, కుటుంబ పాలనకు కాంగ్రెస్‌, బీఆరెస్‌లు రెండు కవల పిల్లలని కిషన్‌ రెడ్డి విమర్శించారు.