నదుల అనుసంధానం పేరుతో నాటకాలు
కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం పేరుతో కొత్త నాటకానికి తెరలేపిందని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు

*కరీంనగర్, వరంగల్ రైతాంగ
ప్రయోజనాలకు నష్టమే!
*గోదావరి జలాల్లో
తెలంగాణ వాటా తేల్చండి
*బీఆర్ఎస్ అభ్యర్థి
బోయినపల్లి వినోద్ కుమార్
విధాత బ్యూరో, కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం పేరుతో కొత్త నాటకానికి తెరలేపిందని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. నిరంతరం ప్రవహించే గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ద్వారా ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా ఎంతో తేల్చేంతవరకు ఇచ్చంపల్లికి సంబంధించిన ప్రస్తావన పక్కన పెట్టాలన్నారు.
ఇచ్చంపల్లి వద్ద డ్యామ్ నిర్మించి గోదావరి జలాలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.నదుల అనుసంధానం ద్వారా పెద్ద ఎత్తున అడవులు, వ్యవసాయ భూములకు ముప్పు ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.నదీ జలాల పంపిణీ వ్యవహారానికి సంబంధించిన ఎంఓయులను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు పంపడం అర్థంలేని విధానం అన్నారు.
ఎం ఓ యు పత్రాలపై సంతకాలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిస్పందన ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి నలుగురు బిజెపి ఎంపీలు ఉన్నా, దీనిపై ఏమాత్రం స్పందించడం లేదన్నారు.1985లో ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి సర్వే పనులు జరిగాయని, నాడు ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు.
గోదావరి బేసిన్ లో తెలంగాణ వాటా కింద 968 టీఎంసీల నీరు రావాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ రైతాంగం దశాబ్దాల తరబడి సాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనంతరమే వారి బాధలు తొలగిపోయాయని చెప్పారు. ఇటు కాళేశ్వరం, అటు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులలో ఏ ఒక్క దానికి జాతీయ హోదా ఇవ్వకుండా, గోదావరి నీటిని కృష్ణకు అక్కడి నుండి కావేరికి ఎలా తరలిస్తారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే నదుల అనుసంధాన ప్రక్రియను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 47 టీఎంసీల సామర్థ్యం కలిగిన సమ్మక్క బ్యారేజీకి ఇంకా అనుమతులు రాలేదని, సీతారామ, వార్థా ప్రాజెక్టుల అనుమతులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టు వద్ద కాపర్ డ్యాం నిర్మించకపోవడం వల్లనే 50 టీఎంసీలకు పైగా నీటిని వృధాగా సముద్రం పాలు చేయాల్సివచ్చిందన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు, నాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.