టూరిస్ట్ నేతలను ప్రజలు నమ్మరు

- నామినేషన్ రోజే తన విజయం ఖాయమైంది
- కాంగ్రెస్ పాలనలో గల్లీకో క్లబ్
- కోదాడ బీఆరెస్ అభ్యర్థి బొల్లం
- అట్టహాసంగా నామినేషన్ దాఖలు
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: కోదాడలో టూరిస్ట్ నేతలను ప్రజలు నమ్మరని, నామినేషన్ రోజే తన విజయం ఖాయమైందని కోదాడ బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన ఎజెండా అన్నారు. బుధవారం కోదాడ బీఆర్ఎస్ అభ్యర్థిగా బొల్లం మల్లయ్య యాదవ్ నామినేషన్ వేశారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.
ఐదేళ్లుగా కోదాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, గ్రామాల్లో సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చిన తీరును వివరించారు. అని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. ప్రజల ఆశీస్సులతోనే అధిష్టానం ఆశీస్సులు తనపై ఉన్నాయని చెప్పారు. ‘ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడలో కాంగ్రెస్ పార్టీకి 50 వేల మెజార్టీ వస్తుందని మాయ మాటలు చెప్తుండు. ఎందుకు? పేకాట క్లబ్బులు, జూదపు గృహాలు, మద్యం సిండికేట్ చేసినందుకా? ఆయనకి 50,000 మెజార్టీ వచ్చేది.
మునగాల పరగణాలు హత్యా రాజకీయాల వెనుక ఉన్నది ఎవరో కోదాడ నియోజకవర్గ ప్రజలకు తెలుసు’ అన్నారు. కాంగ్రెస్ పరిపాలనలో గల్లీకో క్లబ్ నడిపించిన నాయకుడెవరో ప్రజలందరికీ తెలుసు అన్నారు. చెరువులను లూటీ చేయించి కేసులు పెట్టించిన చరిత్ర ఉత్తమ్ దే అన్నారు. పార్టీలు, కులాల పేరు మీద కొట్లాటలు పెట్టి హత్యా రాజకీయాలకు తెరలేపింది ఉత్తంకుమార్ రెడ్డి, చందర్రావులని ధ్వజమెత్తారు.
2014 ఎలక్షన్ లో సూర్యాపేటలో రూ.5 కోట్లు కారులో కాలిపోయాయని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలకు తెలుసన్నారు. కల్తీ సారా వ్యాపారం చేసి, ప్రజల జీవితాలతో చెలగాటమాడి, జైలుకు పోయి వచ్చినాయన కూడా రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. 2018 కంటే ముందు నియోజకవర్గాల్లోని పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు, 2018 తర్వాత నేటి వరకు నమోదైన కేసులు చూస్తే ఎవరిది శాంతియుతమైన పాలనో అర్థమవుతుందని పేర్కొన్నారు.
పోలీస్ స్టేషన్ కు వచ్చి కేసులను చూసుకోవాలని సవాల్ చేశారు. ఉత్తంకుమార్ రెడ్డి కులాన్ని అడ్డం పెట్టుకొని కుల రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 2009లో ఈ నియోజకవర్గం చెప్పాపెట్టకుండా ఎందుకు పారిపోయాడో ప్రజలందరికీ తెలుసు అన్నారు. బీఆర్ఎస్ లో చేరడానికి బేరసారాలు ఆడారని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అఖండ విజయం సాధిస్తుందన్నారు. అభివృద్ధి తమ విజయానికి రహస్యం అన్నారు. ప్రజలు అభివృద్ధిని ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు.