వేనేపల్లి, ఉత్తం కోవర్టులు: కోదాడ ఎమ్మెల్యే బొల్లం

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: కోవర్ట్ రాజకీయాలకు ప్రతినిధులు వేనేపల్లి చందర్రావు, ఉత్తంకుమార్ రెడ్డి అని, కన్నతల్లి వంటి పార్టీకి ద్రోహం చేస్తున్నారని కోదాడ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. బుధవారం అనంతగిరి మండలం శాంతినగర్లోని శశిధర్ రెడ్డి స్వగృహంలో ఆపార్టీ ఎన్నికల పరిశీలకులు తక్కెళ్లపల్లి రవీందర్రావు, కోదాడ నియోజకవర్గ మాజీ ఇంచార్జి శశిధర్ రెడ్డితో కలిసి బొల్లం విలేకరులతో మాట్లాడారు. ఈనెల 29న సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కోదాడలో పేకాట క్లబ్బులు, మూడుముక్కల ఆట, మద్యం సిండికేట్, చేపల చెరువు, పిచ్చి సారా, లాడ్జి వ్యాపారాలు నడిపింది ఉత్తం కాదా అని మండిపడ్డారు. ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని, ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టి పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. తక్కెళ్ళపల్లి రవీందర్రావు మాట్లాడుతూ అధికారానికి దూరమైన కొంతమంది స్థానిక శాసనసభ్యులపై దుష్ప్రచారాలు చేశారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులు శశిధర్ రెడ్డి మాట్లాడుతూ 2018లో వెనపల్లి చందర్రావు తోనే పార్టీ టికెట్ కోల్పోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి ఎంతో జరిగిందని, పార్టీ వీడడానికి మనసు ఒప్పుకోలేదన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు అజయ్ కుమార్, కాసాని వెంకటేశ్వర్లు, ఏలూరి వెంకటేశ్వరరావు, శీలం సైదులు, పాలడుగు ప్రసాద్, సతీష్ పాల్గొన్నారు.