JAC of VROs | పూర్వ వీఆర్వోలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోండి : వీఆర్వోల జేఏసీ

పూర్వ వీఆర్వోలను రెవెన్యూ శాఖలోకి తిరిగి తీసుకోవాలని వీఆర్వోల జేఏసీలు ప్రభుత్వాన్ని కోరాయి. కేసీఆర్ నేత్రుత్వంలోని బీఆరెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికార వ్యవస్థ రద్దు చట్టం2020 తో రద్దు చేయాలన్నారు.

JAC of VROs |  పూర్వ వీఆర్వోలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోండి : వీఆర్వోల జేఏసీ

విధాత: పూర్వ వీఆర్వోలను రెవెన్యూ శాఖలోకి తిరిగి తీసుకోవాలని వీఆర్వోల జేఏసీలు ప్రభుత్వాన్ని కోరాయి. కేసీఆర్ నేత్రుత్వంలోని బీఆరెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికార వ్యవస్థ రద్దు చట్టం2020 తో రద్దు చేయాలన్నారు. అలాగే వీఆర్వోలను రీడిప్లయిమెంట్ చేయడం కోసం జారీ చేసిన జీవో 121ను వెంటనే రద్దు చేయాలని కోరారు. “రీడెప్లాయిమెంట్” పేరుతో “లాటరీ విధానం”లో ఏకపక్షంగా, నియంతృత్వంగా రెవెన్యూ శాఖ నుంచి తప్పించి, వేర్వేరు శాఖలకు బదిలీ చేయడంతో మా ఉద్యోగ జీవితాలు, హక్కులు కాలరాయబడ్డాయన్నారు. తమకు జరిగిన అన్యాయంపై కలెక్టర్లకు, మంత్రులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు సమర్పించామని తెలిపారు.

పూర్వ వీఆర్వోలను ప్రభుత్వానికి వెలుపల “సొసైటీలు (మైనారిటీ పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూళ్ళు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, మహాత్మా జ్యోతిభా ఫూలే విద్యా సంస్థలు); ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు; స్వయంప్రతిపత్తి సంస్థలు”లో నియమించారని, దీంతో 010 పద్దు కింద వేతనాలు రావడం లేదన్నారు. తమ వేతనాల నుంచి జీపీఎఫ్, సీపీఎస్, టీఎస్ జీఎల్ ఐ చందా చెల్లింపులు నిలిచిపోయాయని తెలిపారు. దీంతో తమ పదవీ విరమణ అనంతర సామాజిక భద్రత ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐ ఆర్ అమలు కావడం లేదని, తమ కుటుంబాలకు కారుణ్య నియామకాల వెసులుబాటు లేదన్నారు. ఆరోగ్యం, పిల్లల చదువుల విషయమై రాయితీ పొందే సౌకర్యాన్ని కోల్పోయామని తెలిపారు. పాత డీఏ, పీఆర్సీ తదితర బకాయిలు రావడం లేదన్నారు. సొసైటీలు, కార్పొరేషన్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ మేరకు 3 నెలలకోసారి వేతనాలు చెక్కుల రూపంలో ఇస్తున్నారన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖలలో శాంక్షన్డు పోస్టులు లేక జూనియర్ అసిస్టెంట్ కంటే తక్కువ స్థాయి పోస్టుల్లో నియమించారన్నారు. కొన్ని శాఖల్లో రివర్షన్ ఇచ్చారన్నారు. భద్రాద్రి కొత్తగూడెం గిరిజన సహకార సంఘానికి బదిలీ అయిన 16 మందికి 22 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని జేఏసీ నాయకులు గరికె ఉపేందర్ రావు, చైర్మన్ గోల్కొండ సతీష్ లు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో… లబ్ధిదారుల ఎంపిక అంతకన్నా ముఖ్యమన్నారు. గ్రామ స్థాయిలో వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి వివరించినట్లు సతీష్ తెలిపారు. వినతిపై స్పంధించిన వివేక్ వెంకట స్వామి వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న అంశం వాస్తవమేనని ఈ అంశంపై మాకు పూర్తి అవగాహన ఉన్నదని అసెంబ్లీలో ప్రస్తావన పెట్టి ప్రజలకు మేలు జరిగే విధంగా వ్యవస్థను తీసుకొచ్చే కృషి చేస్తామని చెప్పారన్నారు. వివేక్ వెంకటస్వామిని కలిసిన వారిలో అదనపు సెక్రటరీ జనరల్ పల్లెపాటి నరేష్, వైస్ చైర్మన్లు చింతల మురళి,క్యాదరి ప్రతిభ, జిల్లా జేఏసీ కోశాధికారి శేఖర్ లున్నారు.