ఓటరన్న దెబ్బకు.. జనబాహుళ్యంలోకి గులాబీ నేతలు
ఓటు మీ చేతిలో వజ్రాయుధం.. నిశ్శబ్ద విప్లవం.. ఇవన్నీ నినాదాలకే

- నాడు మంత్రులకు సైతం దక్కని దర్శనం
- నేడు సామాన్యుల లోగిళ్లకు గులాబీ దళపతులు
- ఓటమి తర్వాత జనబాహుళ్యంలోకి కేటీఆర్, హరీశ్, కవిత
విధాత : ఓటు మీ చేతిలో వజ్రాయుధం.. నిశ్శబ్ద విప్లవం.. ఇవన్నీ నినాదాలకే పరిమితమని, అధికారం, కులం, ధనం వంటి అవలక్షణాలతో కూడిన ఎన్నికల వ్యవస్థలో ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురవుతూనే ఉంటుందనే ఆలోచనతో ఉన్న వారికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కనువిప్పుగానే చెప్పవచ్చుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చి ఫక్తు రాజకీయ పార్టీగా మారి, రెండో దఫాలో పార్టీ పేరులోని ఆత్మనే తొలగించుకుని తొమ్మిదిన్నరేళ్లు బీఆరెస్ అధికారంలో ఉన్నది. ఆ కాలంలో బీఆరెస్ అధినేత, అప్పటి సీఎం కేసీఆర్, నంబర్ 2గా ఉన్న కేటీఆర్‌ను కలువడం అత్యంత దుర్లభం. గడీలను తలపించే ప్రగతి భవన్ గేట్లు దాటి ఏలికలను కలువడమంటే దేవర దర్శనమైనట్లే. ముందస్తు అనుమతి, పిలుపు లేనిదే ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలువడం ఎంతటివారికైనా కష్టతరమే.

ప్రగతి భవన్‌కు వెళ్లి వారిని కలిసేందుకు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు నెలల తరబడి నిరీక్షించిన దాఖలాలున్నాయి. గద్దర్, మోత్కుపల్లి, జూపల్లి, ఈటల, దర్శక నిర్మాత నర్సింగ్‌రావు వంటి వారు సీఎంను కలువడం ఎంత కష్టతరమో తమ అనుభవాలతో వెల్లడించారు. తాను పదేళ్లలో 30సార్లు అప్పటి సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించి విఫలమయ్యానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వంటి వారు ఇటీవల వెల్లడించారు. ఇక సామాన్య జనం సీఎంను, కేటీఆర్ వంటి వారిని కలువడం కలలో మాటే. అలాంటి గడీ సంస్కృతికి చరమ గీతం పాడాలన్న ప్రతిపక్షాల పిలుపు వల్లో.. లేక మార్పు కోరిన ప్రజా తీర్పుతోనో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ ఓటమి పాలై గద్దె దిగిపోయింది. అయితే కుటుంబ కేంద్రంగా, వ్యక్తిపూజ తరహాలో సాగిన బీఆరెస్ నాయకత్వంలో కాలుజారి పడిన కేసీఆర్ ప్రస్తుతానికి ఇంటికి పరిమితమవ్వగా, పార్టీలో నంబర్ 2, 3, 4లుగా ఉన్న కేటీఆర్, హరీశ్‌రావు, కవితలు ప్రతిపక్ష పార్టీగా బీఆరెస్‌ను ముందుకు నడిపిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్ననన్నేళ్లూ ఈ నలుగురిదే మాటగా ఉండగా.. ఆ వాసనలు ఇప్పుడప్పుడే వదిలేట్టు కనిపించడం లేదు. అసెంబ్లీలో అదే కేటీఆర్.. అదే హరీశ్‌రావు.. మండలిలో అదే కవిత.. అన్నట్టు సాగిందని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా పార్టీలో ఇతర కీలక నేతలను, అనుభవజ్ఞులను ముందుకు తీసుకురావాలన్న ఆలోచన వారికి లేదని అంటున్నారు. ఈ పరిస్థితిలో సహజంగానే ఇతర నాయకులు ఎప్పటిలాగే నామమాత్రపు పాత్రకు పరిమితమైపోయారు.
ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే.. నాడు గడీకి మారుపేరుగా ప్రతిపక్షాలు అభివర్ణించిన ప్రగతిభవన్ వీడి ఎన్నికల సమయంలో తప్ప సామాన్యుల మధ్యలోకి, పార్టీ కార్యకర్తల వద్దకు అమాస పున్నానికి కూడా రాని యువరాజు కేటీఆర్ అధికారం పోయాక జనంలో విరివిగా కనిపిస్తున్న ఘటనలు రాజకీయ, మేధావి, విద్యార్థి వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో పర్యటించారు. కొత్త జంటలను ఆశీర్వదిస్తూ, ఆప్తులను కోల్పోయిన కుటుంబాలను పరామర్శిస్తూ, గ్రామాల్లోని పలువురిని పలకరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో ఉన్న వారిని దవాఖానలో చేర్పించి బాగుచేస్తానని హామీ ఇచ్చారు. కేటీఆర్ వ్యవహారశైలి చూసిన సొంత పార్టీ శ్రేణులే మా నాయకులు ఎప్పుడూ ఇలాగే సాధారణ పద్ధతిలో అందుబాటులో ఉంటే ఎంతబావుంటుందనే ఆకాక్షలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు మాజీ మంత్రి టీ హరీశ్‌రావు వరుసగా కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటున్నారు. దారి మధ్యలో టీ స్టాల్స్ వద్ద ఆగి జనంతో మమేకమవుతున్నారు. కార్యకర్తలతో ముచ్చటిస్తున్నారు. అటు ఎమ్మెల్సీ కవిత సైతం అదే దారిలో కార్యకర్తలను కలుస్తూ, పిలిచిన కార్యక్రమాలకు హాజరవుతూ జనంలో సందడి చేస్తున్నారు. ఇందుకు ఒక రకంగా ముంచుకొస్తున్న లోక్‌సభ ఎన్నికలు కూడా కొంత కారణమై ఉండొచ్చు. అయితే ప్రతిపక్ష పాత్రలోకి వచ్చాక కేటీఆర్, హరీశ్, కవిత వ్యవహారశైలి చూస్తున్న పార్టీ శ్రేణులు, రాజకీయ వర్గాలు అధికారంలో ఉన్నప్పుడు వారు వ్యవహరించిన తీరును బేరీజు వేస్తున్నాయి. కొంత విషయ పరిజ్ఞానమున్న వారు మాత్రం అధికారమిస్తే గానీ ఓ మనిషి నిజస్వరూపమేమిటో తెలుస్తుందన్న ఓ మేధావి కొటేషన్‌ను గుర్తు చేస్తున్నారు. ఇంకొందరు గులాబీ పార్టీ నేతల ప్రవర్తనలో మార్పుకు ఓటు ఆయుధంతో ప్రజలిచ్చిన తీర్పునే కారణమంటున్నారు. ఎన్నికలకు ముందు అంతా భేషుగ్గానే ఉందని ఢంకా బజాయించి చెప్పిన కేటీఆర్.. ఏది ఏమైనా స్వేద పత్రం విడుదల సందర్భంగా ఓటమి నుంచి నేర్చుకునే అంశాలు కొన్ని ఉన్నాయని అంగీకరించాల్సి వచ్చింది. వాటిని నేర్చుకుని, ప్రజలకు దగ్గరగా ప్రతిపక్ష పాత్రలో ఎంత మేరకు వాటి అనుభవాలను ఆచరణలో పెడతారో మునుముందు చూడాల్సిందేనని విశ్లేషకులు చెబుతున్నారు.