గ్రామస్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు..బీఆరెస్ పునర్వ్యవస్థీకరణ!
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, అంతలోనే ముంచుకొస్తున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీని పునర్వ్యవస్థీకరించే దిశగా బీఆరెస్ అడుగులు వేస్తున్నది

- పార్టీ అధినేత కేసీఆర్ ఆలోచిస్తున్నారు
- చురుకైన నేతల సేవలను ఉపయోగించుకుంటాం
- జిల్లా కేంద్రంగా ఉధృతంగా పార్టీ కార్యకలాపాలు
- బీఆరెస్ ఎమ్మెల్సీల భేటీలో మాజీ మంత్రి కేటీఆర్
విధాత: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, అంతలోనే ముంచుకొస్తున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీని పునర్వ్యవస్థీకరించే దిశగా బీఆరెస్ అడుగులు వేస్తున్నది. పార్టీని గ్రామస్థాయి నుంచి పొలిట్‌బ్యూరో వరకూ పునర్వ్యవస్థీకరించాలని పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్సీల సమావేశంలో, మహబూబ్‌నగర్ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. చురుకైన నాయకులు, కార్యకర్తల సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.
ఎమ్మెల్సీలతో త్వరలో కేసీఆర్ భేటీ
త్వరలో కేసీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలతో సమావేశం ఉంటుందని కేటీఆర్ చెప్పారు. అందులో శాసన మండలి పార్టీ నేతను ఎన్నుకుంటారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభ, మండలిలో పార్టీ తరఫున ఒత్తిడి చేద్దామని సూచించారు. హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తే అసెంబ్లీలో ఉన్న బలమైన ప్రతిపక్షాలు శాసనసభ, మండలి వేదికగా ప్రజల తరఫున ప్రశ్నించాలన్నారు. శాసనమండలి సభ్యులు పార్టీకి కండ్లు, చెవుల మాదిరిగా పనిచేయాలని కోరారు. ఎమ్మెల్సీలు ఇప్పటికే తమ ఇన్‌చార్జ్ నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను మరింత యాక్టివేట్ చేస్తామన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆరెస్ గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు విస్తృతంగా పనిచేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది అంతా వరుసగా వివిధ ఎన్నికలు ఉన్నందున వాటిని ఎదుర్కొనేందుకు పార్టీ సంసిద్ధంగా ఉండాలన్నారు.