పాలమూరుకు అధినేతలు క్యూ

బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్ర నేతలంతా పాలమూరు జిల్లా వైపే అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

పాలమూరుకు అధినేతలు క్యూ

– 26న వనపర్తికి సీఎం కేసీఆర్

– 31న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ రాక

– అందరి చూపు వనపర్తి, కొల్లాపూర్ పైనే

– ఇదివరకే ప్రచారం చేసిన ప్రధాని మోడీ

– వేడెక్కుతున్న రాజకీయం

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్ర నేతలంతా పాలమూరు జిల్లా వైపే అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో పార్టీల అధినేతలు ఇక్కడి స్థానాలపైనే ఫోకస్ పెట్టారు. ఈ జిల్లాలో ఎక్కువ స్థానాలు వస్తే, ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందనే భావనలో ఉన్నారు. అన్ని పార్టీల కేంద్ర, రాష్ట్ర నేతలు ఇక్కడ ప్రచారం చేసేందుకు క్యూ కడుతున్నారు. బీజేపీ తరపున ప్రధాని మోడీ ఇప్పటికే పాలమూరులో భారీ బహిరంగ సభ నిర్వహించి, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

ఎప్పుడూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాలమూరు నుంచే మోడీ ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఇదివరకే వనపర్తిలో మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, దేవరకద్రలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. జడ్చర్లలో నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి మద్దతుగా ఈసభ ద్వారా కేసీఆర్ ప్రచారం నిర్వహించారు.

మళ్ళీ ఈనెల 26న మంత్రి నిరంజన్ రెడ్డి గెలుపు కోసం వనపర్తిలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. అంతకు ముందే ప్రజలను తమ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. నిరంజన్ రెడ్డి 2018 ఎన్నికల్లో విజయం పొంది, మంత్రి పదవి దక్కించుకున్నారు. కేసీఆర్ కు సన్నిహితుడిగా పేరొందారు. వనపర్తి అభివృద్ధిలో నిరంజన్ రెడ్డి పాత్ర కీలకంగా ఉండడంతో ఈ సారి గెలుపు తనదే అన్న ధీమాలో ఉన్నారు.

కొల్లాపూర్ కు ప్రియాంక గాంధీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 31న ఏఐసీసీ నాయకురాలు, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ కొల్లాపూర్ పట్టణానికి వస్తున్నారు. ఇక్కడి కాంగ్రెస్ నేతల్లో అసమ్మతి ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం ప్రియాంక గాంధీని ఎన్నికల ప్రచార రంగంలోకి దింపింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అసమ్మతి సెగ తగిలింది. ఇక్కడ ఎంతోకాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలందించి కార్యకర్తలకు అండగా ఉన్న చింతలపల్లి జగదీశ్వర్ రావుకు టికెట్ ఇవ్వక పోవడంతో ఆయన పార్టీని వీడారు.


ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నారు. కాంగ్రెస్ క్యాడర్ కొంత ఈయన వెంట వెళ్లడంతో జూపల్లికి కొంతనష్టం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీ పర్యటన ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పార్టీని నమ్ముకున్న నాయకులను పక్కన పెట్టి, కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇవ్వడంతో ఇక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు అసహనానికి గురవుతున్నారు. 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి తెరాస అభ్యర్థి జూపల్లి కృష్ణారావును ఓడించారు. విజయం సాధించిన హర్ష వర్ధన్ కొంతకాలానికి తెరాసలో చేరారు. అప్పటి నుంచి తెరాస పార్టీ జూపల్లిని పక్కకు నెట్టేసింది. ఈ ఎన్నికల్లో హర్ష వర్ధన్ కే బీఆర్ఎస్ టికెట్ రావడంతో జూపల్లి కాంగ్రెస్ లో చేరి టికెట్ పొందారు. మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చేందుకు రాష్ట్ర నేతలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కొల్లాపూర్ లో ప్రియాంక సభ కాంగ్రెస్ కు కలిసి వస్తుందని ఆపార్టీ నేతలు ఆశిస్తున్నారు.