పాలమూరులో ముగ్గురూ ముగ్గురే
పాలమూరు నియోజకవర్గంలో ప్రధాన పార్టీల ప్రచార పర్వం ఊపందుకుంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు

- ప్రచారంలో దుసుకుపోతున్న మూడు పార్టీల అభ్యర్థులు
- పోటాపోటీగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచారం
- నామినేషన్ కోసం ముహూర్తానికి ఎదురుచూపు
- మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, మిథున్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ
- హామీల వర్షం కురిపిస్తున్న అభ్యర్థులు
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పాలమూరు నియోజకవర్గంలో ప్రధాన పార్టీల ప్రచార పర్వం ఊపందుకుంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల్లో ముగ్గురు అభ్యర్థుల బెర్తులు ఖరారు కావడంతో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మిథున్ రెడ్డి రాజకీయాలకు కొత్త కాగా, తన తండ్రి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి రాజకీయ అనుభవంతో ప్రజలతో మమేకమవుతూ ప్రజాదరణ పొందుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్నం శ్రీనివాస్ రెడ్డి ఇదివరకే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
పరిచయం మేరకు ఉధృత ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ పదేళ్ల రాజకీయ అనుభవంతో తనదైన శైలితో ఇప్పటికే నియోజకవర్గం మొత్తం చుట్టివచ్చారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు కావడంతో నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో రెండు మండలాలు మాత్రమే ఉండడంతో అభ్యర్థుల ప్రచారానికి ఎక్కువ సమయం దొరుకుతోంది. మహబూబ్ నగర్, హన్వాడ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. గ్రామీణ ప్రజలను ఆకర్షించేందుకు ఆయా పార్టీలు ప్రకటించిన హామీలు ఇస్తూ ఓటర్లను తమవైపునకు తిప్పుకునే పనిలో పడ్డారు.
సొమ్ము ఒకరిది… సోకు మరొకరిది: మిథున్ రెడ్డి
సొమ్ము బీజేపీది అయితే… సోకు బీఆర్ఎస్ ది అని బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం మహబూబ్ నగర్ మండలంలోని కోడూరు, అప్పయిపల్లి, కోడూరు చౌరస్తాలో ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మిథున్ రెడ్డి మాట్లాడారు. పేదలను ఆదుకునేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ తెలంగాణకు నిధులు పంపిస్తుంటే.. ఇక్కడి బీ ఆర్ఎస్ ప్రభుత్వం తన పేరు చెప్పుకుని పథకాలు అమలు చేస్తున్నదని అన్నారు.
డబ్బులు కేంద్రం పంపిస్తే, ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత అవసరాలకు వాడుకుని కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం పంపించే నిధులే అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
దుర్మార్గ పాలనను అంతం చేయాలి: ఎన్నం శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తోందని, దీన్ని అంతం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం హన్వాడ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం చేపట్టారు. రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని, ఈ పథకం వైస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకమే అని అన్నారు. పాలవంటి పాలమూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ లాంటి విషపు చుక్కలు పడ్డాయని, అవి తాగడానికి పనిరాకుండా అయ్యాయన్నారు.
ఇక్కడి ప్రజలకు మాయమాటలు చెప్పి పాలమూరును దోచుకున్నారని విమర్శించారు. బీ ఆర్ఎస్ నాయకుల మాటలు కూడా కాలుష్యమే అని, ఉన్నవి.. లేనివి చెప్పి పాలమూరును ఊడ్చి పడేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ సొంత ఎజెండా లేకుండా ప్రజల బాగుకోసమే పని చేస్తుందన్నారు. ఈ సందర్బంగా పిల్లిగుండు తండాకు చెందిన బీఆర్ ఎస్ కార్యకర్తలు ఎన్నం సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరెంట్ కష్టాలు తప్పవని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం హన్వాడ మండలంలోని కొత్తపేట, అత్యకుంట తండాలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో రైతులు ఆనందంగా ఉన్నారని, వారి కోసం రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ ఇచ్చి ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటే అని అన్నారు.
ఈ ఎన్నికల తరువాత ఆసరా పింఛన్ విడతల వారీగా రూ.5 వేలు ఇస్తామన్నారు. గృహలక్ష్మి పథకం కింద ఇల్లులేని పేదలకు రూ.5 లక్షలు అందిస్తామని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఇంత మంచి సర్కార్ ను ప్రజలు వదులుకోరనే భరోసా మాకు ఉందన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.