CM Revanth Reddy | ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి..క్షత్రియులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని క్షత్రియులకు ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. వారికి సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు.

ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది
సిటీ అభివృద్ధిలో క్షత్రియులూ భాగస్వాములే
కఠోర శ్రమతోనే క్షత్రియులు రాణించారు
క్షత్రియ సేవాసమితి ఏర్పాటు చేసిన అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
హైదరాబాద్ : హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని క్షత్రియులకు ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. వారికి సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు. క్షత్రియ భవన్కు కావాల్సిన స్థలం, అవసరమైన సహకారం తమ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. హైదరాబాద్ అన్ని రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశంసించారు. రాజులు ఏ రంగంలోనైనా రాణిస్తారని, ఇందుకు వారి శ్రమ, పట్టుదలే కారణమని చెప్పారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటుచేసిన అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కృష్ణంరాజు. ఇప్పుడు హాలీవుడ్ తో పోటీ పడేలా రాణించిన బాహుబలి ప్రభాస్’ అని అన్నారు. కఠోరమైన శ్రమ, పట్టుదల కారణంగానే వివిధ రంగాల్లో క్షత్రియులు రాణించారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బోసురాజు అత్యంత క్రియాశీల పాత్ర పోషించారని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోయినా పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేశారని, ఆయన కష్టాన్ని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గుర్తించారని, వారి నిబద్ధతకు ప్రాధాన్యతనిస్తూ వారిని మంత్రిని చేశారని తెలిపారు. నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు ఉంటుందనడానికి బోసురాజు, శ్రీనివాస వర్మ ఒక ఉదాహరణ అని రేవంత్రెడ్డి చెప్పారు. రాజులలో రాజకీయాల్లో రాణించాలని ఉన్నవాళ్లను మీరు ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కోరారు. వారికి తప్పకుండా అవకాశం కల్పిస్తామని క్షత్రియ సోదరులకు మాట ఇస్తున్నానని చెప్పారు.
‘మీ తరపున తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారుగా శ్రీనివాస రాజు ఉన్నారు. మీ సమస్యలను వారి ద్వారా నా దృష్టికి తీసుకురండి. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కో చైర్మన్ గా శ్రీని రాజును నియమించాం. ఇది క్షత్రియులపై మాకున్న నమ్మకానికి నిదర్శనం’ అని రేవంత్రెడ్డి చెప్పారు. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ స్ఫూర్తితో తాము ప్రజా సమస్యలపై కొట్లాడామని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిలో క్షత్రియులు కూడా భాగస్వాములేనని, వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని చెబుతూ.. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని రాజులందరికి పిలుపునిచ్చారు.